అప్పులు తెచ్చారు... ఆస్తులు పెంచలేదు

రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరంలో తెచ్చిన రుణాల్లో 80 శాతం రెవెన్యూ వ్యయాలకే వెచ్చించడాన్ని కాగ్‌ తప్పుబట్టింది. దాని వల్ల ఆస్తుల కల్పన ప్రక్రియ కుంటుపడిందని

Updated : 27 Nov 2021 05:19 IST

రుణాల్లో 80శాతం రెవెన్యూ ఖర్చులకే

వ్యయ నియంత్రణలో విఫలం

ఇలా అయితే భవిష్యత్తులో తలకుమించిన రుణభారం

ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన కాగ్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరంలో తెచ్చిన రుణాల్లో 80 శాతం రెవెన్యూ వ్యయాలకే వెచ్చించడాన్ని కాగ్‌ తప్పుబట్టింది. దాని వల్ల ఆస్తుల కల్పన ప్రక్రియ కుంటుపడిందని పేర్కొంది. భౌతిక, ఆర్థికపరమైన ఆస్తుల్ని సమకూర్చని ప్రభుత్వ ఖర్చులన్నీ రెవెన్యూ ఖర్చులుగా పరిగణిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల సాధారణ నిర్వహణ కోసం చేసే ఖర్చులు, సంక్షేమ పథకాలు, సేవలు, ప్రభుత్వం తీసుకున్న అప్పుల మీద వడ్డీల చెల్లింపులు వంటివి రెవెన్యూ ఖర్చుల్లోకి వస్తాయి. తెచ్చిన రుణాల్ని ఆస్తుల కల్పనకు బదులు, ఇలా రెవెన్యూ వ్యయాల కోసం ఎక్కువ వెచ్చించడం వల్ల భవిష్యత్తులో రాష్ట్రం తీర్చాల్సిన రుణ భారం బాగా పెరిగిపోతుందని కాగ్‌ ఆందోళన వ్యక్తంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బడ్జెటేతర రుణాలను పద్దుల్లో చూపకపోవడం వల్లే ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడే ఉన్నట్లు కనిపిస్తున్నాయని, వాటినీ పరిగణనలోకి తీసుకుని ఉంటే నిర్దేశిత పరిధులను దాటేసి ఉండేవని తెలిపింది. ప్రభుత్వం తనకు వచ్చే ఆదాయంపై వాస్తవిక అంచనాలు రూపొందించుకోవడంలోనూ, రెవెన్యూ వ్యయ నియంత్రణలోనూ విఫలమైందని, అందుకే రెవెన్యూ లోటు గణనీయంగా పెరిగిందని పేర్కొంది. ‘14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2015-20 మధ్య రెవెన్యూ లోటు భర్తీకి రూ.22,112 కోట్లు ఇచ్చినప్పటికీ... రెవెన్యూ లోటుని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. మొత్తం రెవెన్యూ రాబడుల్లో... రెవెన్యూ లోటు 2018-19లో 12.12 శాతం ఉండగా, 2019-20లో 23.81 శాతంగా నమోదైంది. 2018-19తో పోలిస్తే ఇది 90.24 శాతం పెరిగింది. 2019-20 బడ్జెట్‌ అంచనాల్లో ప్రభుత్వం రెవెన్యూ లోటుని రూ.1,779 కోట్లుగా చూపించగా, అది ఏకంగా రూ.26,441 కోట్లుగా నమోదైంది. అమ్మఒడి, తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ వంటి పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు, ప్రభుత్వ సొంత ఆదాయం రూ.1,511 కోట్లు తగ్గడం దీనికి కారణం’ అని కాగ్‌ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు సంబంధించి కాగ్‌ తన నివేదికలో ప్రస్తావించిన కొన్ని ముఖ్యాంశాలు ఇవీ..!

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని సవరించినా లక్ష్యాలకు దూరం..!

* రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాలను 2020 డిసెంబరులో సవరించి, 2020 ఆగస్టు 30 నుంచి అమల్లోకి వచ్చేలా చేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో నిర్దేశించిన ద్రవ్య పరిమితుల అంచనాల్ని 2015-16 నుంచి 2019-20 వరకు కూడా వర్తించేలా మార్పులు చేసింది. అంత చేసినప్పటికీ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, 14వఆర్థిక సంఘం నివేదికలో నిర్దేశించిన లక్ష్యాల్ని చేరుకోలేకపోయాయి.

* రెవెన్యూ ఖర్చుల్ని మూలధన వ్యయంగా చూపడం, ప్రభుత్వ పద్దుల్లో ఇతర రుణాలను చూపకపోవడం వంటి సందర్భాలూ ఉన్నాయి. అవి సక్రమంగా చూపించి ఉంటే... రెవెన్యూ, ద్రవ్య లోటు మరింత పెరిగేవి.

* రాష్ట్ర ప్రభుత్వం తరపున వివిధ ప్రభుత్వ సంస్థలు 2020 మార్చి నెలాఖరు నాటికి రూ.26,096.98 కోట్ల రుణాలు తీసుకున్నాయి. ప్రభుత్వ గ్యారంటీతో తీసుకున్న ఈ రుణాలన్నీ బడ్జెటేతర రుణాల కేటగిరీలోకి వస్తాయి. అవన్నీ ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలు కాకపోవడం వల్ల వాటిని ప్రజారుణం పరిధిలోకి తేలేదు. రాష్ట్ర ద్రవ్యలోటుని లెక్కించడంలోనూ వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే ఆ ఆర్థిక సంవత్సరంలో ప్రజారుణం, ద్రవ్యలోటుని తక్కువ ఉన్నట్టు చూపించారు.

* మొత్తం బడ్జెటేతర రుణాల్ని లెక్కలోకి తీసుకుంటే ద్రవ్యలోటు జీఎస్‌డీపీలో 6.76 శాతంగా నమోదయ్యేది.

* 2019-20 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ గ్రాంట్‌లు, మైనర్‌ పనులకు సంబంధించిన రూ.1,007.14 కోట్లను, రెవెన్యూ ఖర్చులకు వినియోగించిన రూ.3,371.60 కోట్లనూ మూలధన పెట్టుబడుల కింద నమోదు చేయడం వల్ల రెవెన్యూ లోటుని రూ.4,379.34 కోట్లు మేర తక్కువ చేసి చూపినట్లైంది. వాస్తవ లెక్కల ప్రకారం చూస్తే జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు 3.17 శాతంగా నమోదవ్వాల్సి ఉండగా, 2.72 శాతంగా చూపించారు.

* 2016-17, 2019-20లో రాష్ట్ర రెవెన్యూ లోటు 2020లో సవరించిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో నిర్దేశించిన లక్ష్యాల కంటే ఎక్కువగా ఉంది. ద్రవ్యలోటు, చెల్లించాల్సిన పాత బకాయిలు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం పరిధిలోనే ఉండటానికి కారణం... సవరించిన చట్టం వెనుకటి సంవత్సరాల నుంచి అమల్లోకి వస్తుందని చెప్పడమే కారణం.

* రాష్ట్ర ప్రభుత్వ రుణ బకాయిలు 2015-20లో రూ.1,73,854 కోట్లు ఉంటే, 2019-20కి రూ.3,01,802 కోట్లకు (73.60 శాతం వృద్ధి) చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని