అదే వారి అభిప్రాయమైతే రాజకీయపార్టీ పెట్టుకొని రావచ్చు

‘మేం ప్రభుత్వాన్ని కూల్చొచ్చు. మా శక్తి ముందు ఎవరైనా తలదించాల్సిందేనంటూ ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు విలువ ఉందని నేను అనుకోవడం లేదు’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Published : 07 Dec 2021 03:43 IST

 ఆ వ్యాఖ్యలకు విలువ ఉందనుకోవడం లేదు

ఏపీఎన్జీవో అధ్యక్షుడు శ్రీనివాసరావు వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి

ఈనాడు, అమరావతి: ‘మేం ప్రభుత్వాన్ని కూల్చొచ్చు. మా శక్తి ముందు ఎవరైనా తలదించాల్సిందేనంటూ ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు విలువ ఉందని నేను అనుకోవడం లేదు’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ‘ఎవరికి వారు ప్రెజర్‌ గ్రూపు అనుకుని, ఎన్నికల్లో మేం చెప్పిందే చేయగలం అంటే ఎన్నికలప్పుడు ఆ గ్రూపును సంతృప్తిపరిచి ప్రభుత్వాన్ని నిర్వహించుకోవచ్చు. ఉత్తేజం నింపేందుకు ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. లేదు అదే వారి అభిప్రాయమైతే వారూ ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని రావచ్చు. ఉద్యోగులూ ప్రజల్లో భాగమే కాబట్టి వాళ్లనుకుంటే దాని ప్రభావం ఉంటుంది. ఉన్న పరిస్థితిని వారు అర్థం చేసుకుని సంయమనంతో ఉంటారని ఆశిస్తున్నాం’ అని సజ్జల వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ‘ఉద్యోగులు ప్రజల్లో భాగం. ప్రభుత్వంలోనూ భాగమే. రాజకీయంగా మేం ప్రభుత్వంలోకొస్తే అయిదేళ్లు అతిథులుగా ఉంటాం. ఉద్యోగులు పదవీ విరమణ చేసేంతవరకూ వ్యవస్థలోనే ఉంటారు. రాజకీయ పార్టీగా ముఖ్యమంత్రి ఆలోచనలను, విధానాలను అమలు చేసేది ఉద్యోగులే. వాళ్ల మీద మాకు అభిమానమే ఉంటుంది. పూర్తి సంతృప్తికర వాతావరణంలో వారంతా పని చేయాలనే ప్రభుత్వం అనుకుంటుంది. చంద్రబాబు హయాంలో డీఏలు ఎగ్గొట్టి, పీఆర్సీ ఇవ్వకుండా వెళ్లారు. వైకాపా ప్రభుత్వం రాగానే ఎవరూ అడగకుండానే 27శాతం ఐఆర్‌ ఇచ్చాం. ఉద్యోగులు అడుగుతున్న దాంట్లో తప్పులేదు. పీఆర్సీని త్వరలోనే ప్రకటిస్తాం. 2018-19లో రూ.32వేల కోట్లున్న జీతభత్యాల బరువు ఇప్పుడు రూ.50వేల కోట్లకు చేరింది. ఇలాంటప్పుడు ఇంకా భారం మోస్తూ ఇంకో అడుగు ముందుకు వేయాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. అయినా అన్ని సమస్యలూ సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని సజ్జల పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని