Andhra News: ‘రూ.15 వేలు ఇస్తేనే పోస్టుమార్టం చేస్తా’

కాసులిస్తేనే పోస్టుమార్టం చేస్తానన్నాడు ఆ వైద్యుడు. పేదరాలైన తనవద్ద అంత డబ్బులు లేవని కొంత తగ్గించుకోవాలని కోరింది మృతుడి భార్య. అయినా కనికరించలేదు. చివరికి ఆమె ఆ వైద్యుడు

Updated : 05 May 2022 11:24 IST

ఉదయగిరిలో వైద్యుడి డిమాండ్‌
సస్పెన్షన్‌ వేటు వేసిన ప్రభుత్వం

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు- నెల్లూరు (వైద్యం), న్యూస్‌టుడే: కాసులిస్తేనే పోస్టుమార్టం చేస్తానన్నాడు ఆ వైద్యుడు. పేదరాలైన తనవద్ద అంత డబ్బులు లేవని కొంత తగ్గించుకోవాలని కోరింది మృతుడి భార్య. అయినా కనికరించలేదు. చివరికి ఆమె ఆ వైద్యుడు అడిగిన రూ.15వేలు ఇచ్చి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న తన భర్త మృతదేహానికి పోస్టుమార్టం చేయించింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో బుధవారం ఈ అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ ఆ వైద్యుడిపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం రాయకుంట గ్రామానికి చెందిన ముదిరాజ్‌ (27) బతుకుదెరువు కోసం కొండారెడ్డిపల్లికి వచ్చాడు. ఆర్థిక ఇబ్బందులతో మంగళవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి మృతదేహాన్ని పోలీసులు తరలించారు. అక్కడి వైద్యుడు సంధానీ బాషా ఫోన్‌పే నంబరు ఇచ్చి అందులోకి నగదు బదిలీ చేయాలని చెప్పారని మృతుడి భార్య మునీశ్వరి వెల్లడించారు. కాస్త తగ్గించమని చరవాణి ద్వారా తాను కోరగా.. ‘చాలా సమస్యలున్నాయి. రూ.15వేలు నేను చెప్పిన నంబరుకు పంపించండి. వాచ్‌మన్‌కు రూ.వెయ్యి ఇవ్వండి. సామగ్రికి రూ.2 వేలు అవుతుంది. నేను విజయవాడ వెళ్లాల్సి ఉన్నా.. మీ కోసం వచ్చాను. లేదంటే మూడు రోజులు పట్టేది. కారుకు రూ.4వేలు దండగ. తగ్గించుకునే ప్రసక్తి లేదు’ అని తేల్చి చెప్పారని వివరిస్తూ మునీశ్వరి బోరున విలపించింది. రూ.8వేలు ఇస్తామని బతిమిలాడినా పట్టించుకోలేదన్నారు. చివరికి వైద్యుడు అడిగినంత ఇచ్చి పోస్టుమార్టం చేయించుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని