‘ఈడబ్ల్యూఎస్‌’ అభ్యర్థులకు తీరని నష్టం

అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల (వైద్యులు) నియామకాల్లో ‘ఈడబ్ల్యూఎస్‌’ వారికి అన్యాయం జరుగుతోంది. ఈ కేటగిరీ కింద నిర్దేశించిన 10% పోస్టుల భర్తీ నిబంధనను తుంగలో తొక్కి రాష్ట్ర వైద్య

Published : 25 Sep 2022 05:25 IST

అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీలో అమలుకాని 10% రిజర్వేషన్‌

ఈనాడు, అమరావతి: అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల (వైద్యులు) నియామకాల్లో ‘ఈడబ్ల్యూఎస్‌’ వారికి అన్యాయం జరుగుతోంది. ఈ కేటగిరీ కింద నిర్దేశించిన 10% పోస్టుల భర్తీ నిబంధనను తుంగలో తొక్కి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) అధికారులు నాలుగు జనరల్‌ నోటిఫికేషన్ల ద్వారా నియామకాలు పూర్తి చేశారు. దీనివల్ల అర్హతలు కలిగిన ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు ప్రత్యేకంగా కేటాయించే పోస్టులను, వయోపరిమితి సడలింపు సౌకర్యాన్ని కోల్పోయారు. ఐదో నోటిఫికేషన్‌లో ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు గురించి పేర్కొన్నా...పోస్టులు చూపించలేదు. కిందటేడాది ఈడబ్ల్యూఎస్‌ అమలు జీవో జారీ అయినా...డీఎంఈ అధికారులకు ఇప్పుడు గుర్తుకు రావడంపై విమర్శలు వస్తున్నాయి. పదోన్నతులు, పోస్టింగుల్లో డబ్బును దండుకోవడమే లక్ష్యంగా పనిచేసిన డీఎంఈ అధికారులు కోలుకోలేని విధంగా యువ వైద్యులను దెబ్బతీశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గతేడాది ఆగస్టు 4న ఉద్యోగ నియామకాల్లో 10% పోస్టులను ఈడబ్ల్యూఎస్‌ వారికి రిజర్వు చేయాలని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు.. భర్తీ చేయబోయే ఖాళీల్లో పది శాతం పోస్టులను వారికి కేటాయించాలి. ఈ ఐదు నోటిఫికేషన్లలో పేర్కొన్న పోస్టుల్లో జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఆప్తమాలజీ, ఆర్థో, పీడియాట్రిక్స్‌, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరో, కార్డియాలజీ, మెడికల్‌ అంకాలజీ, ఫార్మకాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఇతర పోస్టులున్నాయి. మరోవైపు వైద్య ఆరోగ్యశాఖలోనే ప్రజారోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్‌ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్‌ విధానం అమల్లో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని