‘షెడ్డు దక్కలేదు..’ పొట్టేలు చిక్కలేదు!

పొట్టేళ్లు చిక్కలేదు.. గొర్రెల యూనిట్లు దక్కలేదు.. షెడ్ల మంజూరును అటకెక్కించారు.. రాయితీ రుణాలు ఎత్తేశారు.. కనీసం బీమా పరిహారం ఇవ్వడానికి కూడా మనసు రాలేదు. 

Updated : 10 May 2024 06:34 IST

యాదవుల సంక్షేమం పట్టని జగన్‌
గత ప్రభుత్వ పథకాలను తెగ్గోసిన వైకాపా సర్కారు
అందని రుణాలు, బీమా పరిహారం
కార్పొరేషన్‌తో పైసా మేలు జరగలే..
సొంత పార్టీ నేతలకే లబ్ధి
ఈనాడు, అమరావతి

పొట్టేళ్లు చిక్కలేదు.. గొర్రెల యూనిట్లు దక్కలేదు..
షెడ్ల మంజూరును అటకెక్కించారు.. రాయితీ రుణాలు ఎత్తేశారు..
కనీసం బీమా పరిహారం ఇవ్వడానికి కూడా మనసు రాలేదు.
ఇదీ జగన్‌ జమానాలో రాష్ట్రంలోని యాదవులపై జరిగిన కుట్రకోణం!

‘చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం’ అంటూ ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన జగన్‌.. అధికారంలోకి రాగానే ఉన్నవాటిని ఎగ్గొట్టారు. వెనకబడిన వర్గానికి చెందిన యాదవులను ఆదుకోవాల్సింది పోయి.. వారు కోలుకోకుండా దెబ్బతీశారు. గత తెదేపా ప్రభుత్వం అమలుచేసిన పథకాలను రద్దుచేసి తన పార్టీ మ్యానిఫెస్టోలో యాదవ సామాజిక వర్గం కోసం ప్రత్యేక విభాగం చేర్చారు. గొర్రెలు చనిపోతే బీమా ఇస్తామని తన మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. దాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదు. మొదటి మూడేళ్లు నామమాత్రంగా అమలుచేసి తర్వాత అటకెక్కించారు. ఇలా ఎక్కడికక్కడ కుట్రపన్ని యాదవులు ఆర్థికంగా ఎదగకుండా నష్టపరిచారు.

రాష్ట్రంలో రాయలసీమ మొదలు ఉత్తరాంధ్ర, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో యాదవులు పెద్దసంఖ్యలో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో వీరిదే నిర్ణయాత్మక పాత్ర. రాజకీయంగా ఇంత ప్రాధాన్యమున్న వర్గం అభివృద్ధిని జగన్‌ పూర్తిగా విస్మరించారు. తన అనుచరులు కొందరికి రాజకీయ పదవులు కట్టబెట్టి ఆ వర్గానికంతటికీ మేలు చేకూర్చినట్లు ప్రచారం చేసుకున్నారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో యాదవులకు అమలైన పథకాలన్నింటినీ రద్దు చేశారు. అలాగని వారికోసం ప్రత్యేకంగా కొత్త పథకాలు ఏమైనా అమలుచేశారా.. అంటే అదీ లేదు. జగన్‌ తన ఐదేళ్ల పాలనలో యాదవులకు చేసింది.. వారు ఎదగకుండా ఉండటమే. వారికి ఏ చిన్న ఆదరువు దక్కకుండా కుట్రపన్నారు జగన్‌.

బీమా అమలు అరకొరే...

గొర్రెలు చనిపోతే బీమా వర్తింపజేస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్‌ హామీ ఇచ్చారు. ఒక్కో గొర్రెకు రూ.6 వేలను బీమాగా చెల్లిస్తామన్న హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. పశు నష్టపరిహారం అంటూ మొదటి మూడేళ్లు రకరకాల కొర్రీలు పెట్టి అరకొరగా అమలు చేశారు. ఆ తర్వాత పశువులకు ‘బీమా’ అనే కొత్త పేరును తెరపైకి తీసుకొచ్చారు. దాన్ని కూడా అమలు చేయకుండా చేతులెత్తేశారు. గొర్రెలు చనిపోయిన వారు బీమా పరిహారం వస్తుందని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆశలు వదులుకున్నారు.

తెదేపా ప్రభుత్వ హయాంలో పెద్దపీట

గత తెదేపా ప్రభుత్వం యాదవుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. వారి అభివృద్ధి కోసం ప్రత్యేక ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి కేంద్ర సహకారంతో ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రుణం అందించింది. ఇందులో 20% రాయితీ, 20% లబ్ధిదారుని వాటా పోనూ.. 60 శాతం పావలా వడ్డీ రుణం. ఇలా రుణసాయం కింద కేంద్రం అప్పట్లో రాష్ట్రానికి రూ.250 కోట్లు మంజూరు చేసింది. మొదటి విడతగా రూ.80 కోట్ల మేర విడుదల అయ్యాయి. ఆ మొత్తాన్ని తెదేపా ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసి వారికి ప్రయోజనం చేకూర్చింది. అయితే.. రెండు, మూడు విడతల కింద మిగిలిన మొత్తం కేంద్రం నుంచి అందాల్సిన సమయంలోనే రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రెండు విడతలకు సంబంధించిన నిధులు కేంద్రం నుంచి విడుదల అయ్యాయా.. లేదా.. అన్న విషయం కూడా బయటకు పొక్కకుండా గోప్యత ప్రదర్శించింది వైకాపా సర్కారు.

రూ.6 కోట్లు మళ్లింపు!

తెదేపా ప్రభుత్వం యాదవులకు మినీ షీప్‌ యూనిట్లను అందించి అండగా నిలిచింది. ఒక్కో యూనిట్‌లో  5 గొర్రె పిల్లలు, ఒక పొట్టేలును అందించింది. వీటి విలువ రూ.30 వేలు కాగా.. ప్రభుత్వం రూ.15 వేలను రాయితీ కింద అందిస్తుండేది. మిగిలిన రూ.15 వేలు లబ్ధిదారుని వాటా. ఇదే కాకుండా విత్తన పొట్టేళ్ల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.6 కోట్లను మంజూరు చేసింది. వీటిని లబ్ధిదారులకు  100 శాతం రాయితీతో అందించాలి. ఈ నిధులను వైకాపా సర్కారు లబ్ధిదారులకు అందించకుండా ఇతర అవసరాలకు మళ్లించిందన్న ఆరోపణలున్నాయి.

కార్పొరేషన్‌ నామమాత్రమే

అధికారంలోకి రాగానే యాదవులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినట్టు జగన్‌ ఆర్భాటంగా ప్రకటించారు. కానీ దానికి ఒక్క రూపాయీ కేటాయించలేదు. యాదవుల స్వయం ఉపాధికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రాయితీ రుణాలను మంజూరు చేయలేదు. ‘నవరత్నాల’ నిధులను కార్పొరేషన్‌ ద్వారా మళ్లించి వాటినే సాయంగా అందించినట్లు గొప్పలు చెప్పుకొంది జగన్‌ సర్కారు. కార్పొరేషన్‌ కింద ఎంతో సాయం అందిస్తున్నట్లు ప్రచారం చేసుకున్న జగన్‌.. గత తెదేపా ప్రభుత్వం యాదవులకు అమలుపరిచిన పథకాలను రద్దు చేసింది. ఇదీ.. యాదవులు అభివృద్ధి చెందకుండా జగన్‌ పన్నిన కుట్ర. అంతేకాకుండా వైకాపా నేతలను యాదవ కార్పొరేషన్‌కు ఛైర్మనుగా, 12 మందిని    డైరెక్టర్లుగా నియమించి రూ.లక్షల ప్రజాధనాన్ని వారికి జీతభత్యాల కింద చెల్లించింది. వీరి ద్వారా యాదవ వర్గానికి ఎలాంటి ప్రయోజనం చేకూరకపోగా.. ఆ వర్గం వారికి జరిగిన అన్యాయంపై ఎవరినీ ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు.


అప్పులు చేసి నిర్మించుకున్నా..

తెదేపా ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం కింద గోకులాలు, మినీ గోకులాలు(షెడ్లు) ఏర్పాటు చేశారు. దీని కింద లబ్ధిదారులు గొర్రెలు, మేకలు, బర్రెలు, ఆవులు, కోళ్లకు షెడ్లను నిర్మించుకోవచ్చు. ఒక్కో షెడ్డు కోసం ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.13 లక్షల వరకు మంజూరు చేసింది. ఇందులో 90 శాతం రాయితీ కాగా 10 శాతం లబ్ధిదారుని వాటా. 2014-19 మధ్య ఈ పథకం కింద రూ.వందల కోట్లు వెచ్చించి 42,417 షెడ్లు నిర్మించింది. ఇవి వారికి చాలా ఉపయోగకరంగా ఉండేవి. ఇది కదా బీసీలకు అండగా ఉండటం అంటే. అయితే, ఇంత పెద్దమొత్తంలో వెనకబడిన వర్గాలు లబ్ధిపొందుతుంటే జగన్‌కు నచ్చదు కదా..! అందుకే గోకులాలు, మినీ గోకులాలను రద్దు చేశారు. వీరికి కేటాయించాల్సిన ఉపాధి నిధులను ఇతర పనులకు మళ్లించారు. ఉపాధి హామీ పథకం నిధులు వస్తాయన్న ఆశతో కొందరు రూ. లక్షలు అప్పులు చేసి మరీ గోకులాలను నిర్మించుకున్నారు. వైకాపా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వారు లబోదిబోమంటున్నారు.


ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
- నాగేశ్వరరావు, కన్వీనర్‌, జాతీయ బీసీ సంక్షేమ సంఘం

వైకాపా ప్రభుత్వ హయాంలో యాదవులకు ప్రత్యేకంగా ఎలాంటి మేలు జరగలేదు. కార్పొరేషన్‌ ద్వారా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పైగా తెదేపా ప్రభుత్వం అమలుపరిచిన పథకాలను రద్దు చేశారు. ఆ పథకాలను అమలుచేయాలని అధికారులను అడిగితే నవరత్నాల్లో మీ వాటా మీకు ఇస్తున్నాం కదా.. అని నిర్లక్ష్యపు సమాధానమిచ్చారు.


50 ఏళ్లకే పింఛను అని మాట తప్పారు
- నూకానమ్మ, ఏపీ ఇన్‌ఛార్జ్‌, జాతీయ బీసీ సంక్షేమ సంఘం

సీఎం జగన్‌ యాదవ కార్పొరేషన్‌ను నీరుగార్చారు. గతంలో తెదేపా ప్రభుత్వం యాదవ కార్పొరేషన్‌ ద్వారా రూ.270 కోట్లు ఖర్చు చేసింది. రాయితీ రుణాలు కూడా ఇచ్చింది. అదే తరహాలో సబ్సిడీ రుణాలు ఇవ్వాలని వైకాపా ప్రభుత్వానికి ఎన్నో వినతులు ఇచ్చాం. ప్రభుత్వం వాటిని బుట్టదాఖలు చేసిందే గానీ పట్టించుకోలేదు. గొర్రెల కాపరులకు 50 ఏళ్లకే పింఛను, బీమా వర్తింపజేస్తానని చెప్పి మాట తప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని