జగన్‌ను విదేశీ పర్యటనకు అనుమతించొద్దు

అక్రమాస్తుల కేసుల్లో ప్రధాన నిందితుడైన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని విదేశాలకు వెళ్లడానికి అనుమతించవద్దని హైదరాబాద్‌ సీబీఐ కోర్టును గురువారం సీబీఐ కోరింది.

Updated : 10 May 2024 06:29 IST

అక్రమాస్తుల కేసుల్లో ఆయన ప్రధాన నిందితుడు
కోర్టుకు నివేదించిన సీబీఐ

ఈనాడు, హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసుల్లో ప్రధాన నిందితుడైన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని విదేశాలకు వెళ్లడానికి అనుమతించవద్దని హైదరాబాద్‌ సీబీఐ కోర్టును గురువారం సీబీఐ కోరింది. ఈనెల 17 నుంచి జూన్‌ 1వ తేదీ మధ్య యూరప్‌ పర్యటనకు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు న్యాయమూర్తి టి.రఘురాం విచారణ చేపట్టారు. దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లోనూ విచారణ కొనసాగుతోందని, అన్నింటిలోనూ జగన్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నారని నివేదించారు. ఈ దశలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే విచారణలో జాప్యం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఈనెల 15న మొత్తం సీబీఐ కేసులు విచారణకు రానున్న నేపథ్యంలో జగన్‌కు అనుమతి మంజూరు చేయొద్దని కోరారు. పిటిషినర్‌ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ జగన్‌ గతంలోనూ పలుమార్లు విదేశాలకు వెళ్లారని, కోర్టు విధించిన షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని తెలిపారు. విదేశాలకు ప్రయాణించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దాన్ని అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. లండన్‌లో చదువుతున్న కుమార్తెలను కలవడానికి కుటుంబంతో వెళుతున్నారని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి నిర్ణయాన్ని ఈనెల 14కు వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని