వైకాపా హయాంలో ఉపాధ్యాయుల బతుకులు దుర్భరం!

ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను దూరం చేసేందుకు బోధనేతర పనిగా పేర్కొన్న ప్రభుత్వం... పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫొటోలు తీయిస్తోందని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య(ఏపీటీఎఫ్‌) పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు ఆవేదన వ్యక్తంచేశారు.

Published : 10 May 2024 05:14 IST

మరుగుదొడ్ల ఫొటోలు తీయిస్తున్నారు.. మద్యం దుకాణాల దగ్గర కాపలా పెట్టారు
సకాలంలో రాని జీపీఎఫ్‌, పీఎఫ్‌ డబ్బు
‘ఈనాడు’తో ఏపీటీఎఫ్‌ పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు

ఈనాడు, అమరావతి: ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను దూరం చేసేందుకు బోధనేతర పనిగా పేర్కొన్న ప్రభుత్వం... పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫొటోలు తీయిస్తోందని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య(ఏపీటీఎఫ్‌) పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల విధులు బోధనేతర పని అయినప్పుడు మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం ఫొటోలు తీయడం, నాడు-నేడు పనుల సంగతేమిటి? అని ప్రశ్నించారు. కరోనా సమయంలో మద్యం దుకాణాల వద్ద టీచర్లను కాపలా పెట్టారని వాపోయారు. ఈ ఐదేళ్లలో కొత్త నియామకాలు చేపట్టక పోవడంతో ఉపాధ్యాయులపై పనిభారం పెరిగిందని,  తీవ్ర పని ఒత్తిడి ఉందన్నారు. జీతాలు చెల్లించడంలోనూ ప్రభుత్వం వివక్ష చూపిందని, కొన్ని నెలలు 12వ తేదీ దాకా రాలేదన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు, ప్రభుత్వ బడుల పరిస్థితులపై ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

అప్‌లోడ్‌ ఆలస్యమైతే నోటీసులు

ఉపాధ్యాయులకు బోధనేతర పనులను భారీగా పెంచేశారు. వారిచేత మరుగుదొడ్ల ఫొటోలు తీయిస్తున్నారు. ఫొటోలు తీసి, యాప్‌లో అప్‌లోడ్‌ చేయడంలో ఆలస్యమైతే నోటీసులు ఇచ్చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం ఫొటోలు తీయాలి.. ఆన్‌లైన్‌లో పిల్లల హాజరు వేయాలి. తిరిగి మళ్లీ రిజిస్టర్‌లో నమోదు చేసుకోవాలి. కోడిగుడ్లు, చిక్కీల స్టాకు రిజిస్టర్లు నిర్వహించాలి. మధ్యాహ్న భోజనం వంటకు సరకులు అందించాలి. ఇలా అనేక బోధనేతర పనులతో ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారు.  

నాడు-నేడు పనుల భారాన్ని ఉపాధ్యాయులపై పడేశారు. కరోనా సమయంలో పనులు చేయించాలని ఒత్తిడి చేయడంతో కొంతమంది వైరస్‌ సోకి చనిపోయారు. కొందరు ఒత్తిడి భరించలేక గుండెపోటుతో మృతి చెందారు. తరగతి గదుల నిర్మాణం కోసమంటూ పాత వాటిని కూల్చేశారు. ఉన్నగదుల్లో నిర్మాణ సామగ్రి నిల్వలు చేశారు. చివరికి పిల్లలకు చెట్ల కింద పాఠాలు చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఏకోపాధ్యాయపై దయలేదు

ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని లేకుండా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 9 వేలకుపైగా ఏకోపాధ్యాయ బడులు ఏర్పడ్డాయి. ఇక్కడ ఉదయం బెల్‌ కొట్టుకోవడం నుంచి మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం ఫొటోలు, వంటకు సరకులు అందించడం, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ హాజరు వేయడం ఇలా వీటికే ఉపాధ్యాయుడి సమయమంతా పోతోంది. ఇక పాఠం చెప్పేందుకు సమయం ఉండటం లేదు. పిల్లలకు పాఠాలు చెప్పకుండా చేస్తే పునాది దశలో పేద పిల్లల పరిస్థితి ఏంటి?

ఖాళీలు భర్తీ చేయకుండా ఒత్తిడి

ఉపాధ్యాయ ఖాళీలు 23 వేలు ఉన్నాయని ప్రతిపక్షనేతగా జగనే ప్రకటించారు. హేతుబద్ధీకరణ ఉత్తర్వులు-117 తీసుకొచ్చి, కొత్త నియామకాలు చేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పోస్టులు భర్తీ చేయకుండా పని భారం పెంచారు. సబ్జెక్టు టీచర్‌ బోధనంటూ 3, 4, 5 తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత బడులకు తరలించడంతో ప్రాథమిక విద్య విచ్ఛిన్నమైంది.

ప్రభుత్వం నుంచి విద్యాకానుక సక్రమంగా ఇవ్వకపోయినా... ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌(ఐఎఫ్‌పీ) బిగించక పోయినా.. ఇంటర్నెట్‌ సదుపాయం లేకపోయినా అన్నీ ఉన్నట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తున్నారు. ఎవరైనా నిజాయతీగా వివరాలు నమోదు చేస్తే షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నారు. ఇటీవల అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం లేదన్నందుకు నోటీసులు ఇచ్చారు. నిజం చెప్పడమూ తప్పుగా మారింది.

సిలబస్‌పై గందరగోళం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సక్సెస్‌ స్కూల్స్‌ అని పెట్టి ఆంగ్ల మాధ్యమంతోపాటు సీబీఎస్‌ఈ సిలబస్‌ తెచ్చారు. కొన్ని నెలల తర్వాత సీబీఎస్‌ఈ వృథా అని తీసేశారు. అప్పుడు తీసేసిన దాన్నే మహా గొప్పదంటూ మళ్లీ జగన్‌ ప్రారంభించారు. సీబీఎస్‌ఈని మూడేళ్లయినా అమలు చేయకుండానే ఇంటర్నేషనల్‌ బకలారియేట్‌(ఐబీ) సిలబస్‌ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు బోధించే సామర్థ్యం ఉందా? లేదా? పట్టించుకోవడం లేదు.

కొంతమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు... తమ పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువుల కోసం పీఎఫ్‌, జీపీఎఫ్‌ అడ్వాన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నా సకాలంలో ఇవ్వలేదు. ఫలితంగా ఇబ్బందులు తప్పలేదు. ఉన్నత చదువులు చదివే పిల్లలకు ఫీజులు చెల్లించేందుకు అప్పులు చేశారు. మధ్యంతర భృతి కంటే తక్కువగా ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. 2018 నుంచి డీఏల బకాయిలు చెల్లించడం లేదు. 184 నెలల బకాయిలు ఉన్నాయి. పీఆర్సీ బకాయిలూ ఇవ్వలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని