CM Jagan Public Meeting: ఒంటేలుకు పోవాలన్నా వదల్లేదు!

సీఎం సభలు జరిగిన ప్రతిచోటా ప్రసంగం ఆరంభం, మధ్యలోనే జనం బయటకు వెళ్లిపోతుండటంతో.. పుట్టపర్తి సభలో ఇలా జరగకుండా నిలువరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఏకంగా మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేశారు.

Updated : 08 Nov 2023 09:30 IST

సీఎం సభ నుంచి వెళ్లకుండా అడ్డగింత
ఒక్కో గ్యాలరీకి అధికారి.. ఇద్దరు వాలంటీర్లు
మండిపడిన ప్రజలు.. బారికేడ్లు తోసుకుని వెళ్లిన వైనం

ఈనాడు డిజిటల్‌, అనంతపురం -న్యూస్‌టుడే, పుట్టపర్తి, బుక్కపట్నం: సీఎం సభలు జరిగిన ప్రతిచోటా ప్రసంగం ఆరంభం, మధ్యలోనే జనం బయటకు వెళ్లిపోతుండటంతో.. పుట్టపర్తి సభలో ఇలా జరగకుండా నిలువరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఏకంగా మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీని పర్యవేక్షించేందుకు మండల స్థాయి అధికారి, ఓ ప్రజాప్రతినిధి, సచివాలయం ఉద్యోగితో ఇద్దరేసి వాలంటీర్లను నియమించారు. ఉదయం 8:30 గంటల నుంచే గ్యాలరీల్లో జనాన్ని కూర్చోబెట్టారు. 11:15 గంటలకు సీఎం వేదిక పైకి చేరుకున్నారు. 11:45కు ప్రసంగం ప్రారంభించారు. అన్ని గంటలపాటు గ్యాలరీల్లో కూర్చోలేక వృద్ధులు, మహిళలు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఉన్నారన్నా కనికరం చూపలేదు. అత్యవసరంగా వెళ్లాలని ఓ వృద్ధుడు వేడుకున్నా వదలకపోవడంతో గ్యాలరీ లైన్‌లోనే మల విసర్జన చేసుకున్నారు. అత్యవసరాలు తీర్చుకోవడానికీ బయటకు వెళ్లకూడదా అంటూ వృద్ధులు, మహిళలు పోలీసులపై మండిపడ్డారు. ఎంతసేపు బతిమాలినా కనికరించకపోవడంతో జనాలు సహనం కోల్పోయారు. రెండువైపులా బారికేడ్లను తోసుకుని సభ నుంచి బయటకు వెళ్లారు. సీఎం ప్రసంగం ప్రారంభమయ్యేసరికి 2 గ్యాలరీలు ఖాళీ అయ్యాయి. బారికేడ్ల బంధనాలు తొలగిపోవడంతో సీఎం ప్రసంగిస్తుండగానే సగం మంది ఇంటిబాట పట్టారు.

  • పుట్టపర్తి పట్టణ శివారులోని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి సమీపాన సీఎం సభ ఏర్పాటు చేశారు. కాన్వాయ్‌ కోసం గంట ముందునుంచే ఆ కూడలిలో వాహనాలను నిలిపివేశారు. దీంతో రోగులు, వారి సహాయకులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి అవస్థలు పడాల్సి వచ్చింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని