YSRCP: మనవి చేర్చు.. ప్రతిపక్షానివి తీసేయ్‌: స్థానిక నేతకు వైకాపా ఎమ్మెల్యే ఆదేశం

పల్నాడు జిల్లాలో కృష్ణా తీర ప్రాంతానికి చెందిన, గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక అనధికారిక దోపిడీని పర్యవేక్షించిన వైకాపా ఎమ్మెల్యే... పార్టీ గ్రామస్థాయి నాయకుడు ఒకరికి ఫోన్‌లో కులాలవారీగా ఓటర్ల వివరాలు చెప్పి, ప్రతిపక్షాల ఓట్లు తొలగించాలంటూ చేసిన ఫోన్‌ సంభాషణ శనివారం బహిర్గతమైంది.

Updated : 26 Nov 2023 09:03 IST

ఈనాడు, అమరావతి: పల్నాడు జిల్లాలో కృష్ణా తీర ప్రాంతానికి చెందిన, గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక అనధికారిక దోపిడీని పర్యవేక్షించిన వైకాపా ఎమ్మెల్యే... పార్టీ గ్రామస్థాయి నాయకుడు ఒకరికి ఫోన్‌లో కులాలవారీగా ఓటర్ల వివరాలు చెప్పి, ప్రతిపక్షాల ఓట్లు తొలగించాలంటూ చేసిన ఫోన్‌ సంభాషణ శనివారం బహిర్గతమైంది. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారమైన ఆ సంభాషణలో... గ్రామంలో లేని కాపు సామాజికవర్గం వారి ఓట్లు వెంటనే తొలగించేలా అధికారులతో గట్టిగా మాట్లాడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రతిపక్షాలకు చెందినవారు పొరుగూరులో ఉన్నా తీసివేతకు దరఖాస్తులు పెట్టాలని సూచించారు.  వైకాపా మద్దతుదారులు పొరుగూరులో ఉంటున్నా చేర్పించాలని ఆదేశించారు. వైకాపాకు ఓటు వేయరనుకున్నవారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు అధికారపార్టీ నాయకులు చేస్తున్న కుయుక్తులకు ఆ సంభాషణే నిదర్శనం. వారి సంభాషణ ఇలా సాగింది.

ఎమ్మెల్యే : మీఊరిలో వడ్డెర్ల ఓట్లు ఎన్ని ఉంటాయి?
గ్రామస్థాయి వైకాపా నేత: 460 ఉన్నాయి సర్‌.

ఎమ్మెల్యే : అన్ని లేవే
వైకాపా నేత : పొరుగూరిలో ఉన్నవారితో కలిపి అన్ని ఉంటాయ్‌ సర్‌...  

ఎమ్మెల్యే : ఇక్కడ జాబితాలో 375 ఉన్నాయి, అందులో మనకు ఎన్ని ఉంటాయి?
వైకాపా నేత : మనకు 250 పక్కా పడతాయి సర్‌.

ఎమ్మెల్యే : మాల ఓట్లు పరిస్థితి ఏంటి... 229 ఉన్నాయి.
వైకాపా నేత : మనకే ఎక్కువగా ఉంటాయి. 150 వరకు మనకే ఉంటాయి.

ఎమ్మెల్యే :  బోయవాళ్లు....
వైకాపా నేత : 170 నుంచి 180 ఉంటాయి.

ఎమ్మెల్యే : బోయలవి 150 ఉన్నాయి. మొత్తం మీ ఊళ్లో ఉన్నవి 1000 ఓట్లే కదా?
వైకాపా నేత : బోయలవి చెరో సగం ఉంటాయి సర్‌.

ఎమ్మెల్యే : మాదిగ 73 ఉన్నాయి.
వైకాపా నేత : మనకు 30 ఉంటాయి సర్‌. ఎక్కువ తెదేపాకు ఉంటాయి.

ఎమ్మెల్యే : కాపుల ఓట్లు..?
వైకాపా నేత : ఇద్దరికీ చెరి సగం ఉన్నారు. రేపు ఎటు వేస్తారో తెలియదు.

ఎమ్మెల్యే : అవును కాపుల ఓట్లు ఎన్ని ఉన్నాయి ఊరిలో.. వాళ్లు ఊరిలో ఉండటం లేదంటగా.. పొరుగూరిలో ఉంటున్నారంటగా..
వైకాపా నేత : అవును సర్‌.. వాళ్లు చాలామంది బయటే ఉంటున్నారు. ఊరిలో రెండు కుటుంబాలే ఉంటున్నాయి.

ఎమ్మెల్యే : తీసేయాలి కదా వాళ్లవి.. తీసివేతలకు పెట్టలేదా?
వైకాపా నేత : పోయినసారి తీసివేతలకు పెట్టాము సర్‌. గొడవ జరిగి కొంతమంది ఉంచండి, కొందరు తీసేయాలని అంటున్నారు.

ఎమ్మెల్యే : కాపుల ఓట్లు తీసేయండి. తీసేయాలని పెట్టి నోటీసులు ఇవ్వాలని తహసీల్దారుకు చెప్పండి. ఇవాళే వెళ్లు.. తహసీల్దారు దగ్గరకు వెళ్లి గట్టిగా మాట్లాడండి.
వైకాపా నేత : సరే సర్‌.. ఈ రోజు ఆదివారం రేపు వెళతాను.

ఎమ్మెల్యే : నోటీసులు ఇవ్వండి, వస్తే ఉంచండి లేకపోతే తీసేయాలని చెప్పండి. కాపులవి ఎన్ని ఉంటాయి.
వైకాపా నేత : 70లోపు ఉంటాయి. చెరో సగం ఉంటాయి సార్‌. కాకపోతే రేపు పవన్‌ కల్యాణ్‌ ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు.

ఇలా మిగతా కులాలకు సంబంధించిన ఓట్ల వివరాల్ని కూడా ఆరా తీశాక...

ఎమ్మెల్యే : ఇప్పుడు ఊరిలో లేని అవతలి వాళ్లవి మొత్తం తీసివేయడానికి పెట్టేసేయండి.. మనవి పొరుగూరిలో ఉన్నా వారి ఓట్లు వెంటనే చేర్చండి, వెంటనే ఆ పని చేయండి.
వైకాపా నేత : సరే సర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు