Riders: ట‌ర్మ్ పాల‌సీకి ఎలాంటి రైడ‌ర్లు జ‌త‌చేయ‌వ‌చ్చు?

పాలసీదారుడు గాయాలపాలై, తాత్కాలికంగా ఆదాయం ఆగిపోయిన సంద‌ర్భాల‌లో అనుబంధ పాలసీలు లేదా రైడ‌ర్లు మ‌రింత ర‌క్ష‌ణ క‌ల్పిస్తాయి.    

Published : 11 Jun 2022 16:16 IST

కుటుంబంలో ఆర్జించే వ్యక్తి… తనకేమైనా అయితే… ఆ కుటుంబానికి ఏ ఇబ్బందీ లేకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఇందుకోసం ముందుగానే ప్లాన్ చేసి తన వార్షికాదాయాన్ని బట్టి, జీవిత‌ బీమా పాలసీ తీసుకోవాలి. తాను లేనప్పుడు ఆ కుటుంబానికి ఆదాయాన్ని సమకూర్చేలా ఆ పాలసీ ఉండాలి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్ పాలసీల(Term Policy) ను దీనికోసం పరిశీలించవచ్చు.  

అయితే, ఈ పాలసీలు… పాలసీదారుడు మరణించిన సందర్భంలోనే పరిహారం ఇస్తాయి. మరి, గాయాలపాలై, తాత్కాలికంగా ఆదాయం ఆగిపోయిన సందర్భాలు ఎదురైనప్పుడు… ఏం చేయాలి? ఇలాంటి సంద‌ర్భాల‌లోనే అనుబంధ పాలసీలు లేదా రైడ‌ర్లు (Riders) మ‌రింత ర‌క్ష‌ణ క‌ల్పిస్తాయి. ఆర్థిక అవసరాలు వ్యక్తులను బట్టి మారుతుంటాయి. బీమా పాలసీల విషయంలోనూ అంతే… ఒక వ్యక్తి తనకు సరిపోయే మొత్తం ఎంత అనేది నిర్ణయించుకున్నాకే పాలసీ విలువను నిర్ణయించుకోవాలి. దీనికి తోడుగా అనుబంధ పాలసీలను ఎంచుకోవడం వల్ల అదనపు భరోసా లభిస్తుంది. టర్మ్ బీమా పాలసీ తీసుకున్నప్పుడు పరిశీలించాల్సిన కొన్ని ముఖ్యమైన రైడర్లు(Riders) ఏమిటో చూద్దాం.

ప్రీమియం రద్దయ్యేలా…
బీమా పాలసీ తీసుకున్నప్పుడు వ్యవధి పూర్తయ్యే వరకూ దానికి ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. కానీ, ఆదాయం ఆగిపోయినప్పుడు ప్రీమియం చెల్లించడం కష్టమవుతుంది. ఇలాంటప్పుడు పాలసీ రద్దు కాకుండా చూసేదే వేవర్ ఆఫ్ ప్రీమియం (Waiver of Premium) రైడర్. ప్రమాదం లేదా ఇతర కారణాల వల్ల శాశ్వత వైకల్యం సంభవించిన సందర్భంలో… జీవిత బీమా పాలసీకి భవిష్యత్తు ప్రీమియంల‌ను చెల్లించనవసరం లేకుండా ఈ రైడర్ తోడ్పడుతుంది. టర్మ్ పాలసీకి ఈ రైడర్‌ను జత‌చేయ‌డం వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనూ బీమా రక్షణ దూరం కాకుండా చూసుకునే అవకాశం ఉంది.

ప్రమాదం జ‌రిగితే…
రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్యను చూస్తుంటే ఆందోళన కల్గిస్తోంది. ఎప్పుడు ఏ రూపంలో మృత్యువు ముంచుకొస్తుందో తెలియని రోజులివి. నమ్ముకున్న కుటుంబానికి ఆర్థికంగా మరింత భరోసా కల్పించేందుకు ప్రయత్నించాలనుకునే వారు ప్రమాద బీమా/యాక్సిడెంటల్ డెత్ రైడర్(Accidental Death Rider) తీసుకోవాలి. ప్రమాదంలో మరణించిన పాలసీదారుడికి ఇది టర్మ్ పాలసీకి మించి ఆర్థిక అండ కల్పిస్తుంది. తక్కువ ప్రీమియంతో అధిక రక్షణ కల్పిస్తుంది.

పాక్షిక వైకల్యం…
ప్రమాదాల వల్ల పాక్షికంగా లేదా శాశ్వత వైకల్యం సంభవించే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి సందర్భాల్లో కొంత కాలం పాటు ఆదాయం ఆగిపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడేది పార్షియల్ అండ్ పర్మినెంట్ డిజేబిలిటీ రైడర్ (Partial and Permanent Disability Rider). దీనిలో ఎంపిక చేసుకున్న ఐచ్ఛికాలను బట్టి, ప్రమాదం బారిన పడిన 5-10 ఏళ్లపాటు క్రమం తప్పకుండా ఆదాయం అందేలా చూస్తుంటాయి. దీనివల్ల ఆదాయంలో క్రమం తప్పకుండా ఉండేలా చూసుకోవచ్చు. పూర్తి వైకల్యం ఏర్పడినప్పుడు పాలసీ మొత్తాన్ని పరిహారంగా ఇస్తుంది. పాక్షిక వైకల్యం ఏర్పడినప్పుడు నిబంధనల మేరకు పాక్షిక పరిహారాన్ని అందిస్తుంది. అనుకోని సంఘటనల వల్ల ఆదాయం ఆగిపోకుండా ఈ రైడర్ తోడ్పడుతుంది.

తీవ్ర వ్యాధులు వచ్చినా…
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గుండె జబ్బులు, క్యాన్సర్లు, మూత్ర పిండాల జబ్బులు, పక్షవాతం లాంటి తీవ్ర వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు అధికమవుతోంది. ఈ వ్యాధులు సోకినప్పుడు ఆర్థిక రక్షణ లభించేలా ఉపయోగపడేది క్రిటికల్ ఇల్నెస్ రైడర్ (Critical Illness Rider). తీవ్ర వ్యాధులు గుర్తించినప్పుడు పాలసీలో పేర్కొన్న నిర్ణీత మొత్తాన్ని పరిహారంగా చెల్లిస్తుంది. ఆ డబ్బుతో ఆ వ్యాధులకు చికిత్స చేయించుకునేందుకు వీలవుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.

క్రమం తప్పని ఆదాయం…
పాలసీదారుడు మరణించిన సందర్భంలో అతని కుటుంబానికి అతని తరపున ఆదాయాన్ని అందించేందుకు తోడ్పడే రైడర్ ఇది. దీని ద్వారా పాలసీ మొత్తంలో నిర్ణీత శాతం చొప్పున నెలనెలా అతని నామినీలకు అందుతుంది. పాలసీదారుడు ఈ ఇన్‌క‌మ్ బెనిఫిట్ రైడర్ (Income Benefit Rider) ఎంచుకున్నప్పుడు…అతనికి ఏదైనా జరిగిన సందర్భంలో ప్రాథమిక జీవిత బీమా పాలసీ మొత్తం అందుతుంది. ఆ తర్వాత ఈ రైడర్ ద్వారా 5-10 ఏళ్లపాటు క్రమం తప్పని ఆదాయం లభిస్తుంది. ఉదాహరణకు ఈ రైడర్ మొత్తంలో ఏడాదికి 10 శాతం అందే విధంగా ఎంచుకున్నారనుకోండి. ఇలా 10 ఏళ్ల పాటు ఆ పరిహారం అందుతుందన్నమాట.

చివ‌రిగా..
టర్మ్ పాలసీలను ఎంచుకునేటప్పుడు…దానికి అనుబంధంగా ఈ ప్రధాన రైడర్లను జోడించుకోవడం వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా…ఆర్థిక కష్టాలు రాకుండా చూసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని