Singles Day: సింగిల్స్‌ డే షాపింగ్‌లో రూ.6 లక్షల కోట్ల ఆర్డర్లు

‘సింగిల్స్‌ డే’(నవంబరు 11) సందర్భంగా చైనాలో ఏటా జరిగే అతిపెద్ద ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అలీబాబా రికార్డు సృష్టించింది....

Updated : 12 Nov 2021 15:41 IST

బీజింగ్‌ : ‘సింగిల్స్‌ డే’(నవంబరు 11) సందర్భంగా చైనాలో ఏటా జరిగే అతిపెద్ద ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అలీబాబా రికార్డు సృష్టించింది. నవంబరులో తొలి 11 రోజులు జరిగే ఈ షాపింగ్‌లో ఏకంగా 84.54 బిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.6.29 లక్షల కోట్లు) విలువ చేసే ఆర్డర్లు అందాయి. గత ఏడాది నమోదైన 74 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే దాదాపు 14 శాతం వృద్ధి నమోదైంది. చైనా వినియోగానికి ఈ పండుగను ఒక గీటురాయిగా భావిస్తుంటారు. చైనాలో తగ్గిన వినిమయం, టెక్‌ సంస్థలపై ప్రభుత్వ ఆంక్షలు, కరోనా లాక్‌డౌన్‌లు, సరఫరా గొలుసులో ఇబ్బందుల నేపథ్యంలో ఈసారి సింగిల్స్‌ డే షాపింగ్‌ స్తబ్దుగా గడవనుందని అంతా అంచనా వేశారు. అలీబాబా విక్రయాల్లో స్వల్ప వృద్ధి నమోదుకానుందని జోస్యం చెప్పారు. కానీ, అందుకు భిన్నంగా విక్రయాలు భారీ ఎత్తున జరగడం విశేషం.

వ్యాపార ప్రమోషన్‌లో భాగంగా ఇంతకుముందు సింగిల్స్‌ డే షాపింగ్‌ చివరిరోజుకు ముందు రాత్రి అలీబాబా ప్రత్యేక ‘గాలా’ను నిర్వహిస్తుంది. అందులో విక్రయాల విలువ, ఆర్డర్ల సంఖ్య వంటి గణాంకాలను ఘనంగా ప్రకటించేది. కానీ, ఈసారి పూర్తిగా వాటి జోలికే వెళ్లలేదు. పైగా బీజింగ్‌ పర్యావరణ లక్ష్యాలు, అదనపు వినియోగం, అసమానతలను తగ్గించే లక్ష్యంతో జిన్‌పింగ్‌ ప్రకటించిన ‘సామాన్యుల శ్రేయస్సు’ ఉద్దేశాలకు అనుగుణంగా కొన్ని దాతృత్వ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అలీబాబా పేర్కొంది. అలాగే పర్యావరణ అనుకూల ప్యాకింగ్‌కి తీసుకున్న చర్యలు, దివ్యాంగులు దుస్తులు కొనుగోలు చేయడం కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లను తెలియజేసింది. అలాగే మూడు గంటలపాటు సాగిన గాలా లైవ్‌స్ట్రీమ్‌ని ‘లైక్‌’ చేయాలని వీక్షకులను కోరింది. తద్వారా 1.56 మిలియన్‌ యువాన్లు సమీకరించేందుకు తోడ్పాటునందించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మొత్తాన్ని చైనాకు నైరుతి ప్రాంతంలో 200 ఎకరాల్లో ఉన్న ఏనుగుల పార్క్‌ సంరక్షణకు వినియోగించనున్నట్లు తెలిపింది.

ఏంటీ సింగిల్స్‌ డే...

ఏటా నవంబరు 11న సింగిల్స్‌ డేగా జరుపుకొంటారు. దీన్ని ‘బ్యాచిలర్స్ డే’ అని కూడా అంటారు. ఈ తేదీ అంకెల్లో రాస్తే వచ్చే 11/11లోని ఒక్కో ‘1’ని ఒక్కో వ్యక్తిగా పేర్కొంటారు. అంటే తోడు లేని నలుగురు వ్యక్తులని దీని అర్థం. ఇలా చైనాలో బ్యాచిలర్స్‌ సెలబ్రేట్‌ చేసుకునే ప్రత్యేక సందర్భాన్ని ‘సింగిల్స్‌ డే’గా అభివర్ణిస్తారు. నంజింగ్‌ విశ్వవిద్యాలయంలోని నలుగురు యువకులు ‘సింగిల్‌’గా ఉండడాన్ని సంబరంగా జరుపుకోవాల్సిన అంశంగా పేర్కొంటూ 1990లలో దీన్ని ప్రారంభించారు. కాలక్రమంలో ఇది అన్ని విశ్వవిద్యాలయాలకు పాకింది. ఇప్పుడు దేశ సంస్కృతిలో ఓ భాగంగా మారిపోయింది. దీన్ని అవకాశంగా భావించిన అలీబాబా.. 2009లో సింగిల్స్‌ డే సందర్భంగా ప్రత్యేక షాపింగ్‌ సీజన్‌ను ప్రారంభించింది. 11 రోజుల పాటు జరిగే ఈ షాపింగ్‌లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లు, రాయితీలు ప్రకటిస్తుంటాయి.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని