రైల్వేను నిర్మలమ్మ ఇలా పట్టాలెక్కించారు..

కరోనాతో అన్ని రంగాలు కుదేలైనట్లుగానే రైల్వే రంగం సైతం 2020లో తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలల పాటు రైళ్లు పూర్తిగా స్టేషన్లకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టి........

Updated : 01 Feb 2021 16:00 IST

దిల్లీ: కరోనాతో అన్ని రంగాలు కుదేలైనట్లుగానే రైల్వేరంగం సైతం 2020లో గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. లాక్‌డౌన్‌ కారణంగా నెలల పాటు రైళ్లు పూర్తిగా స్టేషన్లకే పరిమితమయ్యాయి. ఇప్పటికీ రైలు సర్వీసులు పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభంకాలేదు. అయితే గూడ్సురైళ్లు రైల్వేలను మరింతగా నష్టాల్లోకి జారకుండా ఆదుకున్నాయి.  ఈ నేపథ్యంలో నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రైల్వేలకు భారీ కేటాయింపులు చేశారు. రైల్వే రంగానికి మొత్తం రూ.1.10 లక్షల కోట్లు కేటాయించారు. దీంట్లో రూ. 1.07 లక్షల కోట్లను మూలధన వ్యయం కోసం కేటాయించనున్నట్లు ప్రకటించారు. అలాగే భారత నూతన జాతీయ రైల్వే ప్రణాళికను ఆవిష్కరించారు. 

 బెజవాడకు రెండు కారిడార్లు...

నూతన రైల్వే ప్రణాళికలో భాగంగా సరకు రవాణా ఖర్చులను తగ్గించి మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి ఊతమిచ్చేందుకు చర్యలు చేపడతామని సీతారామన్ ప్రకటించారు. అందుకోసం ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌-కోస్ట్‌ కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ నుంచి విజయవాడ వరకు ఉత్తర-దక్షిణ కారిడార్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను తొలి దశలో రూపొందిస్తామని పేర్కొన్నారు. రైల్వేలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు దక్కిన ప్రధాన కేటాయింపులు ఇంతవరకే పరిమితం కావడం గమనార్హం. ఇక తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా నడవాలను 2022, జూన్‌ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. వీటిలో కొన్ని కారిడార్‌లను పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ)తో చేపడతామని తెలిపారు. సోనేనగర్‌-గోమో మధ్య 263 కి.మీ కారిడార్‌ను, గోమో-డంకునీ మధ్య 274.3 కి.మీ కారిడార్‌ను కొత్తగా ప్రతిపాదించారు. 

100 శాతం విద్యుదీకరణ...

రైల్వే శాఖకు సంబంధించి రానున్న పదేళ్ల రోడ్డు మ్యాప్‌ను నిర్మలా సీతారామన్‌ ఈ బడ్జెట్‌లో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. పర్యాటక రూట్లలో ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందించేందుకు వీలుగా అధునాతన విస్టాడోమ్‌ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను జత చేయనున్నట్టు తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లను 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 2021 చివరి నాటికి 46 వేల కి.మీ అంటే 72 శాతం రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్‌ పూర్తి కానున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల భద్రత కోసం గత కొన్నేళ్లలో చేపట్టిన చర్యలు ఫలితాలిస్తున్నాయని పేర్కొన్నారు. ఎక్కువ రద్దీ, వినియోగం ఉన్న రూట్లలో భద్రత కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన ‘యాంటీ కొలిజన్ సిస్టమ్‌’‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మెట్రోలైట్, మెట్రోనియో టెక్నాలజీలను టైర్-2, టైర్-1 నగరాల్లో ఏర్పాటు చేయ‌నున్నట్లు పేర్కొన్నారు.

రైల్వే ప్రణాళిక 2024...

గతేడాది డిసెంబర్‌లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి జాతీయ రైల్వే ప్రణాళిక ముసాయిదాను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 2030 నాటికి డిమాండు తగ్గట్లుగా సామర్థ్యాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సరకు రవాణాలో రైల్వేల వాటాను 45 శాతానికి పెంచాలని నిర్దేశించారు. సరకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని పెంచి తద్వారా రవాణా సమయాన్ని గణనీయంగా తగ్గించాలని నిర్ణయించారు. దీంతో రైలు రవాణా ఖర్చును దాదాపు 30 శాతం దాకా తగ్గించి ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయించాలని సూచించారు. అలాగే ప్రణాళికలో భాగంగా 2024 కల్లా కొన్ని కీలక ప్రాజెక్టుల సత్వర అమలుకు రైల్వేశాఖ శ్రీ‌కారం చుట్టనున్నట్లు తెలిపారు. ఈ మేర‌కు 2024 నాటికి 100 శాతం విద్యుదీకరణ, రద్దీ మార్గాల్లో బ‌హుళ రైల్వే లైన్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దిల్లీ-హావ్‌డా, దిల్లీ-ముంబయి మార్గాల్లో రైళ్ల వేగాన్ని 160 కిలోమీటర్లకు పెంచ‌డంతోపాటు.. ఇతర మార్గాల్లో 130 కిలోమీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే హైదరాబాద్‌-బెంగళూరు, ముంబయి-హైదరాబాద్‌ సహా మరికొన్ని ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్‌ రైల్వే కనెక్టివిటీని అభివృద్ధి చేయాలని నిర్దేశించుకున్నారు. కానీ వాటికి సంబంధించి తాజా బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

ఇవీ చదవండి...

20 ఏళ్లు దాటితే వాహనాలు తుక్కుకే..!

ఈ ఏడాది ఐపీవోకు ఎల్‌ఐసీ..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని