Cryptocurrency: క్రిప్టోని గుర్తించి నియంత్రించాలి: స్వదేశీ జాగరణ్‌ మంచ్‌

క్రిప్టో కరెన్సీని పెట్టుబడి సాధనంగా వర్గీకరించాల్సిందేనని ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేవీ జాగరణ్‌ మంచ్‌(ఎస్‌జేఎం) కోరింది. క్రిప్టో లావాదేవీలపై నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది....

Published : 20 Nov 2021 16:19 IST

దిల్లీ: క్రిప్టో కరెన్సీలో పెట్టే పెట్టుబడులన్నింటినీ గుర్తించాల్సిందేనని ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌(ఎస్‌జేఎం) ప్రభుత్వాన్ని కోరింది. క్రిప్టో లావాదేవీలపై నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది. అలాగే క్రిప్టో మైనింగ్‌, నిర్వహణ, లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని దేశీయ సర్వర్లలోనే నిక్షిప్తం చేయాలని ఎస్‌జేఎం కో-కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ విజ్ఞప్తి చేశారు. దీని వల్ల చట్టవిరుద్ధ ఆర్థిక కార్యకలాపాలను గుర్తించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని తెలిపారు. 

ప్రపంచంలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా క్రిప్టోలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని మహాజన్‌ గుర్తుచేశారు. ప్రైవేటు సంస్థల చేతిలో ఉన్న ఎక్ఛేంజీల ద్వారా ఇది జరుగుతోందని తెలిపారు. కానీ, ఇప్పటికీ ఏ దేశంలోనూ ఒక సెంట్రల్‌ ఏజెన్సీ దీన్ని నియంత్రించడం లేదని పేర్కొన్నారు. అసలు లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? వీటిని ఎలాంటి కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు? వంటి వాటిపై ఎలాంటి స్పష్టత లేదని తెలిపారు.

ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో లావాదేవీల నిర్వహణపై ఓ అవగాహన ఏర్పడుతుందన్నారు. అలాగే పన్నులు విధించడం, జాతీయ భద్రత వంటి అంశాల్లోనూ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. క్రిప్టోని డబ్బుగా పరిగణించలేమన్నారు. కాబట్టి మారకద్రవ్యంగా దీన్ని గుర్తించలేమని స్పష్టం చేశారు. తుపాకులు, మాదకద్రవ్యాల కొనుగోలు సహా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు క్రిప్టో కరెన్సీని వినియోగించిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని