Olympics: ఒలింపిక్స్‌..  ఆర్థికంగా లాభమా? నష్టమా?

ఈ భూమిపై జరిగే అతిపెద్ద సంబరాల్లో ఒలింపిక్స్ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాలుగేళ్లకోసారి వచ్చే క్రీడా కుంభమేళా నిర్వహణకు అనేక నగరాలు పోటీ పడుతుంటాయి. దాదాపు ఒక దశాబ్దం ముందే వేదికలు ఖరారైపోతాయి...

Updated : 26 Jul 2021 11:52 IST

ఈ భూమిపై జరిగే అతిపెద్ద పోటీల్లో ఒలింపిక్స్ ఒకటి. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ క్రీడా కుంభమేళా నిర్వహణకు అనేక నగరాలు పోటీ పడుతుంటాయి. దాదాపు ఒక దశాబ్దం ముందే వేదికలు ఖరారైపోతాయి. మరి ఇంతటి భారీ కార్యక్రమాల నిర్వహణకు ఖర్చు ఎవరు భరిస్తారు? ఒలింపిక్స్‌ నిర్వహణ ఆర్థికంగా లాభమా? నష్టమా?


1970ల తర్వాత మారిన పరిస్థితులు

తొలినాళ్లలో ఒలింపిక్స్‌ నిర్వహణకు పెద్ద ఖర్చేమీ అయ్యేది కాదు. ఆటల నిర్వహణకు తగిన వసతులు ఉన్న ధనిక దేశాలే ఒలింపిక్స్‌కు వేదికలుగా ఉండేవి. ఐరోపా, అమెరికా దేశాల్లోనే ఈ క్రీడోత్సవాలు ఎక్కువగా జరిగేవి. అయితే, 1970 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ‘ఒలింపిక్స్‌-ఆర్థిక స్థితిగతుల’పై విస్తృత అధ్యయనం జరిపిన ఆండ్రూ జింబాలిస్ట్‌ తెలిపారు. అప్పట్లో టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు ఉండేవి కాదు. దీంతో క్రీడల నిర్వహణ సాదాసీదాగానే జరిగేది. టీవీలు అందుబాటులోకి రావడంతో ఒలింపిక్స్‌కు ఆదరణ పెరిగింది. హంగు ఆర్భాటాలూ ఎక్కువైపోయాయి. బ్రాడ్‌కాస్టర్లు, మార్కెటింగ్‌, స్పాన్సర్లు ఇలా ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీంతో ఒలింపిక్స్ ఓ బ్రాండింగ్‌ ఈవెంట్‌లా మారిపోయింది. పైగా ఏటా క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది. ఆటలు, వాటిలోని విభాగాల సంఖ్య సైతం పెరుగుతూ వస్తోంది. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది.


ఖర్చు రూ.30 వేల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు

ఒలింపిక్స్‌ నిర్వహణకు కావాల్సిన సదుపాయాలన్నీ సిద్ధం చేస్తామని ఆయా నగరాలు బిడ్డింగ్‌ సమయంలోనే అంగీకరించాల్సి ఉంటుంది. అలా బిడ్డింగ్‌ గెల్చుకోవడం నుంచే ఖర్చు మొదలవుతుంది. 2016 ఒలింపిక్స్‌ నిర్వహణ బిడ్డింగ్‌ను గెల్చుకోవడం కోసం జపాన్‌ దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసి విఫలమైంది. తాజా ఒలింపిక్స్ నిర్వహణ కోసం దాంట్లో సగం ఖర్చుపెట్టాల్సి వచ్చింది. బిడ్డింగ్‌ గెల్చిన తర్వాత ఆయా నగరాలకు దాదాపు పదేళ్ల సమయం ఉంటుంది. ఈ కాలంలో ఆటగాళ్లు, వీక్షకుల సంఖ్యను అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి. రోడ్లు, రైళ్లు, విమాన మార్గాలు, భవనాలు, వంతెనలు, క్రీడా ప్రాంగణాలు, మైదానాలు నిర్మించాలి. కనీసం 40 వేల హోటల్‌ గదులను సిద్ధం చేయాలన్నది ఇంటర్నేషనల్‌ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ) సూచన. దీంతో 2016 రియో ఒలింపిక్స్‌ కోసం బ్రెజిల్‌ అదనంగా 15 వేల కొత్త హోటల్‌ గదులను నిర్మించాల్సి వచ్చింది. సాధారణంగా ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం ఆయా నగరాల్లో అప్పటికే ఉన్న మౌలిక వసతులను బట్టి రూ.30 వేల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి రావచ్చు. 2014లో సోచిలో జరిగిన శీతాకాల ఒలింపిక్స్‌ నిర్వహణకు రష్యా 50 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయగా.. అందులో 85 శాతం క్రీడేతర మౌలిక వసతుల కల్పనకే వినియోగించింది. ఇక 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ నిర్వహణకు చైనా 45 బిలియన్ డాలర్లు వెచ్చించగా.. అందులో సగం రోడ్లు, రైలు, విమాన రవాణా వసతుల కల్పనకు ఖర్చు చేసింది.


నిరుపయోగంగా రూ.3.4 వేల కోట్ల స్టేడియం

అయితే, క్రీడల పేరిట చేపట్టే మౌలిక వసతుల అభివృద్ధి దీర్ఘకాలంలో ఆయా నగరాలకు వరంగా మారే అవకాశం ఉందని కొందరు వాదిస్తుంటారు. కానీ, 1970ల తర్వాత ఆ పరిస్థితులు మారిపోయాయి. చేస్తున్న ఏర్పాట్లు ఆయా నగరాల స్తోమతకు మించిపోతున్నాయి. ఒలింపిక్స్‌ కోసం నిర్మించే క్రీడా మైదానాలు, రోడ్లు, భవనాలు చాలా వరకు నిరుపయోగంగా మారుతున్నాయి. పైగా దీర్ఘకాలంలో వాటి నిర్వహణ కష్టసాధ్యమవుతోంది. బీజింగ్‌లో నిర్మించిన ‘బర్డ్స్‌ నెస్ట్‌’ స్టేడియం నిర్మాణానికి 460 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.3.4 వేల కోట్లు) ఖర్చు చేశారు. ఇక దీని వార్షిక నిర్వహణ ఖర్చు 10 మిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. 2004 ఒలింపిక్స్‌ కోసం ఏథెన్స్‌లో నిర్మించిన దాదాపు అన్ని వసతులు ప్రస్తుతం నిరుపయోగంగా పడి ఉన్నాయి.


అప్పుల్లో కూరుకుపోయిన నగరాలు

ఒలింపిక్స్‌ నిర్వహించి చాలా నగరాలు అప్పుల్లో కూరుకుపోయాయి. గ్రీకు ఆర్థిక సంక్షోభానికి ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ నిర్వహణ కూడా ఒక కారణం. 1976లో మాంట్రియల్‌లో నిర్వహించిన ఒలింపిక్స్‌ కోసం కెనడా చేసిన అప్పు తీర్చడానికి దాదాపు 30 సంవత్సరాలు పట్టింది. రియోలో జరిగిన ఒలింపిక్స్‌ కోసం భారీగా అప్పులు చేయాల్సి వచ్చింది. తాజాగా టోక్యోలో జరుగుతున్న క్రీడోత్సవాల కోసం దాదాపు 35 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రీడా వేడుకల నిర్వహణను జపాన్‌లో 85 శాతం మంది వ్యతిరేకించినట్లు ఓ ప్రముఖ సర్వే తేల్చింది. ఇప్పటికే కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ల వల్ల కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక వ్యవస్థకు ఇది గుదిబండగా మారే ప్రమాదం ఉందన్న వాదన ఉంది.


ఇంతకీ ఐఓసీ పాత్రేంటి?

ఒలింపిక్స్‌ క్రీడల నిర్వహణ ఖర్చులో కొంత ఐఓసీ కూడా భరిస్తుంది. కానీ, పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా అది నామమాత్రంగా మారిపోయింది. ఈ క్రీడా పోటీలు జరిగే పక్షం రోజుల నిర్వహణకు అయ్యే ఖర్చును మాత్రమే ఐఓసీ ఇస్తుంది. ఈ మధ్య తాత్కాలిక వసతుల ఏర్పాట్లకు కూడా నిధులు సమకూరుస్తోంది. ఐఓసీ బడ్జెట్‌లో కేవలం 10 శాతం మాత్రమే ఒలింపిక్స్‌ ఆటల నిర్వహణకు ఖర్చు చేస్తుంది. మిగిలిన సొమ్మును ఆయా దేశాల్లో క్రీడా వసతులు, ఆటగాళ్లు, శిక్షకులకు ఆర్థిక సహకారం కోసం వెచ్చిస్తుంది. ఈ నేపథ్యంలో మైదానాలు, రోడ్లు, భవనాల నిర్మాణాలకు చేసే అతిపెద్ద ఖర్చుకు ఐఓసీ సహకారం ఉండదు. ఆయా దేశాల పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే అర్హత ఉన్న నగరాలే ముందుకు రావాలని ఐఓసీ ముందే ప్రకటిస్తుంది. నిజానికి ఐఓసీ ఒక ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ. ఇక ఒలింపిక్స్‌కు వచ్చే ఆదాయంలో మార్కెటింగ్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కులదే సింహభాగం. ఇది ఐఓసీకే చెందుతుంది. టికెట్ల ద్వారా వచ్చే రాబడిలో మాత్రం ఆతిథ్య నగరానికి కూడా కొంత వాటా ఉంటుంది.


మరి నగరాలు ఎందుకు పోటీ పడతాయి..

ఒలింపిక్స్‌ నిర్వహించే నగరాల్లో తాత్కాలిక ఉపాధి దొరుకుతుంది. మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి. దీర్ఘకాలంలో పర్యాటక ప్రాంతాలుగా మారే అవకాశం ఉంది. ఆయా పట్టణాల ఖ్యాతి విశ్వవ్యాప్తమై పెట్టుబడులు వస్తాయి. స్థానికంగా ఉండే నిర్మాణ సంస్థలు సహా ఇతర వ్యాపారాలు భారీగా పుంజుకుంటాయి. కానీ, ముందు అనుకున్నట్లుగా.. చేస్తున్న ఖర్చుతో పోలిస్తే వస్తున్న ఆర్జన చాలా తక్కువని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రానురాను ఒలింపిక్స్‌ నిర్వహణ వల్ల కలిగే ప్రయోజనాలు పూర్తిగా తగ్గిపోతున్నాయని జింబాలిస్ట్‌ చెప్పారు.


వ్యయ నియంత్రణకు మార్గం లేదా?

1896లో ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభమైన సమయంలో సమాచార సాంకేతికత వ్యవస్థ లేదు. దీంతో ఆటగాళ్లందరూ ఒకచోటికి చేరాల్సిన అవసరం ఉండేది. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేదు. ఒక్కో దేశంలో ఒక్కో ఆట ప్రసిద్ధి. ఆయా దేశాల్లో ఆ ఆటలకు సంబంధించి మెరుగైన వసతులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక్కో ఆటను ఒక్కో దేశంలో నిర్వహించొచ్చు. దీని వల్ల ఖర్చు భారీగా తగ్గిపోతుంది. పైగా అనేక దేశాలకు నిర్వహణ ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఏర్పడుతుందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని