Online Gold Sales: రూ.100కే బంగారం.. తెగ కొంటున్న జనం!

ఆన్‌లైన్‌లో బంగారం కొనేవారి సంఖ్య పెరగడంతో.. ఆభరణాల దుకాణాలు సైతం ఆ బాటలోనే పయనిస్తున్నాయి...

Updated : 29 Sep 2021 13:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సంక్షోభం నుంచి పరిస్థితులు క్రమంగా చక్కబడుతుండడంతో భారత్‌లో బంగారానికి గిరాకీ పుంజుకుంటోంది. భారత్‌లో ఇప్పటికీ ఆభరణాల దుకాణాలకు వెళ్లి బంగారం కొనేవాళ్లే ఎక్కువ. కానీ, కరోనా సమయంలో ఆన్‌లైన్‌లో పుత్తడిని కొనే ట్రెండ్ పెరిగింది. దీంతో ఆభరణాల దుకాణాల యజమానులు సైతం తమ పంథాను మార్చారు.

తనిష్క్‌, కల్యాణ్‌ జువెల్లర్స్‌ ఇండియా లిమిటెడ్‌, పీసీ జువెల్లర్‌ లిమిటెడ్‌, సెంకో గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ఆన్‌లైన్‌లో గోల్డ్‌ను అమ్మడం ప్రారంభించాయి. పైగా రూ.100లకు కూడా బంగారం అందిస్తుండడంతో చాలా మంది కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. నేరుగా వెబ్‌సైట్‌ లేదా డిజిటల్‌ గోల్డ్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఈ సంస్థలు ఆన్‌లైన్ విక్రయాలు జరుపుతున్నాయి. అయితే, కనీసం ఒక గ్రామ్‌ బంగారానికి సరిపడా డబ్బు చెల్లించగానే డెలివరీ అందజేస్తున్నారు.

భారత్‌లో డిజిటల్‌ బంగారు విక్రయాలు కొత్తేమీ కాదు. మొబైల్‌ వ్యాలెట్లు, ఆగ్మంట్‌ గోల్డ్‌ ఫర్‌ ఆల్‌, సేఫ్‌ గోల్డ్‌ వంటి సంస్థలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో పసిడిని విక్రయిస్తున్నాయి. అయితే, ఆభరణాల దుకాణాలు మాత్రం ఈ ప్రోడక్టులను విక్రయించడానికి ఇప్పటి వరకు వెనుకాడాయి. కానీ, కరోనా సంక్షోభంతో పంథాను మార్చుకోవాల్సి వచ్చింది.

పండుగ సీజన్ నేపథ్యంలో భారత్‌లో బంగారు విక్రయాలు ఊపందుకున్నాయి. యువకులు డిజిటల్ గోల్డ్‌ వైపు మొగ్గుచూపుతుండడంతో.. ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ఆన్‌లైన్‌లో విక్రయాలు 200 శాతం పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా రూ.3,000-4,000 మధ్య ఉండే నాణేలు, బిస్కట్లపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని