బీమా పాల‌సీల కొనుగోలు విష‌యంలో మోస‌పోవ‌ద్దు

ఐఆర్‌డీఏఐ వ‌ద్ద రిజిష్ట‌ర్ అయిన సంస్థ నుంచి మాత్ర‌మే బీమా పాల‌సీల‌ను కొనుగోలు చేయాలి. బీమా అమ్మ‌కందారుల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని బీమా నియంత్ర‌ణ సంస్థ ఐఆర్‌డీఏఐ కోనుగోలు దారుల‌ను..

Updated : 01 Jan 2021 20:05 IST

ఐఆర్‌డీఏఐ వ‌ద్ద రిజిష్ట‌ర్ అయిన సంస్థ నుంచి మాత్ర‌మే బీమా పాల‌సీల‌ను కొనుగోలు చేయాలి. బీమా అమ్మ‌కందారుల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని బీమా నియంత్ర‌ణ సంస్థ ఐఆర్‌డీఏఐ కోనుగోలు దారుల‌ను హెచ్చ‌రించింది. ఈ మేర‌కు ఇటీవ‌ల ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ఒక నోటిసును జారీ చేసింది. పాల‌సీలు, రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ణ‌లు, వైద్య చికిత్స‌ల‌పై రాయితీ(డిస్కౌంట్‌) ఇవ్వ‌డం ద్వారా కొంద‌రు ఆరోగ్య బీమా పాల‌సీల‌ను విక్రయిస్తున్న‌ట్లు ఐఆర్‌డీఏఐ గుర్తించింది. అటువంటి బీమా విక్ర‌య‌దారుల వ‌ద్ద మోస‌పోకుండా కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సూచించింది.

న‌మోదిత సంస్థ‌ల వ‌ద్ద మాత్ర‌మే కొనుగోలు చేయాలి: ఐఆర్‌డీఏఐ వ‌ద్ద న‌మోదు చేసుకున్న సంస్థల‌ నుంచి మాత్ర‌మే బీమా కొనుగోలు చేయాలి. ఈ సంస్థ‌ల జాబితా ఐఆర్‌డీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఒక‌వేళ సంస్థ నుంచి కాకుండా ఒక వ్య‌క్తి నుంచి బీమా కొనుగోలు చేసేప్పుడు, బీమా ప్లాన్‌, విక్ర‌య‌దారుని గురించిన‌ సందేహాలు నివృత్తి చేసుకునేందుకు బీమా సంస్థ‌ను సంప్ర‌దించాలి. అన‌ధికార వ్య‌క్తులు లేదా సంస్థ‌ల నుంచి ఇటువంటి సేవ‌ల‌ను పొందేవారు వారి స్వంత పూచితో కొనుగోలు చేసుకోవ‌చ్చని ఐఆర్‌డీఐ తెలిపింది.

ఖాళీ ఫారం\చెక్కుల‌పై సంత‌కాలు చేయ‌వ‌ద్దు: బీమా కొనుగోలు చేసేప్పుడు కొంత మంది ఖాళీ ద‌ర‌ఖాస్తు ఫారంపై సంత‌కాలు చేస్తుంటారు. ఇలా చేయ‌డం ద్వారా బీమా విక్రేత మోసం చేసే అవ‌కాశం ఉంటుంది. మీరు ఎంచుకున్న ప్లాన్ కాకుండా మ‌రొక ప్లాన్ ఇవ్వ‌చ్చు. మోస‌పోకుండా ఉండేందుకు ద‌ర‌ఖాస్తు ఫారంను స్వ‌యంగా మీరే పూర్తి చేయ‌డం మంచిది.

ప్రీమియం చెల్లింపు ర‌శీదు: బీమా సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నేరుగా ప్రీమియం చెల్లించడం మేలు. అక్కౌంట్ పేయి చెక్ ద్వారా కూడా ప్రీమియం చెల్లించ‌వ‌చ్చు. న‌గ‌దు రూపంలో ప్రీమియం చెల్లించేవారు బీమా సంస్థ బ్రాంచికి వెళ్లి చెల్లింపులు చేయాలి. ఒక‌వేళ మీరు బీమా సంస్థ ఏజెంట్‌కు ప్రీమియం క‌డుతుంటే, బీమా సంస్థ‌ను కాల్ ద్వారా సంప్ర‌దించి ఏజెంట్ ఐడీ కార్డు పూర్తి వివ‌రాలను ధృవీక‌రించు కోవాలి.

రెండు సార్లు చెక్ చేసుకోండి: ఏదైనా పాల‌సీ మీకు న‌చ్చిన‌ట్ల‌యితే కొనుగోలు చేసే ముందు, పాల‌సీ గురించిన నిజానిజాలు ఒక‌టికి రెండు సార్లు బీమా సంస్థ నుంచి తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిచండి. పాల‌సీ కొనుగోలుకు కొంత స‌మ‌యాన్ని కేటాయించండి. మీరు కేటాయించే ఈ స‌మ‌యం భ‌విష్య‌త్తులో మోసాల‌కు గురికాకుండా కాపాడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని