ఆరోగ్య బీమా క్లెయిం విధానం

ఆరోగ్య బీమా క్లెయిం విధానంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ప‌రిహారం ల‌భించ‌డంలో జాప్యం ఏర్ప‌డ‌దు.

Published : 20 Dec 2020 14:53 IST

ఆరోగ్య బీమా క్లెయిం చేసుకునేటప్పుడు పలు కీలక పత్రాలు అవసరమవుతాయి. ఆపదలో ఆదుకోవడానికే ఆరోగ్య బీమా పాలసీలు తీసుకుంటాం. హఠాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మన హడావిడిలో మనం ఉంటాం. అలాంటప్పుడు క్లెయిం కోసం కచ్చితంగా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి.

వైద్య సహాయ నిమిత్తం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటాం. కొన్ని సార్లు అవుట్‌ పేషెంట్‌గా వెళ్లి చికిత్స పొందుతాం. మరికొన్నిసార్లు ప్రత్యేక రుగ్మతలకు ముందుగానే చికిత్స చేయించుకోవాలని నిశ్చయించుకొని వెళతాం. రోడ్డు ప్రమాదాలు, గుండె జబ్బులు వంటివాటికైతే రోగిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాల్సి ఉంటుంది. ఇలా వివిధ సందర్భాలలో ఆరోగ్య బీమా క్లెయిమ్ చేసుకునేందుకు అవసరమైన వివరాలు, విధానం తెలుసుకోవడం ఎంతోముఖ్యం.

క్లెయిం చేసుకునేందుకు సేకరించాల్సిన పత్రాలు

  • ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లు, బిల్లులు, రశీదులు వంటివన్నీ సేకరించుకోవాలి.

  • బిల్లులు, రశీదులపై పాలసీదారుడి పేరు, తేదీలు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి.

  • ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యేటప్పుడు డిశ్ఛార్జి కార్డు తీసుకోవాలి.

  • ప్రిస్క్రిప్షన్‌, బిల్లులు, రశీదుల జిరాక్సు కాపీలను సిద్ధం చేసుకోండి. క్లెయిం చేసేటప్పుడు ఒరిజినల్‌ వాటితో పాటు ఒక సెట్టు జిరాక్స్‌ కాపీలను ఉంచండి. మన దగ్గర కూడా ఒక సెట్టు జిరాక్స్‌ కాపీ ఉంచుకోవడం మంచిది.

  • కంపెనీ నుంచి క్లెయిం పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. ఇది ఆయా కంపెనీ వెబ్‌సైట్లో లేదా ఏజెంటు ద్వారా లభిస్తుంది. దాన్ని నింపి అనుబంధ రశీదులు, ప్రిస్కిప్షన్లు తేదీల వారీగా సిద్ధం చేసుకోవాలి.

  • ఆరోగ్య బీమా పాలసీ కాపీ

  • థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌ (టీపీఏ) జారీచేసే టీపీఏ కార్డు

  • క్లెయిం ఫారంపై పాలసీదారు, డాక్టరు ధ్రువీకరించిన‌ట్టు సంతకం చేయాల్సి ఉంటుంది.

  • చికిత్స కోసం ఆసుపత్రిలో చేరేందుకు వైద్యుడి నుంచి సిఫార్సు

క్లెయిం చేసుకునేటప్పుడు ఇలా సంప్రదించాలి…

  • రోగిని ఆసుపత్రిలో చేర్చే ముందు లేదా చేరిన 24 గంటలలోపు ఆ విషయాన్ని టోల్‌ ఫ్రీ నంబరు ద్వారా లేదా మెయిల్‌ ద్వారా బీమా కంపెనీకి తెలియపర్చాలి.

  • ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన తర్వాత లేదా చికిత్స ముగిసిన ఏడు రోజుల్లోగా క్లెయిం కోసం బీమా కంపెనీని సంప్రదించి విధివిధానాలను పూర్తిచేయాలి.

  • నియమనిబంధనలకు అనుగుణంగా లేని పత్రాలకు బీమా కంపెనీలు క్లెయిం చెల్లించవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

  • అన్ని ఆసుపత్రి ఖర్చులను బీమా కంపెనీలు చెల్లించవు. పాలసీ పరిధిలోకి వచ్చేవాటిని మాత్రమే చెల్లిస్తారు. దీని కోసం పాలసీ పత్రాన్ని జాగ్ర‌త్త‌గా పరిశీలించాలి.

నగదు రహిత చికిత్స కోసం అయితే …

  • టీపీఏ లేదా బీమా కంపెనీ పాలసీ తీసుకున్న తర్వాత ఓ గుర్తింపు కార్డును జారీచేస్తారు. ఆసుపత్రిలో చేరే సమయంలో దీన్ని చూపించాల్సి వస్తుంది.

  • ఆసుపత్రిలో చేరిన తర్వాత 24 గంటల లోపు ఫోన్‌ ద్వారా లేదా ఈమెయిల్‌ ద్వారా బీమా కంపెనీకి సమాచారం అందించాలి. అప్పుడు క్లెయిం ఇంటిమేషన్‌ సంఖ్యను బీమా కంపెనీ కేటాయిస్తుంది.

  • నగదు రహిత సదుపాయాన్ని పొందేందుకు బీమా కంపెనీ నియమనిబంధనల మేరకు ముందే అనుమతి పొందాల్సి ఉంటుంది.

  • నెట్‌వర్క్‌ పరిధి ఆసుపత్రులైతే నగదు రహిత సదుపాయం వర్తిస్తుంది. నెట్‌వర్క్‌ పరిధి దాటిన వాటికి బిల్లులు, రశీదులు పెట్టి క్లెయిం చేసుకోవాల్సి ఉంటుంది.

  • చికిత్స సమయంలో కొన్ని ఆసుపత్రులు టీపీఏ ఒప్పందాన్ని అనుసరించి 15నుంచి 20 శాతం డిపాజిట్‌ను ముందే వసూలు చేస్తాయి. ఈ మొత్తాన్ని క్లెయిం చేసుకునేటప్పుడు తిరిగి చెల్లిస్తారు.

రీయింబర్స్‌మెంట్‌ కోసం ఇలా:

  • ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యాక డిశ్ఛార్జి కార్డును పొందాలి.

  • డిశ్ఛార్జి కార్డు, బిల్లులు, రశీదుల జిరాక్సు కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలి.

  • చికిత్స ఇంటి వద్ద కూడా కొనసాగే సందర్భంలో డాక్టరు సిఫార్సు పొందాల్సి ఉంటుంది.

  • క్లెయిం ఫారం, ఒరిజినల్‌ బిల్లులు, డిశ్ఛార్జి కార్డు, బీమా కంపెనీ నిర్దేశించిన ఇతర పత్రాలను సమర్పించి క్లెయిం చేసుకోవాలి.

  • క్లెయిం ఫారంను నేరుగా బీమా కంపెనీకి సమర్పించాలనుకుంటే, వారి వద్ద నుంచి కంపెనీ ముద్ర ఉన్న రశీదును పొందాలి. నేరుగా చేర్చే అవకాశం లేనప్పుడు కొరియర్‌, స్పీడ్‌ పోస్ట్‌ లేదా రిజిస్టర్డ్‌ పోస్టుల ద్వారా పంపిస్తే భరోసా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు