జూనియర్‌ స్థాయిల్లో అధిక అవకాశాలు

జనవరి- మార్చి త్రైమాసికంలో జూనియర్‌ స్థాయి (2-5 ఏళ్ల పని అనుభవం కలిగిన) ఉద్యోగులను అధికంగా నియమించుకోవడానికి సంస్థలు మొగ్గు చూపుతున్నాయని టీమ్‌లీజ్‌ ఎంప్లాయిమెంట్‌ ఔట్‌లుక్‌ నివేదిక పేర్కొంది. 2020 అక్టోబరు- డిసెంబరుతో పోలిస్తే 7 శాతం అధిక నియామకాలు జరగొచ్చని అంచనా వేసింది

Published : 08 Jan 2021 01:10 IST

టీమ్‌లీజ్‌ నివేదిక

ముంబయి: జనవరి- మార్చి త్రైమాసికంలో జూనియర్‌ స్థాయి (2-5 ఏళ్ల పని అనుభవం కలిగిన) ఉద్యోగులను అధికంగా నియమించుకోవడానికి సంస్థలు మొగ్గు చూపుతున్నాయని టీమ్‌లీజ్‌ ఎంప్లాయిమెంట్‌ ఔట్‌లుక్‌ నివేదిక పేర్కొంది. 2020 అక్టోబరు- డిసెంబరుతో పోలిస్తే 7 శాతం అధిక నియామకాలు జరగొచ్చని అంచనా వేసింది.‘ప్రారంభ స్థాయిలో 2 శాతం, మధ్య స్థాయిలో 4 శాతం, సీనియర్‌ స్థాయి ఉద్యోగులకు 2 శాతమే గిరాకీ కనిపిస్తోంద’ని టీమ్‌లీజ్‌ వెల్లడించింది. వ్యాపారాల రికవరీ, బలమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో ఉద్యోగ విపణి సానుకూలంగా మారిందని తెలిపింది. 14 నగరాల్లో 21 రంగాలకు చెందిన 429 సంస్థల నుంచి సేకరించిన వివరాలతో ఈ నివేదికను వెలువరించారు. నివేదికలోని మరిన్ని అంశాలు ఇలా..
* మెట్రో, ప్రథమ శ్రేణి నగరాల్లో నియమాకాల్లో ఆశావహ వైఖరి పెరిగింది. ముఖ్యంగా బెంగళూరు, దిల్లీల్లో 10 శాతం పాయిట్ల వృద్ధి కనిపిస్తోంది.
* సమీక్షించిన 21 రంగాల్లో ఆరోగ్య సంరక్షణ, ఫార్మా, విద్యా సేవలు, ఇ-కామర్స్‌, టెక్నాలజీ అంకురాలు, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ, టెలికమ్యూనికేషన్‌ రంగాలు కొత్త నియామకాల్లో ముందున్నాయి.
* నియామకాల్లో 14% వృద్ధి: నౌకరీ జాబ్‌స్పీక్‌ సూచీ
* డిసెంబరులో దేశీయంగా నియామక కార్యకలాపాలు 14 శాతం వృద్ధి చెందాయని నౌకరీ జాబ్‌స్పీబ్‌ సూచీ స్పష్టం చేసింది. నవంబరుతో పోలిస్తే గత నెలలో బీమా, వాహన, వాహన విడిభాగాల రంగాల్లో నియామకాలు పెరిగాయని పేర్కొంది. నవంబరులో నౌకరీ జాబ్‌స్పీబ్‌ సూచీ 1727గా ఉండగా, డిసెంబరులో 14 శాతం వృద్ధి చెంది 1972కు చేరింది. ఏడాది ప్రాతిపదికన చూస్తే మాత్రం.. నియామకాలు 10 శాతం తగ్గాయి.కొవిడ్‌-19 తర్వాతి నెలల్లో ఇదే తక్కువ క్షీణత కావడం గమనార్హం. నివేదికలోని మరిన్ని అంశాలు ఇలా..
* ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో నియామకాలు 56 శాతం తగ్గినా, ఆ తర్వాతి నెలల్లో స్థిరమైన రికవరీ కనిపిస్తోంది. ఆతిథ్యం, పర్యాటకం, వాహన, రిటైల్‌ రంగాలు కోలుకుంటున్నాయి.
* డిసెంబరులో బీమా రంగంలో నియామకాలు 45 శాతానికి పైగా పెరిగాయి. కొవిడ్‌-19 సంక్షోభం తర్వాత ఆరోగ్యం, వ్యాపార భద్రతపై ప్రజలు దృష్టి పెడుతున్నారు.
* బ్యాంకింగ్‌ ఆర్థిక సేవలు, ఔషధ, బయోటెక్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ-సాఫ్ట్‌వేర్‌ వంటి కీలక రంగాలు సైతం సానుకూల వృద్ధి సాధించాయి.
* నగరాల వారీగా చూస్తే.. పుణెలో 18%, దిల్లీ 16%, కోల్‌కతా 14%, ముంబయి 10% మేర నియామకాలు వృద్ధి చెందాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో కోయంబత్తూర్‌లో 30%, అహ్మదాబాద్‌ 20%, జయపూర్‌ 15% చొప్పున వృద్ధి నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని