ఐటీఆర్ గ‌డువు పెరిగిన‌ప్ప‌టికీ వ‌డ్డీ వ‌ర్తిస్తుంది

 సెక్షన్ 234 ఎ కింద పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించింది

Published : 24 Jul 2021 12:06 IST

కోవిడ్-19 మ‌హ‌మ్మారి సంక్షోభం నేప‌థ్యంలో ప‌న్ను చెల్లింపుదారుల‌కు ప్ర‌భుత్వం కొంత ఉప‌శ‌మ‌నం క‌ల్పించింది. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఆదాయ ప‌న్ను రిట‌ర్నుల గ‌డువును సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు పెంచింది.  అయితే గ‌డువు పెంచిన‌ప్ప‌టికీ అంత‌కుముందు ఉన్న‌ జరిమానా వ‌డ్డీ ఛార్జీల‌ను య‌థావిధిగా చెల్లించాలి. వాటిపై ఎలాంటి మిన‌హాయింపు లేద‌ని పేర్కొంది. ఆదాయ ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం సెక్ష‌న్  234ఎ, సెక్ష‌న్ 234బి, సెక్ష‌న్ 234సి కింద ఆల‌స్య చెల్లింపుల‌కు గాను వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. 

ఐటీఆర్ దాఖ‌లులో ఆల‌స్యం చేస్తే సెక్ష‌న్ 234ఎ కింద వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఐటీఆర్ ఫైలింగ్ చివ‌రి తేది జులై 31, 2021 అనుకుంటే ఆగ‌స్ట్ 5 రోజు ఐటీఆర్ దాఖ‌లు చేస్తే, చెల్లించాల్సిన మొత్తం ప‌న్నుపై నెల‌కు 1 శాతం చొప్పున వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. అంటే ఇక్క‌డ ఒక నెల దాటి మ‌రో నెల‌లో ఐదు రోజులే అయిన‌ప్ప‌టికీ, దాన్ని మొత్తం నెల‌గా భావిస్తారు. అందుకే పూర్తిగా నెల‌రోజుల వ‌డ్డీ వ‌ర్తింప‌జేస్తారు.  అయితే గ‌త సంవ‌త్స‌రం మాదిరిగా ప్ర‌భుత్వం ఈ వ‌డ్డీ విష‌యంలో కొంత మిన‌హాయింపు అందించింది. చెల్లించాల్సిన ప‌న్ను మొత్తం రూ.ల‌క్ష లోపు ఉంటే ఇది వ‌ర్తించ‌దు. ల‌క్ష రూపాయ‌ల కంటే ఎక్కువ‌గా ఉంటే వ‌ర్తిస్తుంది. అంటే వారికి ఇప్పుడు సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఆగ‌స్ట్, సెప్టెంబ‌ర్ నెల‌ల‌కు 1 శాతం చొప్పున వ‌డ్డీ చెల్లించాలి. 

సెక్ష‌న్ 234బి కింద వ‌డ్డీ ఎప్పుడు వ‌ర్తిస్తుందంటే..ప‌న్ను చెల్లింపుదారుడు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించ‌క‌పోతే లేదా  90 శాతం క‌న్నా త‌క్కువ‌గా చెల్లిస్తే 1 శాతం చొప్పున వ‌డ్డీ ప‌డుతుంది. సెక్ష‌న్ 208 ప్ర‌కారం ఒక సంవ‌త్స‌రానికి ప‌న్ను రూ.10,000 లేదా అంత‌కంటే ఎక్కువ‌గా ఉంటే ముంద‌స్తు ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక‌వేళ చేయ‌క‌పోతే సెక్ష‌న్ 234బి కింద నెల‌కు 1 శాతం చొప్పున వ‌డ్డీ ఉంటుంది. కాబ‌ట్టి ఐటీఆర్ దాఖ‌లు ఆల‌స్యమ‌వుతుంద‌నుకుంటే క‌నీసం ముంద‌స్తు ప‌న్ను చెల్లించ‌డం మంచిది. 

ముంద‌స్తు ప‌న్ను చెల్లింపు,  నిర్ణీత వాయిదాల్లో చెల్లించాల్సిన దానికంటే త‌క్కువ‌గా ఉంటే అప్పుడు సెక్ష‌న్ 234సి కింద వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. కాబ‌ట్టి ప‌న్ను చెల్లింపుదారుడు వ‌రుస‌గా జూన్‌, సెప్టెంబ‌ర్‌, డిసెంబ‌ర్, మార్చి నెల 15 నాటికి..15 శాతం, 45 శాతం, 75 శాతం, 100 శాతం చొప్పున వాయిదాల్లో చెల్లించాలి. ఒక‌వేళ ముంద‌స్తు ప‌న్ను చెల్లింపు  త‌క్కువ‌గా ఉంటే ఆ నిర్థిష్ట త్రైమాసికంలో 3 శాతం చొప్పున వ‌డ్డీ వ‌సూలు చేస్తారు.
 
ఈ సంవత్సరం, పన్ను శాఖ కొత్త ఆదాయ పన్ను పోర్టల్‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. కానీ దీంతో ప‌న్ను చెల్లింపుదారులు కొన్ని సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ సంవ‌త్స‌రం అంద‌రికీ సెక్షన్ 234 ఎ కింద ఉపశమనం అందించాలని  ప‌న్ను నిపుణులు అంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని