హైదరాబాద్‌లో ‘జిందాల్‌ స్టీల్‌మార్ట్‌’

జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ (జేఎస్‌పీఎల్‌) హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతంలో ‘జిందాల్‌ స్టీల్‌మార్ట్‌’ ఏర్పాటు చేసింది. తాము ఉత్పత్తి చేస్తున్న అన్ని రకాల స్టీలు ఉత్పత్తులను ప్రదర్శించడమే కాక, ఏ తరహా భూమి,

Published : 12 Aug 2021 01:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ (జేఎస్‌పీఎల్‌) హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతంలో ‘జిందాల్‌ స్టీల్‌మార్ట్‌’ ఏర్పాటు చేసింది. తాము ఉత్పత్తి చేస్తున్న అన్ని రకాల స్టీలు ఉత్పత్తులను ప్రదర్శించడమే కాక, ఏ తరహా భూమి, వాతావరణానికి, ఎటువంటి నాణ్యత గల స్టీల్‌ వాడాలి, వాటి ధరల వంటివి వినియోగదార్లకు తెలియ చెప్పేందుకు ఈ స్టీల్‌మార్ట్‌ ఉపయోగ పడుతుందని సంస్థ తెలిపింది. దక్షిణాదిలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కేంద్రాన్ని నెలకొల్పినట్లు జేఎస్‌పీఎల్‌ వెల్లడించింది. ఇక్కడ టీఎంటీ బార్లు, ప్లేట్లు, స్ట్రక్చరల్‌ స్టీల్‌, రైల్‌, షీట్‌ పైల్స్‌,  ‘జిందాల్‌ పాంథర్‌’ బ్రాండు పేరుతో తయారు చేస్తున్న రీబార్లు..తదతర ఉత్పత్తులు లభిస్తాయని పేర్కొంది.దేశవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు 3 నెలల్లో 50 ఏర్పాటు చేస్తామని, ఇందులో తెలుగు రాష్ట్రాల్లో 7 వస్తాయని వివరించింది. సంస్థకు దేశవ్యాప్తంగా 51 మంది పంపిణీదార్లు, 3,000 మంది డీలర్లు ఉన్నారు.  ఓపీ జిందాల్‌ గ్రూపునకు చెందిన జేఎస్‌పీఎల్‌ 3.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.27000 కోట్ల) వార్షిక టర్నోవర్‌ నమోదు చేస్తోంది.


ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీకి పెట్టుబడిదారు కావాలి: యెస్‌ బ్యాంక్‌

దిల్లీ: తాము ఏర్పాటు చేయబోయే ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలో (ఏఆర్‌సీ) ప్రధాన పెట్టుబడిదారుగా (లీడ్‌ ఇన్వెస్టర్‌) భాగం కావడానికి ఆసక్తి గల పెట్టుబడిదార్లను యెస్‌ బ్యాంక్‌ ఆహ్వానించింది. ఈ బ్యాంక్‌ తరఫున ప్రక్రియ సలహాదారుగా వ్యవహరిస్తున్న ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) ఆసక్తి వ్యక్తీకరణను (ఈఓఐ) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే పెట్టుబడిదారులు బలమైన ఆర్థిక సామర్థ్యం కలిగి ఉండటంతో సహా ఒత్తిడిలో ఉన్న ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో పూర్వ అనుభవం కలిగి ఉండాలని పేర్కొంది. ఈ నెలాఖరులోపు ఆసక్తి గల పెట్టుబడిదార్లు ఈఓఐ సమర్పించవచ్చని తెలిపింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు), ఎఫ్‌పీఐలు, ప్రైవేట్‌ ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌, ఎన్‌బీఎఫ్‌సీలు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, బ్యాంక్‌లు, ఏఆర్‌సీలు యెస్‌ బ్యాంక్‌ ప్రతిపాదిత ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలో ప్రధాన ప్రాయోజిత (లీడ్‌ స్పాన్సర్‌) వాటాదారుగా చేరే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని