Updated : 26 Jan 2022 09:21 IST

Budget 2022: ఈసారి బడ్జెట్‌ ఓ పెద్ద సవాల్‌.. కారణాలివే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సృష్టించిన ఉత్పాతం నుంచి ఇంకా ఉద్యోగ కల్పన పుంజుకోవాల్సి ఉంది. వేతన పెంపూ ఆశించిన స్థాయికి చేరలేదు. కరోనా కొత్త వేరియంట్లు ఆర్థిక పునరుత్తేజానికి ఇంకా బ్రేకులు వేస్తూనే ఉన్నాయి. మరోవైపు ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ వ్యయాలూ బలంగానే ఉన్నాయి. కానీ, మహమ్మారి వ్యాప్తి ఎప్పుడు ముప్పును తెచ్చిపెడుతుందో ఇప్పటికీ అర్థంకాని పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ 2022-23ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. మరి బడ్జెట్‌కి ముందుకు దేశంలో సామాజిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? పద్దు తయారీలో మంత్రి ఎదుర్కోనున్న సవాళ్లేంటో చూద్దాం..

భారీ ఆర్థిక లోటు తప్పదా?

ఇప్పటికే రెండు బడ్జెట్‌లు కరోనా మహమ్మారి నేపథ్యంలో కనుమరుగైపోయాయి. 2021లో ఊహించని రీతిలో కరోనా రెండో దశ విరుచుకుపడడంతో తొలి అర్ధభాగంలో సంక్షేమ పథకాల కోసం కేంద్రం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది తీవ్ర ఆర్థిక లోటుకు దారితీసింది. ఇక ఈసారి ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. అధిక వ్యయాలు, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం మరోసారి భారీ ఆర్థిక లోటును తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ఆర్థిక లోటు రూ.16.5-17 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 

ఇక ప్రత్యక్ష పన్నుల రాబడి వచ్చే ఏడాది భారీగానే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లకు పైగా నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఎక్సైజ్‌ సుంకం రూపంలో ఇచ్చిన మినహాయింపులు కొంతమేర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అవకాశం ఉంది. అలాగే ఎల్‌ఐసీ ఐపీఓ సహా ఇతర పెట్టుబడుల ఉపసంహరణ వచ్చే ఏడాది ప్రభుత్వానికి ఆదాయపరంగా అండగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

‘వీ’ నుంచి ‘కే’..

భారత వృద్ధి రేటు 2022 ఆర్థిక సంవత్సరంలో 8.3 శాతంగా ఉంటుందని ప్రపంచబ్యాంకు, 9.3 శాతంగా ఉంటుందని మూడీస్‌ అంచనా వేశాయి. ఇక దేశ వార్షిక వృద్ధిరేటు 9.5 శాతం ఉంటుందని ఆర్‌బీఐ లెక్కగట్టింది. అయితే, డిసెంబరు త్రైమాసిక వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించింది. అలాగే మార్చి త్రైమాసిక అంచనాలను సైతం 6.1 నుంచి 6 శాతానికి కుదించింది. సెప్టెంబరు త్రైమాసికంలో 8.4 శాతం వృద్ధి నమోదైంది. వ్యాక్సినేషన్‌ పుంజుకోవడం, సేవారంగ కార్యకలాపాలు సాధారణ స్థాయికి రావడం అందుకు దోహదం చేశాయి. కానీ, ‘వీ’ ఆకారంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజ పయనాన్ని ఒమిక్రాన్‌ ‘కే’ ఆకారానికి మార్చేసింది. ఈ తరుణంలో బడ్జెట్‌ రానుండడం గమనార్హం.

పెరిగిన పేదలు..

కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం వల్ల భారత్‌లో 32 మిలియన్ల మంది మధ్యతరగతి హోదాను కోల్పోయినట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మరో 35 మిలియన్ల మంది పేదలు కడు పేదరికంలోకి జారుకున్నట్లు పేర్కొన్నాయి. దీంతో దేశంలో నిరుపేదల సంఖ్యలో మరో 75 మిలియన్ల మంది కొత్తగా చేరారు. ఫలితంగా గత కొన్నేళ్లలో పేదరిక నిర్మూలనలో భారత్‌ సాధించిన ప్రగతి బూడిదలో పోసిన పన్నీరైంది. మధ్యతరగతి ప్రజల జనాభా సైతం తగ్గడంతో వినిమియంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. స్థూలంగా ఇది దేశ జీడీపీపై తీవ్ర ప్రభావం చూపనుంది.

మళ్లీ సంక్షేమానికే పెద్దపీట తప్పదా?

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పేదవర్గాలకు ఉపశమనం కలిగించేలా సంక్షేమ పథకాలకు కేంద్రం కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు మహమ్మారి ముప్పు ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల బలోపేతం, బూస్టర్‌ డోసు అమలుకు సైతం ప్రభుత్వం భారీ ఎత్తున వెచ్చించాల్సి రావొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఒమిక్రాన్‌ వ్యాప్తితో సేవా రంగ కార్యకలాపాలు మరోసారి దెబ్బతిన్నాయి. దీంతో స్వల్పకాలంలో ఆదాయాలు పడిపోయే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ 3 శాతం ఆర్థిక లోటు లక్ష్యం కష్టతరమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రైతులు.. ఎన్నికలు..

దాదాపు ఏడాది పాటు సాగిన రైతుల ఆందోళనలతో సాగు చట్టాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీంతో ఆ రంగం కోసం కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరమూ లేకపోలేదు. పైగా రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇది మరీ కీలకం కానుంది. ఇప్పటికే పంజాబ్‌, యూపీ రైతులు కేంద్రంపై గుర్రుగా ఉన్నారు. ఎన్నికల దృష్ట్యా వీరిని సంతృప్తి పరిచేందుకు కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పీఎం-కిసాన్‌ ప్రయోజనాల్ని మరింత పెంచే సంకేతాలూ వెలువడుతున్నాయి. అలాగే ఎన్నికల దృష్ట్యా ఆనవాయితీగా బడ్జెట్‌లో ఆయా రాష్ట్రాలకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది!

అంతా అస్థిరత..

ఈ పరిస్థితుల్లో అప్పులను పరిమితం చేస్తూ ప్రభుత్వం వ్యయాన్ని ముందుకు తీసుకెళ్లడం ఈసారి సర్కార్‌కు సవాల్‌గా పరిణమించే అవకాశం ఉంది. అయితే, ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణ ప్రభుత్వం ముందున్న కీలక పరిష్కారాలు. అయితే, గత ఏడాది సైతం వీటి విషయంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయింది. కానీ, ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకపోతే ప్రభుత్వానికి ఆదాయం విషయంలో కొంత ఊరట లభించినట్లే. మరోవైపు మహమ్మారి అదుపులోకి వచ్చి.. ఇతర కొత్త వేరియంట్లేవీ ముప్పును తలపెట్టకపోతే ప్రత్యక్ష పన్నులు మరింత పుంజుకుంటాయి. అలాగే ఆర్థిక కార్యకలాపాలు గాడిన పడి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. లేదంటే మరో బడ్జెట్‌ను కొవిడ్‌కు సమర్పించాల్సిన దుస్థితి తలెత్తొచ్చు! ఏదేమైనా తీవ్ర అస్థిర పరిస్థితుల మధ్య తాజా బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనుండడం గమనార్హం.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్