NRI: భార‌త్‌లో ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకోవాలా?

కుటుంబాన్ని భార‌త్‌లోనే వ‌దిలేసి.. ఒక్క‌రే విదేశాల‌కు వెళ్లే వారు ఫ్యామిలీ ప్లోట‌ర్ పాల‌సీని కొనుగోలు చేయ‌డం మంచిది.

Updated : 12 Jun 2021 09:49 IST

శివ ఇటీవ‌లే ఉద్యోగ రీత్యా దుబాయ్ వెళ్లి అక్క‌డే నివ‌సిస్తున్నాడు. తిరిగి వ‌చ్చేందుకు ప్ర‌ణాళిక చేసుకోలేదు గానీ, త్వ‌రలోనే తిరిగి వ‌చ్చే ఆలోచ‌న‌లో ఉన్నాడు. అత‌నికి ఇప్పుడు 27 సంవ‌త్స‌రాలు. ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాల‌నుకుంటున్నాడు. అయితే భార‌త‌దేశంలో కొనుగోలు చేయాలా? యూఏఈలో కొనుగోలు చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాడు. శివ మాదిరిగానే.. ఉద్యోగ రీత్యా ఇత‌ర దేశాల‌కు వెళ్లిన ప్రవాసులు కూడా ఇదే అయోమ‌యంలో ఉంటున్నారు. మ‌రి ఎన్ఆర్‌ఐలు ఆరోగ్య బీమా కొనుగోలు చేస్తే ప్ర‌యోజ‌న‌క‌ర‌మేనా?  ఏలాంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాలి?

ఒక ఎన్‌ఆర్‌ఐ భార‌త‌దేశంలో ఆరోగ్య బీమాను కొనుగోలు చేసేముందు అనేక అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాల్సి ఉంటుంది.  చాలా వ‌ర‌కూ భార‌తీయ ఆరోగ్య బీమా సంస్థ‌లు.. భార‌త దేశంలో నివ‌సిస్తూ.. ఏదైనా కార‌ణం చేత ఆసుప‌త్రిలో చేరిన‌ పాల‌సీదారుల‌కు మాత్ర‌మే.. ఆ ఖ‌ర్చుల‌ను తిరిగి చెల్లిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు, మీరు దుబాయ్‌లో ఉంటూ ఆసుప‌త్రిలో చేరితే, భార‌త బీమా సంస్థ‌లు ఈ ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్‌చేయ‌వు. 

కొన్ని సంస్థ‌లు, గ్లోబ‌ల్‌ క‌వరేజ్ పాల‌సీల‌ను అందిస్తాయి. అయితే అన్ని అంత‌ర్జాతీయ క‌వ‌రేజ్‌లు ఒకే విధంగా ఉండ‌వు. ఉదాహ‌ర‌ణ‌కి, కొన్ని గ్లోబ‌ల్ హెల్త్ పాల‌సీలు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌ను క‌వ‌ర్ చేస్తే,  మ‌రికొన్ని పాల‌సీలు ఒక‌ ప్ర‌ణాళిక ప్ర‌కారం ఆసుప‌త్రిలో చేరిన‌ప్పుడు మాత్ర‌మే క‌వ‌ర్‌చేస్తాయి. అంతేకాకుండా, క‌వ‌రేజ్ కోసం భార‌తీయ నివాసి అయిన వైద్యుని అనుమ‌తి కూడా తీసుకోవాలి. ఇత‌ర ప‌రిమితులు, మిన‌హాయింపులు ఉండే అవ‌కాశం ఉంది. గ్లోబ‌ల్ క‌వ‌ర్ల‌తో వ‌చ్చే ఆరోగ్య బీమా పాల‌సీలు ఖ‌రీదైనవి కూడా. 

ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్ట్‌/  కాల్‌-ఫ‌ర్‌-యాక్సన్ దేశాల ఎన్ఆర్ఐల‌కు ఈ పాల‌సీల, క‌వ‌రేజ్‌లు వ‌ర్తించ‌వు. ఎఫ్ఏటీఏ అంటే ఫైనాన్సియ‌ల్ యాక్ష‌న్ టాస్క్ ఫోర్స్..మ‌నీ లాండ‌రింగ్‌, టెర్ర‌ర్ ఫైనాన్సింగ్‌ను ఎదుర్కునేందుకు స‌మూహంగా క‌లిసి ప‌నిచేసే దేశాలు. 

పాలసీబజార్.కామ్,  ఆరోగ్య బీమా అధికారి అమిత్ ఛబ్రా మాట్లాడుతూ “ భార‌త‌దేశం బ‌య‌ట పాల‌సీల‌ను క్లెయిమ్ చేసే వారు త‌ప్ప‌నిస‌రిగా భార‌తీయులై ఉండాలి. క్యాలెండ‌ర్ సంవ‌త్స‌రంలో ఆరుమాస‌ముల క‌న్నా ఎక్కువ స‌మ‌యం విదేశాల‌లో ఉండ‌కూడ‌దు. ఈ నిబంధ‌న చాలా బీమా సంస్థ‌ల‌లో ఉంటుంది. 

ఒక‌వేళ ఒక్క‌రే విదేశాల‌కు వెళుతూ త‌ల్లిదండ్రులు/  భార్య పిల్ల‌లు భార‌త్‌లోనే నివ‌సిస్తున్న‌ట్ల‌యితే, ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీని కొన‌సాగించ‌వ‌చ్చు. కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌స్తే ఈ పాల‌సీ వైద్య ఖ‌ర్చుల‌ను భ‌ర్తీ చేస్తుంది. 

ప‌న్ను ప్ర‌యోజ‌నాలు..
భార‌త‌దేశంలో ప‌న్ను చెల్లిస్తున్న.. ఎన్‌ఆర్‌ఐ ప‌న్ను చెల్లింపుదారులు(నివాసి అయినా కాక‌పోయినా) ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80డి కింద త‌మ‌కోసం, భార్యా, ఆధారిత పిల్ల‌ల కోసం చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంలో రూ.25 వేల(నివార‌ణ ఆరోగ్య ప‌రీక్ష‌ల కోసం రూ.5000 వేల‌తో క‌లిపి) వ‌ర‌కు మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.  అదేవిధంగా సీనియ‌ర్ సిటిజ‌న్లు(60 ఏళ్లు దాటిన వారైతే) త‌మ‌తో పాటు, భార్య‌, ఆధారిత పిల్ల‌ల కోసం చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.50వేల వ‌ర‌కు క్లెయిమ్ మిన‌హాయింపు పొంద‌చ్చు. 

కొనుగోలు చేయ‌వ‌చ్చా?
ఇందుకు, ఎంత కాలం విదేశాల‌లో ఉంటారు అనేది ముఖ్యం. ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని పాల‌సీని కొనుగోలు చేయాలి. మూడు నుంచి నాలుగు  సంవ‌త్స‌రాలు విదేశాల‌లో నివ‌సించేందుకు ప్ర‌ణాళిక ఉంటే, రెండు దేశాల‌లోనూ ఆరోగ్య బీమా పాల‌సీ కొనుగోలు చేయ‌డం మంచిదే. భార‌తీయ ఆరోగ్య బీమా పాల‌సీ ప్రీమియంను నిలిపివేయ‌కూడ‌దు. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ప్రీమియంను త‌గ్గించుకోవ‌చ్చు అదేవిధంగా క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఈ స‌మ‌యంలో ముందుగా నిర్ధారించిన వ్యాదుల‌కు ఉండే వెయిటింగ్ పిరియ‌డ్ ముగిసి తిరిగేవ‌చ్చే స‌రికి పాల‌సీ వ‌ర్తిస్తుంది. 

విదేశాల‌లో దీర్ఘ‌కాలం ఉండేందుకు ప్ర‌ణాళిక చేసుకున్న వారు, భార‌త‌దేశంలో బీమా తీసుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు. మీరు నివ‌సించే దేశంలో పాల‌సీని కొనుగోలు చేయ‌డం మంచిది. చిన్న‌ చిన్న టూర్స్ కోసం స్వ‌దేశానికి వ‌చ్చే వారు ప్ర‌యాణ బీమాను కొనుగోలు చేయ‌వ‌చ్చు. దీంతో బీమా ప్ర‌యోజ‌నం ఉంటుంది. అలాగే చౌక‌గానూ ల‌భిస్తుంది. 

సాధార‌ణంగా ఆరోగ్య బీమా పాల‌సీలు భౌగోళిక ప‌రిమితుల‌తో వ‌స్తాయి. కాబ‌ట్టి పాల‌సీ కొనుగోలు నిర్ణ‌యం తీసుకునే ముందు నిబంధ‌న‌లు, ష‌ర‌తులు పూర్తిగా అర్ధం చేసుకోవాలి. భార‌త‌దేశానికి తిరిగి వ‌చ్చే మీ భ‌విష్య‌త్తు ప్రణాళిక‌పై చాలా విష‌యాలు ఆధార‌ప‌డి ఉంటాయి. ఆరోగ్య బీమా సంస్థ‌లు మార్గ‌ద‌ర్శ‌కాలతో పాటు, విదేశీ మార‌క నిర్వ‌హ‌ణ‌ చ‌ట్టం(ఫెమా) నిబంధ‌న‌ల విష‌యంలోనూ ఎన్‌ఆర్‌ఐలు జాగ్ర‌త్త వ‌హించాలి.

ఉదాహ‌ర‌ణ‌కు, మీ ఆరోగ్య బీమా పాల‌సీలో యూఏఈ వంటి దేశాల‌లోని ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌ను చేర్చ‌క‌పోవ‌చ్చు. కేన్స‌ర్ వంటి క్లిష్ట‌మైన అనారోగ్యాల‌ను చేర్చ‌వ‌చ్చు. రిస్క్ కోణంలో చూసే విదేశీ క్లెయిమ్‌ల‌ను ధృవీక‌రించ‌డం క‌ష్టం. అందువ‌ల్ల ఎన్‌ఆర్‌ఐలు కొనుగోలు చేసే ఆరోగ్య బీమా పాల‌సీల‌పై బీమా సంస్థ‌లు భౌగోళిక పరిమితులను విధిస్తాయి. 

ఎన్‌ఆర్‌ఐ భార‌త‌దేశంలో ఆరోగ్య బీమా పాల‌సీని కొనుగోలు చేస్తే, అందుకు సంబంధించిన ప్రీమియంల‌ను భార‌త క‌రెన్సీలోనే చెల్లించాలి. క్రెడిట్ కార్డులు, ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ బ్యాంక్ ఖాతా ద్వారా ప్రీమియం చెల్లింపులు చేయ‌వ‌చ్చు. ఇలాంటి క్లెయిమ్‌లు భార‌త క‌రెన్సీలో సెటిల్ చేస్తారు. ఫెమా నిబంధ‌న‌ల ప్ర‌కారం, విదేశీ క‌రెన్సీలోనూ ప్రీమియంలు చెల్లించేందుకు ఎన్‌ఆర్‌ఐల‌ను అనుమ‌తించింది ఆర్‌బీఐ. అలాంటి పాల‌సీల విష‌యంలో భార‌త‌దేశం వెలుప‌ల చేసే క్లెయిమ్ సెటిల్‌మెంట్ల‌ను ఆ దేశ క‌రెన్సీలోనే సెటిల్ చేస్తారు. 

చివ‌రిగా..
మీరు కూడా మీ కుటుంబంతో విదేశాల‌కు వెళ్లి, ఎక్కువ కాలం పాటు అక్క‌డే నివ‌సించేందుకు ప్లాన్ చేసుకుంటే భార‌త‌దేశంలో ఆరోగ్య బీమా కొనుగోలు చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇది అన‌స‌ర‌పు ఖ‌ర్చు అవుతుంది. కానీ, మూడు నుంచి నాలుగు సంవ‌త్స‌రాల స్వ‌ల్ప‌కాలానికి మాత్ర‌మే విదేశాల‌కు వెళితే భార‌త్‌లో ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకోవ‌డం మంచిదే. ప్రీమియంలు  స‌మ‌యానికి చెల్లించాలి. ఇది తిరిగి స్వ‌దేశానికి వ‌చ్చిన‌ప్పుడు అస‌ర‌మైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లెయిమ్ చేసుకునేందుకు స‌హాయ‌ప‌డుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని