అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించట్లేదు

ప్రభుత్వ రంగానికి చెందిన అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించట్లేదని, బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ

Updated : 16 Mar 2021 19:32 IST

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించట్లేదని, బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బ్యాంకు యూనియన్లు రెండు రోజుల పాటు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆర్థిక మంత్రి.. ప్రైవేటీకరణను మరోసారి సమర్థించారు. 

‘‘ప్రభుత్వ రంగ బ్యాంకులు కొనసాగుతాయని పబ్లిక్‌ ఎంటర్‌ప్రైస్‌ పాలసీ స్పష్టంగా చెబుతోంది. అలాంటప్పుడు అన్ని ప్రభుత్వ బ్యాంకులను విక్రయిస్తున్నారని చెప్పడం సరికాదు. అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించట్లేదు. అంతేగాక, ప్రైవేటీకరణ చేసిన సంస్థలు కూడా కొనసాగుతాయి. ఆ సంస్థల్లోని ఉద్యోగుల ప్రయోజనాలను కేంద్రం తప్పకుండా కాపాడుతుంది. అవి వేతనాలనైనా, పింఛన్లయినా వాటిని మేం రక్షిస్తాం’’ అని నిర్మలమ్మ వెల్లడించారు. 

మౌలిక సదుపాయాల కోసమే డీఎఫ్‌ఐ

ఈ సందర్భంగా అభివృద్ధి ఆర్థిక సంస్థ(డీఎఫ్‌ఐ) ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం కోసమే డీఎఫ్‌ఐ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డీఎఫ్‌ఐకి రూ. 20వేల కోట్ల నిధులు సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పిన నిర్మలా సీతారామన్‌.. తొలి విడతలో రూ. 5వేల కోట్లు సమకూర్చనున్నట్లు తెలిపారు. మిగతా మొత్తాన్ని రూ. 5వేల కోట్ల చొప్పున విడతల వారీగా సమకూరుస్తామని చెప్పారు. 

బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ తొమ్మిది బ్యాంకు యూనియన్లు సోమవారం నుంచి రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాయి. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. 

ఇవీ చదవండి.. 

ఎల్‌ఐసీ నుంచి కొత్త పాలసీ

ప్రైవేటీకరణకు దూరంగా 6 పీఎస్‌బీలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని