Ola Electric: ఇక మరిన్ని నగరాల్లో ఓలా టెస్ట్‌ రైడ్స్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడంటే?

ఎస్‌1, ఎస్‌1 ప్రో పేరిట ఎలక్ట్రిక్‌ స్కూటర్లను తీసుకొచ్చిన ఓలా.. టెస్ట్‌ రైడ్స్‌ సదుపాయాన్ని మరిన్ని నగరాలకు, పట్టణాలకు విస్తరించాలని నిర్ణయించింది.

Published : 20 Nov 2021 20:22 IST

దిల్లీ: ఎస్‌1, ఎస్‌1 ప్రో పేరిట ఎలక్ట్రిక్‌ స్కూటర్లను తీసుకొచ్చిన ఓలా.. టెస్ట్‌ రైడ్స్‌ సదుపాయాన్ని మరిన్ని నగరాలకు, పట్టణాలకు విస్తరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం బెంగళూరు, దిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా నగరాలకే మాత్రమే పరిమితమైన ఈ సదుపాయం రాబోయే రోజుల్లో వెయ్యి నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్లు ఆ సంస్థ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్‌ 19 నుంచి చెన్నై, హైదరాబాద్‌, కోచి, ముంబయి, పుణె నగరాల్లో ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపింది.

నవంబర్‌ 27 నాటికి తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడతో పాటు సూరత్‌, తిరువనంతపురం, కోళికోడ్‌, కోయంబత్తూర్‌, వడోదర, భువనేశ్వర్‌, తిరుప్పూర్‌, జైపూర్‌, నాగ్‌పూర్‌లోనూ టెస్ట్‌ రైడ్‌ సదుపాయం తీసుకురానున్నట్లు ఓలా తెలిపింది. డిసెంబర్‌ 15 నాటికి మరిన్ని ప్రాంతాల్లో టెస్ట్‌ రైడ్‌ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే వేలాది మంది వినియోగదారులు ఓలా టెస్ట్‌ రైడ్స్‌ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని, స్కూటర్‌ పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తంచేశారని ఓలా ఎలక్ట్రిక్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ అరున్‌ శిర్దేష్‌ముఖ్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రోను విడుదల చేయగా.. సెప్టెంబర్‌ నుంచి వీటి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. నవంబర్‌ 10 నుంచి నాలుగు నగరాల్లో టెస్ట్‌ రైడ్‌ సదుపాయం ప్రారంభమైంది. ఎవరైతే ఎలక్ట్రిక్‌ స్కూటర్లను కొనుగోలు లేదా రిజర్వ్‌ చేసుకున్నారో వారికి టెస్ట్‌ రైడ్‌ చేసే సదుపాయాన్ని ఓలా కల్పిస్తోంది.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని