జెట్‌ఎయిర్‌వేస్‌ సిబ్బందికి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు

జెట్‌ఎయిర్‌వేస్‌ ఉద్యోగులు, కార్మికులకు ఈ సంస్థను కొనుగోలు చేస్తున్న జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియం పలు ప్రతిపాదనలు చేసింది. ఎన్‌సీఎల్‌టీ ఆమోదించిన ...

Published : 07 Jul 2021 01:04 IST

నగదు ప్రోత్సాహకాలూ
జలాన్‌ కల్రాక్‌ ప్రతిపాదనలు

దిల్లీ: జెట్‌ఎయిర్‌వేస్‌ ఉద్యోగులు, కార్మికులకు ఈ సంస్థను కొనుగోలు చేస్తున్న జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియం పలు ప్రతిపాదనలు చేసింది. ఎన్‌సీఎల్‌టీ ఆమోదించిన పరిష్కార ప్రణాళిక కింద ఫోన్‌ లేదా ఐప్యాడ్‌ లేదా లాప్‌టాప్‌తో పాటు నగదు చెల్లింపులు చేస్తామని అంటోంది. ఈ ప్రోత్సాహకాలు అందుకోడానికి జలాన్‌ కల్రాక్‌ ప్రతిపాదనను కనీసం 95 శాతం మంది సిబ్బంది ఆమోద ముద్ర వేయాలి. కన్సార్షియం ప్రతిపాదన జులై 5నే ప్రారంభమైంది. ఆగస్టు 4 వరకు ఇది కొనసాగుతుంది.
జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేయడానికి కొన్ని షరతులకు లోబడి కన్సార్షియం పరిష్కార ప్రణాళికకు నేషనల్‌ కంపెనీ లా టైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) జూన్‌ 22న ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ప్రణాళికలో భాగంగా జూన్‌ 20 నాటికి జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగులు, సిబ్బందిగా ఉన్న వ్యక్తులకు కొంత మొత్తం, ఇతరత్రా ప్రయోజనాలను కన్సార్షియం ఆఫర్‌ చేస్తోంది. ఏప్రిల్‌ 17, 2019న జెట్‌ కార్యకలాపాలు నిలిచిపోగా.. జూన్‌ 20, 2019న దివాలా ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ప్రతి కార్మికుడికి జెట్‌ 1.0లోని ఐటీ ఆస్తుల్లో ఒక ఐటీ సామగ్రి(ఫోన్‌/ఐప్యాడ్‌/ల్యాప్‌టాప్‌) ఇస్తారు. వీటిని లాటరీ/చిట్‌/ఇతరత్రా పద్ధతుల ద్వారా పారదర్శకంగా పంపిణీ చేస్తారు. పంపిణీ తర్వాత కూడా ఏవైనా ఐటీ ఆస్తులు మిగిలితే అపుడు ప్రతి ఉద్యోగికి ఒకటి చొప్పున అందజేస్తారు. తక్కువ జీతం ఉన్న వ్యక్తితో మొదలుపెట్టి ఎక్కువ జీతం ఉద్యోగి వరకు ఈ పంపిణీ చేపడతారు. ప్రతి ఉద్యోగికి రూ.11,000 నగదు; ప్రతి కార్మికుడికి రూ.22,800 (ఇందులో రూ.11,000 నగదు, రూ.5100 మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌, రూ.5100 స్కూలు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, రూ.1100 స్టేషనీ, రూ.500 ఫోన్‌ రీఛార్జి) చొప్పున కూడా అందజేస్తారు.


మహిళల ఆధ్వర్యంలో 2 పంపిణీ కేంద్రాలు

అమెజాన్‌ ఇండియా

తిరువనంతపురం: పూర్తిగా మహిళలే నిర్వహించే రెండు పంపిణీ కేంద్రాలను (డెలివరీ సెంటర్‌) అమెజాన్‌ ఇండియా కేరళలో  ప్రారంభించింది. అరన్‌ములా (పథనమ్‌థిట్టా జిల్లా), కొడున్‌గల్లూర్‌ (త్రిస్సూర్‌ జిల్లా) పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేసింది. ఇప్పటికే అమెజాన్‌కు చెన్నై, గుజరాత్‌లలో ఈ తరహా కేంద్రాలున్నాయి. కేరళలోని కేంద్రాలను డెలివరీ సర్వీస్‌ పార్ట్‌నర్స్‌ (డీఎస్‌పీఎస్‌) నిర్వహించనున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో 50 మందికి పైగా మహిళలకు ఈ కేంద్రాలు ఉద్యోగావకాశాలు కల్పించాయి. అమెజాన్‌ వినియోగదారులకు ఉత్పత్తులను పంపిణీ చేసేందుకు చిన్న, మధ్య తరహా సంస్థల భాగస్వామ్యంతో డీఎస్‌పీ విధానాన్ని అమెజాన్‌ ఇండియా రూపొందించింది.  మేనేజర్‌ నుంచి పంపిణీ సహాయకుల వరకు అన్ని రకాల ఉద్యోగాలను పూర్తిగా ఈ కేంద్రాల్లో మహిళలే నిర్వహిస్తారని అమెజాన్‌ ఇండియా వెల్లడించింది. వీళ్లందరికీ వినియోగదారుల సేవలు, హ్యాండ్లింగ్‌ ప్యాకేజీలు, సాంకేతికత, భద్రత వంటి అంశాల్లో శిక్షణ అందిస్తున్నామని తెలిపింది. పని ప్రదేశాల్లో మహిళల భద్రతకు పలు చర్యలను చేపట్టామని, రోజులో ఎప్పుడైనా అత్యవసర సహకారం కోసం సంప్రదించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబరును  అందుబాటులో ఉంచామని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని