RateGain IPO: డిసెంబరు 7న రేట్‌గెయిన్‌ ఐపీఓ

ప్రయాణ, ఆతిథ్య రంగంలోని పరిశ్రమలకు సాఫ్ట్‌వేర్‌ సేవలు అందించే ప్రముఖ సంస్థ రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ టెక్నాలజీస్‌ మూడు రోజుల ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ డిసెంబరు 7న ప్రారంభం కానుంది....

Published : 01 Dec 2021 12:46 IST

దిల్లీ: ప్రయాణ, ఆతిథ్య రంగంలోని పరిశ్రమలకు సాఫ్ట్‌వేర్‌ సేవలు అందించే ప్రముఖ సంస్థ రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ టెక్నాలజీస్‌ మూడు రోజుల ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ డిసెంబరు 7న ప్రారంభం కానుంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల బిడ్డింగ్‌లు ఈ నెల 6న మొదలవనున్నాయి. మొత్తం రూ.375 కోట్లు విలువ చేసే తాజా షేర్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 2.26 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. మొత్తం 5 కోట్ల షేర్లను రూ.40 రాయితీతో ఉద్యోగుల కోసం రిజర్వు చేయనున్నారు. ధరల శ్రేణిని రూ.405-425గా నిర్ణయించారు.

గరిష్ఠ ధర వద్ద రూ.1,335.73 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిధులను రుణ చెల్లింపులతో పాటు వ్యూహాత్మక పెట్టుబడులు, కొనుగోళ్లకు వినియోగించనున్నారు. అలాగే ఇన్నోవేషన్‌, కృత్రిమ మేధ వంటి రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టనున్నారు. మొత్తం షేర్లలో 75 శాతం క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ బయ్యర్ల(క్యూఐబీ)కు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు, 10 శాతం రిటైల్‌ మదుపర్లకు కేటాయించనున్నారు. మదుపర్లు కనీసం 35 ఈక్విటీ షేర్లను ఆర్డర్‌ చేయాల్సి ఉంటుంది. 

ప్రపంచంలో అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్‌ టెక్నాలజీ కంపెనీల్లో రేట్‌గెయిన్‌ ఒకటి. భారత్‌లో ఆతిథ్య, ప్రయాణ రంగాలకు సేలందిస్తున్న అతిపెద్ద ‘సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌’ కంపెనీ కూడా ఇదే. హోటళ్లు, విమానయాన సంస్థలు, ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ఏజెంట్లు, మెటా సెర్చ్‌ కంపెనీలు, వెకేషన్‌ రెంటర్స్‌, ప్యాకేజ్‌ ప్రొవైడర్లు, కార్‌ రెంటల్స్‌, రైల్‌-ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, క్రూయిజ్‌లు, ఫెర్రీల వంటి వివిధ రంగాలకు ఈ కంపెనీ సేవలందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని