ఆ వివరాలిస్తే రూ.10 కోట్ల బహుమానం: సెబీ

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలు వెల్లడించే వ్యక్తులకు ప్రస్తుతం ఇస్తున్న బహుమతిని రూ.1 కోటి నుంచి రూ.10 కోట్లకు పెంచినట్లు మార్కెట్ల నియంత్రణ ...

Updated : 30 Jun 2021 09:58 IST

స్వతంత్ర డైరెక్టర్ల నిబంధనల సవరణకు బోర్డు ఆమోదం

దిల్లీ: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలు వెల్లడించే వ్యక్తులకు ప్రస్తుతం ఇస్తున్న బహుమతిని రూ.1 కోటి నుంచి రూ.10 కోట్లకు పెంచినట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. స్వతంత్ర డైరెక్టర్లకు సంబంధించిన నిబంధనలకు సవరణలతో సహా గుర్తింపు పొందిన (అక్రెడిటెడ్‌) మదుపర్లకు కొత్త నిబంధనావళిని పరిచయం చేసే చర్యలకూ ఆమోదం తెలిపింది. రెసిడెంట్‌ ఇండియన్‌ ఫండ్‌ మేనేజర్లు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లలో భాగంగా ఉండేందుకు అంగీకరించింది. మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను నిర్వహిస్తున్న అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (ఏఎమ్‌సీలు) అటువంటి పథకాలతో ఉండే రిస్కుకు అనుగుణంగా కనీస మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టే విషయంలో నిబంధనల్ని సవరించింది. కొత్త ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ద్వారా సమీకరించే మొత్తంలో 1 శాతం లేదా రూ.50 లక్షలు ఏది తక్కువైతే దాన్ని పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఆర్థిక పారామితుల ఆధారంగా వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, కుటుంబ ట్రస్టులు, ఏక యాజమాన్య సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, ట్రస్టులు, బాడీ కార్పొరేట్‌లు గుర్తింపు పొందిన మదుపర్లుగా ఉంటారని సెబీ తెలిపింది. ఇన్విట్‌లు, రీట్‌లను నియంత్రించే నిబంధనలకు సవరణలనూ ఆమోదించినట్లు తెలిపింది. పబ్లిక్‌/రైట్స్‌ ఇష్యూల్లో పాల్గొనే మదుపర్లు సులభంగా వివిధ చెల్లింపు మార్గాలను ఎంచుకునేలా బ్యాంకులకు సెబీ అనుమతి ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని