DCI Indonesia: అమ్మ బాబోయ్‌.. ఇంత లాభమా?

ఒక కంపెనీ షేర్లలో పెట్టుబడి పెడితే.. 100 శాతం వరకు లాభాలు రావొచ్చు. కంపెనీ బాగా రాణిస్తే 1000 శాతం కూడా రాబడి ఉండొచ్చు. కొన్ని కంపెనీలైతే.....

Updated : 26 Nov 2021 12:51 IST

ఏడాదిలో 10,000% రాబడినిచ్చిన ఇండోనేషియా కంపెనీ

జకార్తా: ఒక కంపెనీ షేర్లలో పెట్టుబడి పెడితే.. 100 శాతం వరకు లాభాలు రావొచ్చు. కంపెనీ బాగా రాణిస్తే 1000 శాతం కూడా రాబడి ఉండొచ్చు. కొన్ని కంపెనీలైతే.. 2000 శాతం వరకు లాభాలిచ్చిన సందర్భాలున్నాయి. మరి 10,000 శాతం లాభాలిచ్చి మదుపర్లపై సిరుల వర్షం కురిపించిన కంపెనీల గురించి ఎప్పుడైనా విన్నారా? వివరాల్లోకి వెళితే...

ఇండోనేషియాకు చెందిన ‘పీటీ డీసీఐ ఇండోనేషియా’ అనే డేటా సెంటర్‌ కంపెనీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 10,852 శాతం రాబడి ఇచ్చింది. గత జనవరి 6న ఈ సంస్థ పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. మొత్తం 357 మిలియన్‌ షేర్లను ఐపీఓలో ఉంచారు. ఒక్కో షేరు ధరను 420 ఇండోనేషియా రూపయ్యలు(ఐడీఆర్‌)గా నిర్ణయించారు. స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన నాటి నుంచి నేటి వరకు కంపెనీ షేరు విలువ 10,852 శాతం పెరిగింది. ఇండోనేషియా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో  ఒకటైన జకార్తా కాంపోజిట్‌ ఇండెక్స్‌ ఈ ఏడాది 12 శాతం ఎగబాకింది. దీంట్లో డీసీఐదే ప్రధాన పాత్ర కావడం విశేషం. ప్రస్తుతం ఈ స్టాక్‌ ధర 46,000 ఇండోనేషియా రూపయ్యలుగా ఉంది. ఓ దశలో ఇది 60,300 ఐడీఆర్‌ను కూడా తాకింది. భారత కరెన్సీలో చెప్పాలంటే.. రూ.10 వేలు పెట్టుబడి పెట్టిన వారి సంపద ఏడాదిలో రూ.10 లక్షలకు పెరిగిందన్నమాట! దీంతో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఐపీఓకి వచ్చిన కంపెనీల్లో అత్యధిక రిటర్న్స్‌ ఇచ్చిన సంస్థగా ఇది నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం తర్వాత టెక్‌ ఆధారిత కంపెనీలు భారీగా లాభపడ్డాయి. డిజిటల్‌ ఏకానమీ పుంజుకోవడం కూడా దీనికి దోహదం చేశాయి. ఈ క్రమంలో ఇండోనేషియా టెక్నాలజీ కంపెనీలు సైతం భారీ లాభాల్ని ఆర్జించాయి. ముఖ్యంగా ఈ-కామర్స్‌, డిజిటల్‌ లావాదేవీలు భారీగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో డీసీఐ భారీగా లాభపడ్డట్లు అక్కడి ఆర్థిక నిపుణులు తెలిపారు. డీసీఐలో ఇండోనేషియాకు చెందిన సంపన్నుడు ఆంటోని సలీమ్‌కు 11 శాతం వాటాలున్నాయి. ఈయన వ్యాపార సామ్రాజ్యం ఆహారం నుంచి రియల్‌ఎస్టేట్‌ వరకు అనేక రంగాల్లోకి విస్తరించి ఉంది.

పదే పదే ఈ కంపెనీ షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకడంతో అనేక సార్లు ట్రేడింగ్‌ నిలిపివేశారు. ఇది తరచూ జరిగింది. దీంతో అక్కడి నియంత్రణా సంస్థలు కంపెనీపై దర్యాప్తు ప్రారంభించాయి. స్టాక్‌ ధరను పెంచడం కోసం ఏమైనా అవకతవకలకు పాల్పడుతున్నారేమోనని విచారించాయి. కానీ, అలాంటిదేమీ లేదని తేలడం విశేషం.

భారీ లాభాలు ఆర్జించాలన్న ఆశతోనే మదుపర్లు ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీఓ)ల్లో పెట్టుబడి పెడుతుంటారు. కొన్ని కంపెనీలు అనుకున్నట్లు రాణించి మంచి రాబడి ఇస్తాయి. మరికొన్ని అంచనాలు తప్పి భారీ నష్టాల్ని మిగులుస్తాయి. ఇటీవల భారత్‌లో ఈ రెండు సందర్భాల్నీ చూశాం. డీసీఐ వలే సిరుల వర్షం కురిపించే కంపెనీలు చాలా అరుదుగా ఉంటాయి. వాటిని గుర్తించడమే అసలైన పని.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని