TATA Group: కర్ణాటకలో టాటా గ్రూప్‌ రూ.2,300 కోట్ల పెట్టుబడులు

TATA Group: ఎయిరిండియా, ‘టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (TASL)’ కలిసి కర్ణాటకలో రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.

Published : 19 Feb 2024 15:24 IST

బెంగళూరు: టాటా గ్రూప్‌ (TATA Group) కంపెనీలైన ఎయిరిండియా, ‘టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (TASL)’ కర్ణాటకలో రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. దీనివల్ల దాదాపు 1,650 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.  ఈమేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి.పాటిల్‌ సమక్షంలో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరింది.

‘మెయింటెనెన్స్‌ రిపేర్‌ అండ్‌ ఓవర్‌హాల్‌ (MRO)’ ఫెసిలిటీని ఏర్పాటుచేసి దక్షిణ భారత్‌లో బెంగళూరును ఏవియేషన్ కేంద్రంగా మార్చనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. దీనికోసం రూ.1,300 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ప్రత్యక్షంగా 1,200 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. హబ్ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి దొరుకుతుందని ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లయిడ్‌ ఎకానమిక్‌ రీసెర్చ్‌’ అధ్యయనం తెలిపింది. దీనివల్ల వ్యాపార కార్యలాపాలు పుంజుకోవటంతో పాటు పర్యటకం సైతం అభివృద్ధి చెందుతుందని పేర్కొంది.

టీఏఎస్‌ఎల్‌ రూ.1,030 కోట్లతో మూడు ప్రాజెక్టులు చేపట్టనుంది. ప్యాసింజర్‌ టు ఫ్రెయిటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కన్వర్షన్‌ ఫెసిలిటీ (రూ.420 కోట్లు), గన్ తయారీకేంద్రం (రూ.310 కోట్లు), ఏరోస్పేస్‌- డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (రూ.300 కోట్లు) కేంద్రం ఏర్పాటుచేయనున్నట్లు తెలిపింది. 450 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని వెల్లడించింది. గన్‌ తయారీ కేంద్రానికి కావాల్సిన 13,000 భాగాల్లో 50 శాతానికి పైగా కర్ణాటక నుంచే సమకూర్చుకోనున్నట్లు తెలిపింది. తద్వారా 300-350 చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో మరో 2,000-3,000 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని