Go first: గోఫస్ట్‌ కొనుగోలుకు స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌సింగ్‌ బిడ్‌

Go first: గోఫస్ట్‌ విమానయాన సంస్థ కొనుగోలుకు స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌సింగ్‌ ముందుకొచ్చారు. బిజీబీ ఎయిర్‌వేస్‌తో కలిసి బిడ్‌ దాఖలు చేశారు.

Published : 16 Feb 2024 20:03 IST

Go first | దిల్లీ: దివాలా తీసిన గోఫస్ట్‌ విమాయాన సంస్థ (Go first) కొనుగోలుకు స్పైస్‌జెట్‌ (Spicejet) చీఫ్‌ అజయ్‌సింగ్‌ ముందుకొచ్చారు. బిజీ బీ ఎయిర్‌వేస్‌తో కలిసి బిడ్‌ దాఖలు చేశారు. దీనిపై స్పైస్‌జెట్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బిజీ బీ ఎయిర్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి అజయ్‌సింగ్‌ తన వ్యక్తిగత సామర్థ్యంతో ఈ బిడ్‌ను దాఖలు చేసినట్లు తెలిపింది.

కొత్త ఎయిర్‌లైన్‌కు ఆపరేటింగ్‌ పార్ట్‌నర్‌గా స్పైస్‌జెట్‌ వ్యవహరిస్తుందని ఆ కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. అవసరమైన సిబ్బంది, సేవలు, పరిశ్రమ నిపుణులను అందిస్తుందని పేర్కొంది. దీనివల్ల రెండు విమాయాన సంస్థల మధ్య సమష్టితత్వం ఏర్పడుతుందని ఆ కంపెనీ అభిప్రాయపడింది. దీనివల్ల వ్యయనిర్వహణ మెరుగవుతుందని, తద్వారా విమాయానరంగంలో ఇరు కంపెనీల స్థానాన్ని పదిలం చేసుకోవడానికి వీలు పడుతుందని ఆ కంపెనీ పేర్కొంది.

స్పైస్‌జెట్‌కు ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న అజయ్‌ సింగ్‌ దీనిపై మాట్లాడుతూ.. గోఫస్ట్‌కు అసమాన సామర్థ్యం ఉందని, స్పైస్‌జెట్‌తో జట్టుకట్టడం వల్ల రెండు సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. గోఫస్ట్‌ ఒక నమ్మకమైన బ్రాండ్‌ అని, అలాంటి ఒక పాపులర్‌ విమానయాన సంస్థను పునరుద్ధరించడంలో భాగమవుతున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కొనుగోలులో బిజీ బీ ఎయిర్‌వేస్‌ పాత్రేంటన్నది తెలియరాలేదు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా గోఫస్ట్‌ విమానాలు గతేడాది మే నుంచి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరిణామం నేపథ్యంలో స్పైస్‌జెట్‌ షేరు శుక్రవారం 11 శాతం మేర లాభంతో రూ.70.6 వద్ద ముగిసింది. అజయ్‌సింగ్‌తో పాటు షార్జాకు చెందిన స్కైవన్‌, ఆఫ్రికాకు చెందిన సాఫ్రిక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సంస్థలు గోఫస్ట్‌ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. మరోవైపు స్పైస్‌జెట్‌ తన ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల 15 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించింది. వ్యయనియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని