Akasa Air: ఆకాశ ఎయిర్‌కు కీలక లైసెన్స్‌.. ఈ నెలలోనే సేవలు

Akasa Air gets airline license from DGCA: బిగ్‌బుల్‌గా పేరొందిన ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా (Rakesh Jhunjhunwala) మరికొందరితో కలిసి నెలకొల్పిన ఆకాశ ఎయిర్‌కు (Akasa Air) కీలక అనుమతులు లభించాయి.

Published : 07 Jul 2022 19:27 IST

దిల్లీ: బిగ్‌బుల్‌గా పేరొందిన ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా (Rakesh Jhunjhunwala) మరికొందరితో కలిసి నెలకొల్పిన ఆకాశ ఎయిర్‌కు (Akasa Air) కీలక అనుమతులు లభించాయి. కమర్షియల్‌ విమానాలు నడిపేందుకు కావాల్సిన లైసెన్సులను ఆ కంపెనీ పొందింది. ఈ విషయాన్ని ఆకాశ ఎయిరే స్వయంగా గురువారం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ నుంచి ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికెట్‌ (ఏఓసీ) పొందినట్లు ఆకాశ ఎయిర్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదో కీలక మైలురాయిగా అభివర్ణించిన ఆ సంస్థ.. త్వరలోనే కమర్షియల్‌ ఆపరేషన్స్‌ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ నెలాఖరులో తొలుత రెండు విమానాలతో సేవలు ప్రారంభిస్తామని పేర్కొంది. దశలవారీగా ఈ సంఖ్యను పెంచుకుంటూ వెళ్లనున్నట్లు తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 18 విమానాలతో సేవలు అందించనున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత కూడా ఏటా విమానాల సంఖ్యను పెంచుకుంటూ వెళతామని కంపెనీ తెలిపింది. 

ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్‌ పేరిట విమాన సేవలు నిర్వహించనున్న ఆకాశ ఎయిర్‌ సంస్థ.. గతేడాది నవంబర్‌లో 72 బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల కోసం ఆర్డర్‌ చేసింది. రాబోయే ఐదేళ్లలో ఈ విమానాలు బోయింగ్‌ నుంచి కంపెనీకి అందనున్నాయి. మరోవైపు కమర్షియల్‌ సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్న ఆ సంస్థ.. సిబ్బందిని పెద్ద ఎత్తున రిక్రూట్‌ చేసుకుంటోంది. తాజాగా సిబ్బందికి సంబంధించిన యూనిఫామ్‌ను కూడా పరిచయం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని