Archean Chemical IPO: ఈ నెల 9న ఆర్కియన్‌ కెమికల్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓ

Archean Chemical IPO: ఈ నెల 9-11 మధ్య ఆర్కియన్ కెమికల్‌ ఐపీఓ జరగనుంది. ఈ కంపెనీ బ్రొమైన్‌, ఇండస్ట్రియల్‌ సాల్ట్‌, సల్ఫేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వంటి రసాయనాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు సరఫరా చేస్తోంది.

Published : 03 Nov 2022 15:32 IST

దిల్లీ: సముద్రయాన రంగంలో ఉపయోగించే ప్రత్యేక రసాయనాలు తయారు చేసే ఆర్కియన్‌ కెమికల్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓ నవంబరు 9న ప్రారంభమవనుంది. రూ.1,462 కోట్ల సమీకరణ లక్ష్యంతో వస్తున్న ఈ పబ్లిక్‌ ఇష్యూ నవంబరు 11న ముగుస్తుంది. ధరల శ్రేణిని రూ.386-407గా నిర్ణయించారు. రూ.805 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 1.61 కోట్ల ఈక్విటీ షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉండనున్నాయి. ప్రమోటర్లు కెమికాస్‌ స్పెషాలిటీ 20 లక్షల షేర్లు, పిరమల్‌ నేచురల్ రీసోర్సెస్‌ అండ్ ఇండియా రిసర్జెన్స్‌ ఫండ్‌ 38.85 లక్షలు, ఇండియా రిసర్జెన్స్‌ ఫండ్‌-II 64.78 లక్షల షేర్లను విక్రయిస్తున్నాయి. ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, జేఎం ఫైనాన్షియల్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

75 శాతం షేర్లను అర్హతగల సంస్థాగత మదుపర్లకు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు, 10 శాతం రిటైల్‌ మదుపర్లకు షేర్లను రిజర్వు చేశారు. కనీసం 36 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐపీఓలో సమీకరించిన నిధుల్ని గతంలో జారీ చేసిన నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ రిడెమ్షన్‌కు ఉపయోగించనున్నారు. ఈ కంపెనీ బ్రొమైన్‌, ఇండస్ట్రియల్‌ సాల్ట్‌, సల్ఫేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వంటి రసాయనాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు సరఫరా చేస్తోంది. రాన్‌ ఆఫ్‌ కచ్‌లో ఉన్న బ్రైన్‌ రిజర్వుల నుంచి వీటిని తయారు చేస్తోంది. గుజరాత్‌లోని హాజీపూర్‌లో దీని తయారీ కేంద్రం ఉంది.

ఆర్కియన్‌ సరఫరా చేస్తున్న బ్రొమైన్‌ను ఔషధ, అగ్రోకెమికల్స్‌, నీటి శుద్ధి, అగ్నిమాపక, నిల్వ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ స్టోరేజీలో వినియోగిస్తున్నారు. ఇండస్ట్రియల్‌ సాల్ట్‌ను పలు రకాల ఇతర రసాయనాలు, సమ్మేళనాల తయారీలో ఉపయోగిస్తున్నారు. సల్ఫేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను ఎరువులు, వైద్య రంగంలో వాడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని