40 ఏళ్ల‌కే.. రూ.50 లక్ష‌ల‌తో..

40 ఏళ్ల‌కే రిస్క్ లేకుండా అధిక మొత్తంలో న‌గ‌దు కూడ‌బెట్టాలంటే ఏం చేయాలి?​​​​​​

Published : 19 Dec 2020 11:27 IST

40 ఏళ్ల‌కే రిస్క్ లేకుండా అధిక మొత్తంలో న‌గ‌దు కూడ‌బెట్టాలంటే ఏం చేయాలి?​​​​​​​

ప్ర‌తీ ఒక్క‌రూ ఈ గ‌జి’బిజీ’ జీవితాల నుంచి కాస్త విరామం తీసుకొని హాయిగా జీవించాల‌ని కోరుకుంటారు. మ‌రి 40 ఏళ్ల‌కే అధిక మొత్తంలో జ‌మ చేసుకుంటే ఆ త‌ర్వాత విలాస‌వంత‌మైన జీవ‌నం గ‌డ‌ప‌డం సాధ్య‌మ‌వుతుందా? అంటే అవుతుంద‌నే అంటున్నారు ఆర్థిక నిపుణులు. మ‌రి ఇది సాధించాలంటే స‌రైన పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక అవ‌స‌రం. రిస్క్ లేకుండా రాబ‌డులు వ‌చ్చే విధంగా ఉండే ఒక ప్ర‌ణాళిక‌ను సూచిస్తున్నారు. ఆర్థిక ప్ర‌ణాళికాదారులు మీ పెట్టుబ‌డుల పోర్ట్ఫోలియో విభిన్నంగా ఉండాల‌ని సూచిస్తారు. మ్యూచువ‌ల్ ఫండ్లు, స్టాకుల్లో పెట్టుబ‌డులను సూచిస్తారు. అది కొంత రిస్క్‌తో కూడుకొని ఉంటుంది. అయితే అంద‌రూ రిస్క్ తీసుకునేందుకు మొగ్గుచూప‌క‌పోవ‌చ్చు. మ‌రి రిస్క్ లేకుండా 40 ఏళ్ల‌కే రూ.50 ల‌క్ష‌లు సంపాదించే విధంగా ఉండాలంటే ఏం చేయాలి? 25 ఏళ్ల వ‌య‌సు వారికోసం ఒక సుల‌భ‌మైన‌ ప్లాన్ సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు. అప్పుడే ఉద్యోగంలో చేరిన‌వారు పెట్టుబ‌డుల గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 25 ఏళ్ల వ‌య‌సులో మీరు సంపాదించ‌డం మొద‌లుపెడితే , వార్షికంగా ఆదాయం రూ.6-7 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంద‌నుకుంటే, నెల‌కు రూ.16 వేల నుంచి రూ.17 వేల వ‌ర‌కు పొదుపు చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమి కాదు. అంటే మీ వేత‌నం నుంచి మూడ‌వ వంతు లేదా రూ.2 ల‌క్ష‌లు పొదు పు చేస్తున్న‌ట్లు లెక్క‌. ఇలా చేస్తే 40 ఏళ్ల‌కే అనుకున్న‌ట్లుగా ఎక్కువ మొత్తంలో పొదుపు చేసుకోవ‌చ్చు.

మీ ఆదాయం నుంచి సంవ‌త్స‌రాల‌నికి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను ఆదా చేసే ప‌థ‌కాలు పీపీఎఫ్‌ లేదా పోస్టాఫీస్ ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్‌ల‌లో పొదుపు చేయ‌వ‌చ్చు. ఇవి ప్ర‌భుత్వ అదీనంలో ప‌నిచేసే, సుల‌భంగా పెట్టుబ‌డి చేయ‌గ‌లిగే ప‌థ‌కాలు. దీనికోసం చేయ‌వ‌ల‌సింది ఏంటంటే…

మొద‌ట ప్ర‌జా భ‌విష్య నిధి (పీపీఎఫ్), ఖాతా ప్రారంభించాలి. సంవ‌త్స‌రానికి రూ.1.5 ల‌క్ష‌ల చొప్పున 15 సంవ‌త్స‌రాల వ‌ర‌కు జ‌మ చేయాలి. ప్ర‌స్తుతం పీపీఎఫ్ వ‌డ్డీ రేట్లు 7.9 శాతం ప్ర‌కారం మీకు 40 ఏళ్ల నాటికి ఇవి రూ.43,90,000 ల‌క్ష‌లకు చేర‌తాయి. పీపీఎఫ్ పెట్టుబ‌డుల‌పై ఎటువంటి ప‌న్ను ఉండ‌దు. ప్ర‌తి ఏడాది మీరు రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. ఉద్యోగంలో అనుభ‌వం పెరిగిన కొద్ది వేత‌నం కూడా పెరుగుతూ వ‌స్తుంది. అయితే ఇంటి బాధ్య‌త‌లు పెరుగుతుంటాయి కాబ‌ట్టి ఎక్కువ‌గా ఆదా చేసే అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చు. దీంతో పాటు మీరు ప్ర‌మాద బీమా, ఆరోగ్య బీమా పాల‌సీలు తీసుకుంటే అనుకోకుండా ఏదైనా ప్ర‌మాదం ఎదురైనా మీ కుటుంబానికి భ‌రోసా ఉంటుంది.

మ‌రో రూ.50 వేల‌ను 12 భాగాలుగా విభ‌జించాలి. అంటే నెల‌కు రూ.4166 బ్యాంకు రిక‌రింగ్ ఖాతాలో డిపాజిట్ చేయాలి. ఉదాహ‌ర‌ణ‌కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పొదుపు చేస్తే సంవ‌త్స‌రానికి రూ.51,988 జ‌మ‌వుతాయి. సంవ‌త్స‌రం ముగిసిన త‌ర్వాత ఈ డ‌బ్బును పోస్టాఫీస్ ఐదేళ్ల టైమ్ డిపాజిట్ ఖాతాలో పొదుపు చేస్తే 7.7 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. 5 ఏళ్లు ముగిసేనాటికి ఇది రూ.51,988 నుంచి రూ.76,498 కి చేరుతుంది. 5 సంవ‌త్స‌రాలు ముగిసిన త‌ర్వాత ఇవి కిసాన్ వికాస్ ప‌త్ర (కేవీపీ) లో జ‌మ‌చేయ‌వ‌చ్చు. దీనిపై వ‌డ్డీ రేటు ప్ర‌స్తుతం 7.6 శాతంగా ఉంది. 112 నెల‌ల్లో అంటే 9 సంవ‌త్స‌రాల 4 నెల‌ల్లో మీ న‌గ‌దు రెట్టింపు అవుతుంది. అంటే 15 సంవ‌త్స‌రాలు ముగిసేనాటికి అద‌నంగా రూ.1,52,996 మీ వ‌ద్ద ఉంటాయి.

రెండో ఏడాదిలో మీరు మ‌ళ్లీ రిక‌రింగ్ డిపాజిట్ ప్రారంభించి నెల‌కు రూ.4166 జ‌మ‌చేసి సంవ‌త్స‌రం త‌ర్వాత తిరిగి పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్‌లో డిపాజిట్ చేస్తే మ‌రో రూ.76,498 ఐదేళ్ల త‌ర్వాత మీకు అందుతాయి. ఇదేవిధంగా చేస్తుంటే ఐదేళ్ల‌లో మరో రూ.76.498 జ‌మ‌వుతాయి. నాలుగేళ్లు ఇలా చేస్తే 10 సంవ‌త్స‌రాల నాటికి మీ వ‌ద్ద రూ. 76,498+ రూ.76,498+రూ.76,498+రూ.76,498= రూ.303992 జ‌మ‌వుతాయి.

10 వ సంవ‌త్స‌రం ముగిసిన త‌ర్వాత రూ.50 వేలు సంవ‌త్స‌రానికి పెట్టుబ‌డిగా పెట్ట‌డం నిలిపివేసి ఆ డ‌బ్బును ఇత‌ర అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు. మీకు 40 సంవ‌త్స‌రాలు వ‌చ్చే నాటికి మొత్తం రూ.1,52,996 + రూ. 3,03,992 + రూ.43,90,000 = రూ. 48,46,988. మీ మొత్తం పెట్టుబ‌డులు కేవ‌లం రూ.(50,000+ రూ.1,50,000)*15= రూ.30 ల‌క్ష‌లు. దీంతో మీ ప‌న్ను కూడా ఆదా అవుతుంది. రాబ‌డి గురించి దిగులు చెందాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. మొత్తం రూ. 48,46,988 లో రూ.43.90 ల‌క్ష‌ల‌కు ఎటువంటి ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

ఇది కేవ‌లం రిస్క్ లేకుండా బ్యాంకు డిపాజిట్ల‌లో పెట్టుబ‌డులు చేస్తే వ‌చ్చే రాబ‌డి ఆధారంగా లెక్కించిన గ‌ణాంకాలు. ఇత‌ర సాధ‌నాల్లో పెట్టుబ‌డుల‌కు మ‌రింత రాబ‌డి పొంద‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని