Air India: ఎయిరిండియా కొత్త సీఈఓగా క్యాంబెల్ విల్సన్‌

టాటాల చేతికొచ్చిన నాటి నుంచి ఎయిరిండియా (Air India) సీఈఓ ఎవరనే దానిపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఆ సంస్థ నూతన సీఈఓగా, మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ)గా స్కూట్‌ సీఈఓ క్యాంబెల్‌ విల్సన్‌ను నియమిస్తున్నట్లు

Published : 12 May 2022 17:26 IST

ముంబయి: టాటాల చేతికొచ్చిన నాటి నుంచి ఎయిరిండియా (Air India) సీఈఓ ఎవరనే దానిపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఆ సంస్థ నూతన సీఈఓగా, మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ)గా స్కూట్‌ సీఈఓ క్యాంబెల్‌ విల్సన్‌ను నియమిస్తున్నట్లు టాటాసన్స్‌ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. విల్సన్‌ నియామకాన్ని ఎయిరిండియా బోర్డు ఆమోదించినట్లు తెలిపింది.

50 ఏళ్ల విల్సన్‌కు విమానయాన రంగంలో 26ఏళ్ల అనుభవం ఉంది. 15 ఏళ్లకు పైగా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌లో పనిచేస్తున్నారు. 1996లో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా కెరీర్‌ను మొదలుపెట్టిన ఆయన ఆ గ్రూప్ తరఫున జపాన్‌, హాంకాంగ్‌, కెనడా వంటి దేశాల్లో పనిచేశారు. ఆ తర్వాత 2011లో స్కూట్‌ పేరుతో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రారంభించిన బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌కు వ్యవస్థాపక సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 2016 వరకు ఆ పదవిలో కొనసాగిన ఆయన ఆ తర్వాత సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌లో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌)గా నియమితులయ్యారు. 2020 ఏప్రిల్‌లో తిరిగి స్కూట్‌ సంస్థగా సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. టాటా గ్రూప్‌ యాజమాన్యంలోని విస్తారా ఎయిర్‌లైన్స్‌లో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.

విల్సన్‌ నిమాయకంపై టాటా సన్స్‌, ఎయిరిండియా ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. ‘‘ఎయిరిండియాలోకి విల్సన్‌కు స్వాగతం పలుకుతున్నాం. విమానయాన రంగంలో ఆయనో కీలక వ్యక్తి. ఆయన అనుభవం ఎయిరిండియాకు అదనపు ప్రయోజనం. ఆయనతో కలిసి ఈ సంస్థను ప్రపంచ ప్రామాణికంగా తీర్చిదిద్దేందుకు ఎదురుచూస్తున్నాం’’ అని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిరిండియా సీఈఓ, ఎండీగా టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ మాజీ ఛైర్మన్‌ ఇల్కర్‌ ఐసీని నియమిస్తున్నట్లు టాటాసన్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆఫర్‌ను ఇల్కర్ తిరస్కరించారు. భారత మీడియాలో కొన్ని వర్గాలు తనపై అవాంఛనీయ పద్ధతిలో ‘రంగులద్దడాన్ని’ జీర్ణించుకోలేకపోయానని ఆయన వివరించారు. పాకిస్థాన్‌తో స్నేహపూర్వకంగా మెలిగే టర్కిష్‌ ప్రెసిడెంట్‌ రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌కు ఇల్కర్‌ ఐసీ చాలా సన్నిహితుడని వార్తలు రావడం ఇందుకు నేపథ్యం. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిరిండియా సీఈఓ, ఎండీగా ఐసీ నియామకానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయరాదని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన స్వదేశీ జాగరణ్‌ డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఇల్కర్‌ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని