చైనాతో పోరుకు ముందు..!

‘తీవ్రమైన సంక్షోభం తీసుకొచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోకూడదు’ అని బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి

Published : 29 Jan 2021 18:58 IST

బడ్జెట్‌తోనే బలం.. 

ఆత్మనిర్భర్‌ భారత్‌కు పెద్దపీట

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

‘తీవ్రమైన సంక్షోభం తీసుకొచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోకూడదు’ అని బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి అంచున ఉన్న బ్రిటన్‌ను ఆయన విజేతగా నిలిపారు. ఇప్పుడు చర్చిల్‌ మాటలను భారత పాలకులు జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు.  చైనాతో ఘర్షణ అంటే సామాన్యంగా ఉండదు.. 15 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక మత్తేభం.. డ్రాగన్‌ రక్షణ రంగ బడ్జెట్‌ 179 బిలియన్‌ డాలర్లు.. దాని ఆయుధాలు అత్యధిక భాగం దేశీయంగా తయారవుతాయి. అంటే కారుచౌకగా ఆయుధ సరఫరా కొనసాగుతుందన్నమాట.. భారత్‌ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం.. చైనాతో పోల్చుకుంటే భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఐదింట ఒకటో వంతు ఉంటుంది. చైనా రక్షణ బడ్జెట్‌తో పోలిస్తే మూడింట ఒకటో వంతు మాత్రమే భారత్‌ కేటాయింపులు ఉంటాయి. ఇక అత్యధిక భాగం దిగుమతులపైనే ఆధారపడతాం. అంటే ఆయుధ విక్రేతలు అధిక ధరలు.. సవాలక్ష నిబంధనలు మనపై రుద్దుతారు. దీనికి తోడు పింఛన్లు, జీతాలు, గత కొనుగోళ్ల చెల్లింపులకే చాలా వరకు ఖర్చయిపోతాయి. ఇక ఆయుధ కొనుగోళ్లు.. ఆధునికీకరణకు మిగిలేది అత్యల్పమే. ఇప్పుడు తాజాగా కొవిడ్‌ దేశ ఆర్థిక వ్యవస్థని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. మరోపక్క లద్దాఖ్‌లో చైనాతో ఘర్షణ కొనసాగుతోంది. దీంతో బలగాల మోహరింపుల్లో ఎక్కడా వెనక్కి తగ్గే పరిస్థితిలేదు. తాజాగా ఉత్తర సిక్కింలోని నాకులా వద్ద మరో ఘర్షణ చోటు చేసుకొంది. సైన్యాన్ని అన్ని రంగాల్లో వేగంగా ఆధునీకీకరిస్తున్న చైనాను కట్టిడి చేయాలంటే భారత్‌ కూడా సిద్ధంగా ఉండాలి.. లేకపోతే భూభాగం కోల్పోక తప్పని పరిస్థితి వస్తుంది.  ఈసారి రక్షణ బడ్జెట్‌పై చైనాతో ఘర్షణ ప్రభావం స్పష్టంగా ఉంటుంది.

భారత్‌ తేల్చుకోవాలి.. 

భారత్‌ చైనాతో ఎటువంటి విభాగంలో పోటీపడాలో ముందు స్పష్టత తెచ్చుకోవాలి. బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించి కొత్త ఆయుధాలు కొనడమా.. లేదా కీలకమైన భవిష్యత్తు సాంకేతికతలను సొంతగా అభివృద్ధి చేయడానికి నిధులను వెచ్చించడమా అనే అంశంపై స్పష్టత రావాలి. ప్రస్తుతానికి మాత్రం ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌ తప్పనిసరై పెద్ద ఎత్తున ఆయుధాలను కొనుగోలు చేస్తోంది.

వాస్తవానికి కొన్నేళ్లుగా రక్షణ రంగ బడ్జెట్‌పై సైన్యం అసంతృప్తితో ఉంది. 2018లో నాటి వైస్‌ ఆర్మీచీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ శరత్‌ చందా పార్లమెంటరీ ప్యానెల్‌ ముందు మాట్లాడుతూ రక్షణ బడ్జెట్‌ తమ ఆశలపై నీళ్లు చల్లిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. నాటి బడ్జెట్‌లో ఆర్మీ ఆధునికీకరణకు కేటాయించింది. రూ.21,388 కోట్లు. ఇక 2019-20లో రూ.32,474 కోట్లు . దాదాపు ఏడేళ్ల నుంచి సైన్యం అవసరాలు.. కేటాయింపుల మధ్య 14శాతం నుంచి 30 శాతం వరకు లోటు కొనసాగుతోంది.

మెగాడీల్స్‌లో విపరీతమైన జాప్యం..

ప్రభుత్వం రక్షణ బడ్జెట్‌ మొత్తాన్ని అతి తక్కువగా పెంచుతోంది. గత ఏడాది పింఛన్ల ఖర్చు తీసేయగా కేవలం 1.82 శాతం వృద్ధి చెంది రూ.3.37 లక్షల కోట్లకు చేరింది. దీంతో కొనుగోళ్లు, ఆధునికీకరణ మందకొడిగానే సాగాయి.  అంతకు ముందు ఏడాదితో పోలిస్తే సైన్యానికి 3శాతం అదనంగా కేటాయించారు. ఇక వాయుసేనకు అంతుకు ముందు అంచనాల కంటే తగ్గించి రూ.43,281 కోట్లు కేటాయించారు. దీంతో యుద్ధవిమానాల కొనుగోళ్లు ముందుకు సాగలేదు. సైన్యానికి అరకొర కేటాయింపులపై జనవరి 2020లోని పార్లమెంటరీ స్టాండిగ్‌ కమిటీ కూడా మోదీ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. 

గత 15 ఏళ్లలో భారత్‌ కేవలం 2 సబ్‌మెరైన్లనే నావికాదళంలోకి పూర్తిస్థాయిలో చేర్చింది. అదే చైనా ఒక్క 2020లోనే రెండు సబ్‌మెరైన్లను చేర్చింది.  మరోపక్క 126 రఫేల్స్‌ కొనాలనుకున్న భారత్‌ చివరకు 36తో సరిపెట్టుకొంది. 83 తేజస్‌ల కొనుగోళ్లకు ఇటీవల కేబినెట్‌ పచ్చజెండా ఊపింది.  గల్వాన్‌ ఘర్షణ తర్వాత భారత్‌ ఆదరాబాదరగా రూ.5 వేల కోట్లు పెట్టి ఆయుధాలను కొనుగోలు చేసింది. ఇది భారత్‌ సన్నద్ధతలో లోపాలు.. లక్ష్యాలను ఏర్పర్చుకోవడంలో గందరగోళాన్ని తెలియజేస్తున్నాయి. 

‘ఆత్మనిర్భర్‌’లో ఎక్కడా తొణక్కూడదు..

ఆగస్టులో రక్షణ శాఖ 101 రకాల రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై అయిదు దశల్లో నిషేధం విధించింది. అందులో 2020తో ముగిసే తొలి దశలో తేలికపాటి యుద్ధ విమానాలు ఉండగా, 2025తో ముగిసే తుదివిడతలో ఉపరితలంపై దాడి చేసే క్రూయిజ్‌ క్షిపణులు ఉన్నాయి. శతఘ్నులు, క్షిపణి విధ్వంసక నౌకలు, నౌకలపై నుంచి ప్రయోగించే క్షిపణులు, తేలికపాటి రవాణా విమానాలు, సమాచార ఉపగ్రహాలు, శిక్షణ విమానాలు, బహుళ బ్యారెల్‌ రాకెట్‌ లాంచర్లు, రాడార్లు, రైఫిళ్లు, చిన్నపాటి డ్రోన్లు సైతం ఉన్నాయి. మరోవైపు, భారత రక్షణ రంగ ఎఫ్‌డీఐలను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచింది. రక్షణ ఆయుధ సేకరణ విధివిధానాలు-2020 గత నెల నుంచే అమలులోకి వచ్చాయి.  వీటిలో 7.7 లక్షల ఏకే 203 రైఫిళ్లను భారత్‌లో ఉత్పత్తి చేసేలా ఒప్పందం చేసుకొంది. తేజస్‌ విమానాల కొనుగోలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొవిడ్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో దేశీయ తయారీ వైపు మళ్లడం మంచిదే. కానీ, దేశీయంగా తయారు చేయాలని కీలక ఆయుధాలను కొనుగోలు చేయకుండా ఆగకూడదు. అవసరాలను బట్టి అత్యవసర కొనుగోళ్లు తప్పనిసరి.. లేకపోతే సరిహద్దుల్లోని సైనికులకు ఆయుధ కొరత ఏర్పడుతుంది.  

నిపుణులు ఏమంటున్నారు..

చైనా రక్షణ బడ్జెట్‌ పేరుతో బయటకు చెప్పే మొత్తం కంటే వెచ్చించే మొత్తం చాలా ఎక్కువ. 2019లో 175 బిలియన్‌ డాలర్లు వెచ్చించినట్లు చైనా చెబితే.. సిప్రి సంస్థ మాత్రం ఆ మొత్తం 240 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. అందుకే డ్రాగన్‌ను అదుపు చేయాలంటే భారత్‌ కూడా రక్షణ కేటాయింపులు పెంచాలి. దీనిపై రక్షణ శాఖ మాజీ కార్యదర్శి జి.మోహన్‌ కుమార్‌ ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ..‘‘సైన్యానికి ఆయుధాలు సమకూర్చడం చాలా కీలకం. ముఖ్యంగా తూర్పు సరిహద్దుల్లోని పదాతిదళం, వాయుసేనను బలోపేతం చేయాలి.   దీనికి భారీ మొత్తంలో నిధులను సమకూర్చాలి’ ’ అని పేర్కొన్నారు. మాజీ  మేజర్‌ జనరల్‌ యష్‌ మోర్‌ ది ప్రింట్‌తో మాట్లాడుతూ రక్షణ రంగ కేటాయింపులను అత్యధికంగా చేసే ఆరు దేశాల్లో  తలసరి లెక్కన చూస్తే భారత్‌దే చాలా తక్కువగా ఉందన్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో అవసరాలు ఉన్నా.. కేటయింపులు చేయలేకపోవచ్చు. ఆయుధ కొనుగోళ్లు.. ఆధునికీకరణలో  రూ.10వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు పెంపు ఉన్నా స్వాగతించవచ్చు. 

ఇవీ చదవండి

ఆర్థిక సర్వే: 2021-22లో రెండంకెల వృద్ధి

రైతుల సంక్షేమం కోసమే కొత్త చట్టాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని