Bank locker: లాకర్‌ వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..

కాబట్టి బ్యాంకు లాకర్‌ను తీసుకోవాలనుకునే వారు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. 

Updated : 11 Oct 2021 15:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగారం, ఆస్తి పత్రాలను చాలా మంది బ్యాంకు లాకర్లలో పెడుతుంటారు. ఇంట్లో ఉంటే దొంగలబారిన పడి ఎక్కడ పోతాయోనని లాకర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే, బ్యాంకుల్లో సైతం కొన్ని సందర్భాల్లో చెద పట్టి లాకర్లు పోవడాలు, దొంగతనాలు జరిగి లాకర్లలోని విలువైన వస్తువులు పోయిన ఉదంతాలు ఉన్నాయి. అలాంటివి జరిగినప్పుడు గతంలో బ్యాంకులు తమకు సంబంధం లేదని చెప్పేవి. అయితే ఇటీవల ఆర్‌బీఐ కొన్ని కొత్త నిబంధనను తీసుకొచ్చింది. దొంగతనం, అగ్నిప్రమాదం, బ్యాంకుల్లో మోసాలు వంటి సందర్భాల్లో పరిహారం కోరొచ్చని పేర్కొంది. లాకర్‌ అద్దెకు 100 రెట్ల వరకు పరిహారం పొందొచ్చని తెలిపింది. అలాగే లాకర్ల విషయంలో ఆర్‌బీఐ కొన్ని నిబంధనలను మార్చింది. కాబట్టి బ్యాంకు లాకర్‌ను తీసుకోవాలనుకునే వారు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. 

బ్యాంకు లాక‌ర్ తీసుకునేట‌ప్పుడు బ్యాంక్ నుంచి అగ్రిమెంట్ కాపీ పొందాలి. 2023 జ‌న‌వ‌రి 1 నుంచి బ్యాంకులు ప్రస్తుత వినియోగదారులతో ఒప్పందాల‌ను పునరుద్ధరించుకోనున్నాయి. అలాగే కొత్తగా లాకర్లు తీసుకునే వినియోగదారులకు 2022 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఒప్పంద కాపీని పూర్తిగా చదవడంతో పాటు, ఒకసారి లాకర్‌ ఒప్పందం పూర్తయ్యాక ఓ కాపీని మీ దగ్గరు దాచిపెట్టుకోవడం ముఖ్యం. అలాగే, ఒప్పందం విషయంలో బ్యాంకులు న్యాయ‌మైన నిబంధ‌న‌లు, ష‌ర‌తులు మాత్రమే విధించాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. 

లాక‌ర్ తీసుకునేవారు లాక‌ర్ అద్దె ఛార్జీలను సకాలంలో చెల్లించాలి. కొత్త నిబంధ‌న‌ల ప్రకారం లాకర్లను కేటాయించేట‌ప్పుడు కొత్త కస్టమర్ల నుంచి ట‌ర్మ్ డిపాజిట్‌ను పొంద‌డానికి ‘ఆర్‌బీఐ’ బ్యాంకులకు అనుమతిచ్చింది. లాక‌ర్‌ని అద్దెకు తీసుకున్నవారు అద్దె చెల్లించ‌క‌పోయినా, ఎక్కువ కాలం పాటు లాక‌ర్ తెర‌వకపోయినా, అస‌లు బ్యాంకుకే రాక‌పోయినా లాక‌ర్ అద్దెను ఈ ట‌ర్మ్ డిపాజిట్‌లోంచి మినహాయించుకుంటారు. అయితే బ్యాంకు ఖాతాదారుడు బ్యాంకులో ఎక్కువ బ్యాలెన్స్ కలిగి ఉంటే బ్యాంకులు అదనపు డిపాజిట్ అడ‌గ‌క‌పోవ‌చ్చు. అలాగే, బ్యాంకు లాక‌ర్‌లో భ‌ద్రపరిచే వస్తువులకు భద్రతగా బీమా పాలసీని తీసుకోవడం మంచిది. దొంగ‌త‌నం, అగ్నిప్రమాదం, ఇతర ప్రమాదాల నుంచి ఈ బీమా రక్షణ కల్పిస్తుంది.

లాక‌ర్ అద్దెకు తీసుకున్న య‌జ‌మానులు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మీరు లాక‌ర్‌లో భద్రపరిచే వస్తువుల లిస్ట్‌ని త‌ప్పనిసరిగా ఒక పుస్తకంలో రాసుకోవాలి. మీరు లాక‌ర్‌ని తెరిచిన‌పుడు అందులోని వ‌స్తువులు బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చినా, వేరే వాటిని కొత్తగా లాకర్లో పెట్టినా మీరు రాసుకున్న వ‌స్తువుల జాబితాను జాగ్రత్తగా అప్‌డేట్‌ చేసుకోవాలి. లేక‌పోతే బ్యాంక్ లాక‌ర్‌లో పెట్టిన వ‌స్తువుల విష‌యంలో గంద‌ర‌గోళానికి అస్కారం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని