Elon Musk: మస్క్‌కు ‘టెస్లా’ దెబ్బ.. 2 నెలల్లో రూ.3 లక్షల కోట్ల సంపద ఫట్‌..!

Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్‌ మస్క్‌ మూడో స్థానానికి పడిపోయారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆయన నికర సంపద రూ.3 లక్షల కోట్ల మేర తగ్గింది.

Published : 09 Mar 2024 17:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్లా (Tesla) అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాదిలో తొలి రెండు నెలల కాలంలో ఆయన నికర ఆస్తి భారీగా క్షీణించింది. మస్క్‌ సంపదలో ఇప్పటివరకు 40 బిలియన్‌ డాలర్లకు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.3లక్షల కోట్లకు పైమాటే) పైగా ఆవిరైనట్లు బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన మూడో స్థానానికి పడిపోయారు.

బ్లూమ్‌బర్గ్‌ సూచీ ప్రకారం ప్రస్తుతం మస్క్‌ నికర సంపద 189 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 201 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో ఫ్రాన్స్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ప్రపంచ కుబేరుడిగా అగ్రస్థానంలో ఉండగా.. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ 198 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మస్క్‌ తర్వాత 182 బిలియన్‌ డాలర్లతో మెటా అధినేత జుకర్‌బర్గ్‌ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది జుకర్‌ సంపద విలువ ఏకంగా 53శాతం పెరగడం విశేషం.

ఇన్ఫోసిస్‌లో సుధామూర్తికి రూ.5,600 కోట్ల విలువైన షేర్లు

మస్క్‌కు ప్రధాన ఆదాయం టెస్లా షేర్ల వల్లే వస్తోంది. అయితే, గత కొంతకాలంగా ఈ షేర్లు భారీగా కుదేలవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు టెస్లా షేర్లు 29శాతం కుంగాయి. 2021 నాటి గరిష్ఠ స్థాయితో పోలిస్తే షేరు విలువ 50 శాతానికి పైగా తగ్గింది. చైనాలో ఈ కంపెనీ విక్రయాలు ఆశించిన మేర జరగడం లేదు. అటు బెర్లిన్‌ సమీపంలోని ఫ్యాక్టరీపై దాడి జరగడంతో ఉత్పత్తిని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కంపెనీ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. మరోవైపు, గత నెలలో టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన 55 బిలియన్‌ డాలర్ల భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు మస్క్‌ అనర్హుడని డెలావేర్‌ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇది ఆయన సంపద విలువ తగ్గడానికి మరో కారణమని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక, ప్రపంచ కుబేరుల జాబితాలో భారత సంపన్నుడు ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) 113 బిలియన్‌ డాలర్లతో 11వ స్థానంలో, గౌతమ్‌ అదానీ (Gautam Adani) 103 బిలియన్‌ డాలర్లతో 13 స్థానంలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు