Elerctric Vehicles: ఈవీల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయ్‌.. ఓలా సీఈఓ ట్వీట్‌

ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో వరుస అగ్నిప్రమాదాలతో గత కొంతకాలంగా ఓలా సంస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఆ సంస్థ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ నేడు చేసిన ట్వీట్‌ గందరగోళానికి

Published : 23 Jun 2022 14:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో వరుస అగ్నిప్రమాదాలతో గత కొంతకాలంగా ఓలా సంస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆ సంస్థ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ చేసిన ఓ ట్వీట్‌ గందరగోళానికి గురిచేసింది. విద్యుత్‌ వాహనాల్లో అగ్నిప్రమాదాలు జరగడం సాధారణమే అని, అంతర్జాతీయ కంపెనీలు తయారు చేసిన వాహనాల్లోనూ ఈ తరహా ఘటనలు జరుగుతాయని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. అసలేం జరిగిందంటే..

టాటా సంస్థకు చెందిన నెక్సాన్‌ ఈవీ కస్టమర్‌ యూనిట్ ఒకటి బుధవారం రాత్రి అగ్నిప్రమాదానికి గురైంది. ముంబయి శివారులోని వాసాయి ప్రాంతంలో నెక్సాన్‌ ఈవీలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు వెంటనే మంటలు ఆర్పివేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఒక నెటిజన్‌ షేర్‌ చేయగా.. టాటా మోటార్స్‌ స్పందించింది. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.

ఈ వ్యవహారంపై ఓలా సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ఈవీ అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. అంతర్జాతీయ ఉత్పత్తుల్లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతాయి. అయితే ఇంటర్నల్‌ కంబ్యూషన్‌ ఇంజిన్‌ (ఐసీఈ) ప్రమాదాలతో పోలిస్తే ఈవీ అగ్నిప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతాయి’’ అని ఆయన ట్వీట్ చేశారు. విద్యుత్‌ వాహనాల భద్రతపై ఆందోళన నెలకొన్న వేళ ఓలా సీఈఓ ట్వీట్‌ నెటిజన్లను గందరగోళానికి గురిచేసింది. కొందరు ఆయనకు మద్దతివ్వగా.. మరికొందరు మాత్రం ఆయన ట్వీట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని