Fuel prices: ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రో వాతే!

గత కొన్ని రోజలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. కనీసం రూపాయల్లో కాదు కదా.. పైసల్లో కూడా రోజువారీ ధరల్లో మార్పు లేదు. అయితే, ఇది మరికొద్దిరోజులు మాత్రమేనని డెలాయిట్‌ ఇండియా ఎల్‌ఎల్‌పీ (డెలాయిట్‌ టచీ తోమత్సు ఇండియా- DTTILLP) పేర్కొంది. 

Published : 10 Feb 2022 01:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత కొన్ని రోజలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. కనీసం రూపాయల్లో కాదు కదా.. పైసల్లో కూడా రోజువారీ ధరల్లో మార్పు లేదు. అయితే, ఇది మరికొద్దిరోజులు మాత్రమేనని డెలాయిట్‌ ఇండియా ఎల్‌ఎల్‌పీ (డెలాయిట్‌ టచీ తోమత్సు ఇండియా- DTTILLP) పేర్కొంది. వచ్చే నెలతో ముగిసే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత చమురు ధరలు భారీగా పెరగనున్నాయని పేర్కొంది. ఈ మేరకు డెలాయిట్‌ పార్టనర్‌ దెబాశిష్‌ మిశ్రా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా రిటైల్‌ ధరల్లో చమురు కంపెనీలు ఎలాంటి మార్పూ చేయడం లేదని మిశ్రా అభిప్రాయపడ్డారు. మార్చి 10 తర్వాత 8-9 రూపాయల మేర ధరలు పెంచే అవకాశం ఉందని చెప్పారు. ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ గ్యాస్‌.. చమురు ధరల్లో ఎలాంటి మార్పూ చేయడం లేదు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు ధరలను సవరించే అధికారం ఆయా కంపెనీలకు ఉన్నప్పటికీ ఎన్నికల వేళ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న కారణంతో వెనకడుగు వేస్తున్నాయన్నారు.

ఒకవేళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినా ప్రభుత్వం పన్నుల రూపంలో ఎంతోకొంత తగ్గిస్తుందని, మిగిలిన భారాన్ని ప్రజలే మోయాల్సి ఉంటుందని మిశ్రా అన్నారు. పెరిగిన చమురు ధరల వల్ల ఇటు ప్రభుత్వానికి, అటు ఆర్‌బీఐకి కూడా ఇబ్బందికరమేనని తెలిపారు. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం కూడా పెరిగి నిత్యావసరాల ధరలు పెరుగుతాయన్నారు. అంతర్జాతీయంగా బ్యారెల్‌ చమురు ధర 100 డాలర్లు దాటితే రిటైల్‌ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటును అదుపు చేయడం భారత్‌కు సవాల్‌ కానుందని చెప్పారు. అలాగే ఆయిల్‌ ధరలు 10 డాలర్లు పెరిగితే దేశ వృద్ధిలో 0.3 నుంచి 0.35 శాతం మేర కోత పడుతుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని