Aviation: 24 గంటల ముందే కస్టమ్స్‌ విభాగానికి.. అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలు

విమానం బయలుదేరడానికి 24 గంటల ముందే అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను కస్టమ్స్‌ విభాగంతో పంచుకోవాలని విమానయాన సంస్థలను ప్రభుత్వం కోరింది.

Updated : 10 Aug 2022 02:28 IST

విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు

దిల్లీ: విమానం బయలుదేరడానికి 24 గంటల ముందే అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను కస్టమ్స్‌ విభాగంతో పంచుకోవాలని విమానయాన సంస్థలను ప్రభుత్వం కోరింది. ఇందుకోసం ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో పనిచేసే కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) ‘ప్యాసింజర్‌ నేమ్‌ రికార్డ్‌ ఇన్ఫర్మేషన్‌ రెగ్యులేషన్స్‌, 2022’ను ఈనెల 8న నోటిఫై చేసింది. ఆర్థిక, ఇతరత్రా నేరాలకు పాల్పడిన వారు దేశం నుంచి పారిపోకుండా, దొంగచాటు రవాణా (స్మగ్లింగ్‌) జరగకుండా చూసేందుకే ఈ వివరాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. సీబీఐసీ ఏర్పాటు చేసిన ‘ద నేషనల్‌ కస్టమ్స్‌ టార్గెటింగ్‌ సెంటర్‌-ప్యాసింజర్‌’ ఈ సమాచారాన్ని మదింపు చేస్తుంది. తదనంతరం కస్టమ్స్‌ చట్టం కింద నేరాల అదుపు, గుర్తింపు, దర్యాప్తు, విచారణలను చేపడుతుంది. ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు లేదా ఇతర దేశాల కోసం కూడా ఈ పని చేస్తుందని ప్రభుత్వం తెలిపింది.

60 దేశాల సరసన: తాజా పరిణామంతో, అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను ముందుగా సేకరించే 60 దేశాల సరసన భారత్‌ కూడా చేరింది. ప్రస్తుతం పేరు, జాతీయత, పాస్‌పోర్టు వివరాలనే ఇమిగ్రేషన్‌ అధికారులతో విమానయాన సంస్థలు పంచుకుంటున్నాయి. ఇకపై విమానయాన సంస్థలన్నీ కస్టమ్స్‌ విభాగం వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకుని, తాజా ఆదేశాలను అమలు చేయాల్సి ఉంటుంది.

* ప్రయాణికుల పేర్లు, టికెట్‌ చెల్లింపు సమాచారం, టికెట్‌ జారీ తేదీ, వారి కాంటాక్ట్‌ వివరాలైన.. ఇమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబరు, పీఎన్‌ఆర్‌, ప్రయాణ వివరాలు, ఏజెన్సీ, బ్యాగేజీ, కోడ్‌ షేర్‌ సమాచారాన్నీ సంస్థలు అందించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణ ఎగవేతదార్లు దేశం విడిచివెళ్లకుండా చూసేందుకే ఈ ఆదేశాలని విశ్లేషకులు అంటున్నారు. తాజా ఆదేశాలను పాటించకపోతే విమానయాన సంస్థలు కనీసం రూ.25,000; గరిష్ఠంగా రూ.50,000 వరకు అపరాధ రుసుము కట్టాల్సి వస్తుందని కేంద్రం తెలిపింది.

ఇప్పటిదాకా 38 మంది పరారీ: గత అయిదేళ్లలో నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యా, మెహుల్‌ చోక్సీ వంటి 38 మంది ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పరారయ్యారు. విజయ్‌మాల్యా రూ.9,000 కోట్లు, మెహుల్‌ చోక్సీ రూ.13,000 కోట్ల మేర బ్యాంకులకు బకాయిలు కట్టకుండా దేశం నుంచి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని