సొంతిల్లు కల భారమే

సొంతిల్లు, కారు సమకూర్చుకోవాలనే ఆకాంక్ష, సగటు మధ్యతరగతి వర్గీయులకు మరింత ఆర్థికభారం కానుంది. వీటి కొనుగోలుకు రుణాలపైనే అత్యధికులు ఆధారపడతారు. అయితే వడ్డీరేట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 1.90 శాతం పెరగడంతో ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి నెలవారీ కిస్తీ/కాలావధి పెరగనుంది.

Published : 01 Oct 2022 02:27 IST

రెపో రేటు పెంపుతో నెలవారీ వాయిదాలు అధికం

ఈనాడు, హైదరాబాద్‌: సొంతిల్లు, కారు సమకూర్చుకోవాలనే ఆకాంక్ష, సగటు మధ్యతరగతి వర్గీయులకు మరింత ఆర్థికభారం కానుంది. వీటి కొనుగోలుకు రుణాలపైనే అత్యధికులు ఆధారపడతారు. అయితే వడ్డీరేట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 1.90 శాతం పెరగడంతో ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి నెలవారీ కిస్తీ/కాలావధి పెరగనుంది. కొత్తగా రుణం తీసుకునేవారి సంపాదన కనుగుణంగా ‘రుణ అర్హత మొత్తం’ తగ్గే ప్రమాదం ఉంది.

కొవిడ్‌ పరిణామాల నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపోరేటు (వాణిజ్య బ్యాంకులకు రుణాలిచ్చేందుకు ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు)ను 4 శాతం వద్ద దీర్ఘకాలం ఉంచింది. ఇందువల్ల బ్యాంకులూ తక్కువ వడ్డీకే తమ ఖాతాదార్లకు రుణాలు అందించాయి. అయితే రిటైల్‌ ద్రవ్యోల్బణం గరిష్ఠ లక్షిత స్థాయికి మించే ఈ ఏడాది జనవరి నుంచి కొనసాగుతున్నందున, అదుపు చేసేందుకు ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంచడాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించింది. అమెరికా, ఐరోపా సహా పలు దేశాల కేంద్ర బ్యాంకుల బాటలోనే ఆర్‌బీఐ సాగుతోంది. గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటికి 4 విడతల్లో రెపోరేటు 1.90 శాతం పెరిగి, 5.90 శాతానికి చేరింది. ఇప్పుడు బ్యాంకులూ తమ రెపో ఆధారిత వడ్డీ రేట్లను (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి. అక్టోబరు 1 నుంచి తన ప్రైమ్‌ లెండింగ్‌ రేటును 50 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచుతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ శుక్రవారమే ప్రకటించింది.

రుణ గ్రహీతలకు భారం ఎలా పెరుగుతుందంటే..

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక వ్యక్తి 20 ఏళ్ల వ్యవధికి రూ.35 లక్షల రుణాన్ని తీసుకున్నాడనుకుందాం. ఏప్రిల్‌ నుంచి రెపోరేటు 1.90 శాతం పెరిగింది. అంటే ఏప్రిల్‌లో 6.75 శాతంగా ఉన్న గృహరుణ రేటు ఇప్పుడు 8.65 శాతానికి చేరే అవకాశం ఉంది. ఆ వ్యక్తి చెల్లించాల్సిన ఈఎంఐ (నెలవారీ కిస్తీ) ఎలా మారుతుందో చూద్దాం...

14 ఏళ్లు అధికంగా చెల్లించాలి: రుణ రేట్లు పెరుగుతున్నందున, అప్పు తీసుకుందామనుకునే వారు జాగ్రత్త పడాలని బ్యాంక్‌బజార్‌ సీఈఓ అధిల్‌ శెట్టి సూచించారు. ఇప్పటికే తీసుకున్నవారు సాధ్యమైతే, ముందుస్తుగా రుణం తీర్చేందుకు ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. ‘ఒక వ్యక్తి 7 శాతం వడ్డీతో 20 ఏళ్ల వ్యవధికి రుణం తీసుకున్నారనుకుందాం. అతని ఈఎంఐ రూ.లక్షకు రూ.775 ఉంటుంది. మొత్తం వడ్డీ రూ.86,071 చెల్లించాలి. మూడు నెలలు చెల్లించాక, వడ్డీ రేటు 8.9 శాతానికి చేరిందనుకుందాం. రుణం తీరే వ్యవధి 237 నెలల నుంచి 410 నెలలకు చేరుతుంది. దాదాపు 173 నెలలు అధికం. అంటే 14.5 ఏళ్లకు సమానం. ఈ భారం తగ్గించుకోవాలంటే.. మీ ఈఎంఐకి దాదాపు 17 రెట్లు అదనంగా చెల్లించడం ఒక్కటే మార్గం. లేదా ఏడాదికోసారి ఈఎంఐకి 4.5 రెట్లు అదనంగా చెల్లించాలి’ అని ఆయన పేర్కొన్నారు.

డిపాజిటర్లకు మేలు..: వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ.. రుణాలకు గిరాకీ తగ్గడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. మరోవైపు ఆశించిన వడ్డీ లభించకపోవడంతో నిధులు డిపాజిట్‌ చేసేందుకు అధికులు ఆసక్తి చూపడం లేదు. రెపో పెరిగిన నేపథ్యంలో డిపాజిట్లపైనా వడ్డీ అధికం కానుంది. అక్టోబరు 1 నుంచి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం ఇప్పటికే పెంచింది. ఇదే తరహాలో బ్యాంకులు డిపాజిట్‌ రేట్లనూ పెంచేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం బ్యాంకులు 3-5 ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై 6.10 శాతం వరకు వడ్డీనిస్తున్నాయి. ఇది మరో 30-40 బేసిస్‌ పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే దాదాపు 6.40 శాతానికి చేరొచ్చు. సీనియర్‌ సిటిజన్లకు మరో అరశాతం వడ్డీ అధికంగా లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ వివిధ కాల వ్యవధి డిపాజిట్లపై 10-20 బేసిస్‌ పాయింట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని