సుజాన్‌ వ్యవస్థాపకుడు తులసీ తంతి కన్నుమూత

పవన విద్యుత్‌ సంస్థ సుజ్లాన్‌ ఎనర్జీ వ్యవస్థాపకుడు తులసీ తంతి (64) శనివారం సాయంత్రం కన్నుమూశారు. భారత ‘విండ్‌ మ్యాన్‌’గా ప్రాచుర్యం పొందిన ఆయన గుండె పోటుతో మృతిచెందినట్లు కంపెనీ వెల్లడించింది.

Published : 03 Oct 2022 02:18 IST

దిల్లీ: పవన విద్యుత్‌ సంస్థ సుజ్లాన్‌ ఎనర్జీ వ్యవస్థాపకుడు తులసీ తంతి (64) శనివారం సాయంత్రం కన్నుమూశారు. భారత ‘విండ్‌ మ్యాన్‌’గా ప్రాచుర్యం పొందిన ఆయన గుండె పోటుతో మృతిచెందినట్లు కంపెనీ వెల్లడించింది. అహ్మదాబాద్‌లో విలేకరుల సమావేశం ముగిసిన తర్వాత ఆయన కారులో వెనక్కి వస్తున్నారు. పుణెలో ఆయన ఛాతీ నొప్పితో ఇబ్బందిపడగా, ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే మృతి చెందారు. ఆయనకు భార్య గీత, కుమారుడు ప్రణవ్‌, కుమార్తె నిధి ఉన్నారు. భారత్‌లో పవన విద్యుత్‌ వ్యాపార దిగ్గజాల్లో ఒకరైన తంతి, శుద్ధ ఇంధనంలో కూడా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. తంతి మరణానికి ప్రధాన మంత్రి మోదీ, వాణిజ్య మంత్రి పీయూశ్‌ గోయల్‌ విచారం వ్యక్తం చేశారు.

* 1958లో రాజ్‌కోట్‌లో తులసీ తంతి జన్మించారు. గుజరాత్‌ విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీని పూర్తి చేశారు.

* 1995లో సుజ్లాన్‌ ఎనర్జీని స్థాపించారు. ప్రస్తుతం కంపెనీ విలువ రూ.8,535.9 కోట్లుగా ఉంది. బెల్జియంకు చెందిన టర్బైన్‌ విడిభాగాల సంస్థ జడ్‌ఎఫ్‌ పవర్‌ యాంట్‌వెర్పెన్‌కు 2006 నుంచి ఛైర్మన్‌గా తంతి ఉన్నారు. ఇండియన్‌ విండ్‌ టర్బైన్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

* పవన విద్యుత్‌లోకి రాకముందు తంతికి జౌళి వ్యాపారం ఉండేది. 2001లో దాన్ని విక్రయించారు. 2003లో అమెరికా మిన్నెసోటాలో 24 టర్బైన్‌ల సరఫరా నిమిత్తం దనమార్‌ అండ్‌ అసోసియేట్స్‌ నుంచి సుజ్లాన్‌కు మొట్టమొదటి ఆర్డరు లభించింది.

* పవన విద్యుత్‌ మార్కెట్‌లో అంతర్జాతీయ సంస్థలు ఆధిపత్యం ప్రదర్శిస్తున్న సమయంలో.. 1995లోనే పునరుత్పాదక ఇంధన రంగంలో అవకాశాలను తంతి గుర్తించారు. ఆయన నాయకత్వంలో సుజ్లాన్‌ ఎనర్జీ దేశంలో అతిపెద్ద పవన విద్యుత్‌ సంస్థగా ఎదిగింది. కంపెనీకి మొత్తంగా 19.4 గిగావాట్ల సామర్థ్యం ఉంది. భారత్‌లో 33 శాతం మార్కెట్‌ వాటా ఉండగా, 17 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద పవన విద్యుత్‌ విపణి అయిన అమెరికాలో కంపెనీకి 2 గిగావాట్‌ల సామర్థ్యం ఉంది. అక్టోబరు 11 నుంచి కంపెనీ రూ.1200 కోట్ల రైట్స్‌ ఇష్యూ ప్రారంభం కానున్న సమయంలో తంతి మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని