భారత కంపెనీల క్రెడిట్‌ రేటింగ్‌ నిష్పత్తి మరింత మెరుగు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో (ఏప్రిల్‌- సెప్టెంబరు) భారత కంపెనీల క్రెడిట్‌ రేటింగ్‌ నిష్పత్తి (డౌన్‌ గ్రేడింగ్‌, అప్‌గ్రేడింగ్‌ల మధ్య) మరింత మెరుగయ్యిందని క్రిసిల్‌ రేటింగ్స్‌ వెల్లడించింది.

Published : 04 Oct 2022 02:09 IST

ఏప్రిల్‌- సెప్టెంబరులో 5.2
క్రిసిల్‌ రేటింగ్స్‌

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో (ఏప్రిల్‌- సెప్టెంబరు) భారత కంపెనీల క్రెడిట్‌ రేటింగ్‌ నిష్పత్తి (డౌన్‌ గ్రేడింగ్‌, అప్‌గ్రేడింగ్‌ల మధ్య) మరింత మెరుగయ్యిందని క్రిసిల్‌ రేటింగ్స్‌ వెల్లడించింది. 2021-22 రెండో అర్ధభాగంలో క్రెడిట్‌ నిష్పత్తి 5.04 పాయింట్లు ఉండగా.. 2022-23 మొదటి అర్ధభాగంలో 5.52 పాయింట్లకు పెరిగిందని తెలిపింది. ఏప్రిల్‌- సెప్టెంబరులో 569 కంపెనీల రేటింగ్‌ను పెంచగా.. 103 కంపెనీల రేటింగ్‌ను తగ్గించినట్లు పేర్కొంది. 80 శాతం కంపెనీలు రేటింగ్‌ను యథాతథంగా కొనసాగించినట్లు తెలిపింది. అయితే తాజాగా వెల్లడించిన గణాంకాలు.. దేశీయ కంపెనీల రేటింగ్‌ నాణ్యతను పూర్తి స్థాయిలో ప్రతిబింబించక పోవచ్చని క్రిసిల్‌ స్పష్టం చేసింది. కొన్ని చిన్న సంస్థలు వివరాలను ఇచ్చేందుకు సహకరించక పోవడమే ఇందుకు కారణంగా పేర్కొంది. కొవిడ్‌-19 అనంతరం భారత కంపెనీలు బలంగా పుంజుకున్నాయని క్రిసిల్‌ ఎండీ గురుప్రీత్‌ ఛాత్వాల్‌ తెలిపారు. కేంద్రీయ బ్యాంకుల కీలక రేట్ల పెంపు, అధిక ద్రవ్యోల్బణం లాంటి అంతర్జాతీయ పరిణామాలు సృష్టించిన కుదుపులను కార్పొరేట్‌ భారత్‌ తట్టుకోగల్గుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

మున్ముందు తగ్గొచ్చు..: అయితే కొన్ని కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్ల రీత్యా మున్ముందు క్రెడిట్‌ నిష్పత్తి తగ్గే అవకాశం ఉందనీ ఆయన అన్నారు. ప్రధానంగా మౌలిక రంగం వల్లే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో క్రెడిట్‌ నిష్పత్తి పెరిగిందని చెప్పారు. రేటింగ్‌ పెంచిన కంపెనీల్లో మూడొంతులు ఈ రంగానివేనని తెలిపారు. ప్రాజెక్టుల అనుమతులు వేగవంతం కావడం, అధిక కాంట్రాక్టులు రావడం లాంటివి మౌలిక రంగ కంపెనీల రేటింగ్‌ పెంపునకు దోహదం చేశాయని క్రిసిల్‌ పేర్కొంది. ఆర్‌బీఐ కీలక రేట్ల పెంపు పరిణామాల వల్ల కంపెనీల పెట్టుబడులు నెమ్మదించొచ్చని క్రిసిల్‌ నీరింగ్‌, నిర్మాణం, రోడ్డు లాంటి రంగాల్లో రేటింగ్‌ పెంపు ఎక్కువగా ఉందని పేర్కొంది. రేటింగ్‌ను పెంచిన కంపెనీల్లో దాదాపు సగం వరకు ఈ రంగాల్లోనే ఉన్నాయని తెలిపింది. రేటింగ్‌ను తగ్గించడానికి ఆయా కంపెనీలకు పలు కారణాలు దోహదపడ్డాయని పేర్కొంది. పాలనాపరమైన ఇబ్బందులు, ముడి సరకు వ్యయాలు పెరగడం, ప్రాజెక్టుల జాప్యం లాంటివి ఇందులో కొన్ని అని ఇక్రా వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని