స్థానిక వార్తలపై.. ఎమ్‌ఎస్‌ఓలకు కేంద్రం మార్గదర్శకాలు

స్థానిక వార్తలు, వర్తమాన అంశాలతో కూడిన సొంత ప్రోగ్రాములను తమ నెట్‌వర్క్‌లలో ప్లాట్‌ఫాం సేవలు (పీఎస్‌)గా అందించాలనుకునే మల్టీ-సిస్టమ్‌ ఆపరేటర్ల(ఎమ్‌ఎస్‌ఓ)కు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది.

Published : 01 Dec 2022 01:36 IST

దిల్లీ: స్థానిక వార్తలు, వర్తమాన అంశాలతో కూడిన సొంత ప్రోగ్రాములను తమ నెట్‌వర్క్‌లలో ప్లాట్‌ఫాం సేవలు (పీఎస్‌)గా అందించాలనుకునే మల్టీ-సిస్టమ్‌ ఆపరేటర్ల(ఎమ్‌ఎస్‌ఓ)కు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. మూడు నెలల్లోగా ఈ సంస్థలు ‘కంపెనీ’గా నమోదు చేసుకోవాలని, ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సొంత ప్రోగ్రామింగ్‌ సేవలను నేరుగా లేదా ఒకటి లేదా ఎక్కువమంది స్థానిక కేబుల్‌ ఆపరేటర్ల ద్వారా తమ వినియోగదార్లకు ప్రసారం చేయడానికి ఎమ్‌ఎస్‌ఓలకు అనుమతిచ్చేందుకు సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఒక్కో ఛానల్‌కు రూ.1,000 సాధారణ ఫీజును ఎమ్‌ఎస్‌ఓలు చెల్లించి, ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయొచ్చని ఆ శాఖ తెలిపింది. ఒక్కో ఆపరేటరు మొత్తం ఛానళ్ల సామర్థ్యంలో పీఎస్‌ ఛానళ్లను అయిదు శాతానికి పరిమితం చేసుకోవాలని స్పష్టం చేసింది. జిల్లా స్థాయిలో రెండు పీఎస్‌ ఛానళ్లకు అనుమతి ఇచ్చింది. ‘ఈ పీఎస్‌ కంటెంట్‌ను ఎమ్‌ఎస్‌ఓలు ఇతర పంపిణీ ప్లాట్‌ఫాం ఆపరేటర్లతో ప్రత్యక్షంగా, పరోక్షంగా పంచుకోవడానికి వీలు ఉండదు. అయితే దేవాలయాలు, గురుద్వారాల వంటి మతపరమైన ప్రాంగణాల నుంచి లైవ్‌ ఫీడ్లను మాత్రం పంచుకోవచ్చ’ని అందులో తెలిపింది. అన్ని పీఎస్‌ ఛానల్‌ ప్రోగ్రాములకు చెందిన కనీసం 90 రోజుల రికార్డులను దాచి ఉంచాలనీ ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని