దేశ ప్రతిష్ఠపై ప్రభావం ఉండదు

అదానీ గ్రూప్‌ రూ.20,000 కోట్ల మలి విడత పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)ను ఉపసంహరించుకున్న నేపథ్యంలో దేశ ఆర్థిక ప్రతిష్ఠపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం పునరుద్ఘాటించారు.

Updated : 05 Feb 2023 06:39 IST

అదానీ ఎఫ్‌పీఓ ఉపసంహరణపై సీతారామన్‌

ముంబయి: అదానీ గ్రూప్‌ రూ.20,000 కోట్ల మలి విడత పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)ను ఉపసంహరించుకున్న నేపథ్యంలో దేశ ఆర్థిక ప్రతిష్ఠపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం పునరుద్ఘాటించారు. దేశ స్థూల ఆర్థిక మూలాలు గానీ, ప్రతిష్ఠ గానీ ప్రభావితం కాలేదని.. ఎఫ్‌పీఓలు రావడం, ఎఫ్‌ఐఐలు (విదేశీ సంస్థాగత మదుపర్లు) వెళ్లిపోవడం సాధారణంగానే జరుగుతుంటాయన్నారు. గత రెండు రోజుల్లో దేశ విదేశీ మారక నిల్వలు 800 కోట్ల డాలర్ల మేర పెరిగాయని తెలిపారు. ప్రతి మార్కెట్‌లోనూ ఒడుదొడుకులు అనేవి వస్తుంటాయని, గత కొన్ని రోజులుగా మన మార్కెట్‌లో వస్తున్న వార్తలతో దేశం, దాని స్వాభావిక బలాలు రెండింటి గురించిన అవగాహన చెక్కుచెదరకుండా ఉందని వివరించారు.

ఆ పని నియంత్రణ సంస్థలు చూసుకుంటాయ్‌:అదానీ గ్రూప్‌ షేర్ల పతనంపై మంత్రి మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో నియంత్రణ సంస్థలు వాటి పని అవి చేస్తాయని తెలిపారు. ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), ఎల్‌ఐసీ ఇప్పటికే దీనిపై స్పందించాయి. ప్రభుత్వంతో సంబంధం లేకుండా నియంత్రణ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. మార్కెట్లను క్రమబద్ధీకరించేందుకు తగిన చర్యలు తీసుకుంటాయి. సెబీ ఆ పరిస్థితుల్ని దగ్గర్నుంచి పర్యవేక్షిస్తుంద’ని మంత్రి వెల్లడించారు.  

స్టాక్‌ మార్కెట్‌ పటిష్ఠతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం:  సెబీ

స్టాక్‌ మార్కెట్‌ పటిష్ఠతను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని.. షేర్లలో తీవ్ర హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు ఇప్పటికే అన్ని రకాలుగా అవసరమైన నిఘా చర్యలను చేపట్టామని మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ శనివారం వెల్లడించింది. అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనంపై సెబీ ఎందుకు స్పందించడం లేదంటూ అటు ప్రతిపక్షాల నుంచి, విశ్లేషకుల నుంచి విమర్శలు వస్తున్న వేళ.. పై విధమైన స్పష్టతను ఇవ్వడం గమనార్హం. అయితే అదానీ గ్రూపు అని ప్రత్యేకంగా పేరు ప్రస్తావించకుండా.. ఒక దిగ్గజ వ్యాపార గ్రూపు కంపెనీల షేర్లు గత వారంలో అసాధారణ రీతిలో చలించడాన్ని గుర్తించినట్లు సెబీ తెలిపింది. కానీ అధికారులు మాత్రం.. అదానీ వ్యవహారంపైనే సెబీ పై వ్యాఖ్యలు చేసిందని చెబుతున్నారు. ‘స్టాక్‌ మార్కెట్లు ఒక క్రమపద్ధతిలో, సమర్థంగా పనిచేసేలా చూడడం సెబీ బాధ్యత. నిర్దిష్ట షేర్లలో తీవ్ర హెచ్చు తగ్గుల నియంత్రణకు పలు చర్యలను ఇప్పటికే చేపట్టాం. ఒకవేళ ఏదేని షేర్లలో అనూహ్య ఒడుదొడుకులు చోటుచేసుకుంటే.. వాటంతట అవే ఈ చర్యలు అమల్లోకి వచ్చేస్తాయ’ని సెబీ వివరించింది. అయితే అదానీ షేర్ల వ్యవహారంలో ఏమైనా దర్యాప్తు చేస్తోందా? లేదా? అనే విషయంపై సెబీ స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.

మరో వైపు, తమ మొత్తం నికర రుణాల్లో అదానీ గ్రూపునకు ఇచ్చిన రుణాల విలువ 0.94 శాతంగా ఉంటుందని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలియజేసింది. అదానీ గ్రూపునకు ఇచ్చిన రుణాల విషయంలో ఇబ్బందేమీ లేదని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు