సంచార్‌ సాథీ పోర్టల్‌పై మొబైల్‌ ఫోన్లను బ్లాక్‌ చేయొచ్చు

దేశవ్యాప్తంగా పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్‌ ఫోన్లను సంచార్‌ సాథీ పోర్టల్‌పై ప్రజలు బ్లాక్‌ చేయడంతో పాటు ట్రాక్‌ చేసుకోవచ్చని టెలికాం విభాగం (డాట్‌) వెల్లడించింది.

Updated : 17 May 2023 03:15 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్‌ ఫోన్లను సంచార్‌ సాథీ పోర్టల్‌పై ప్రజలు బ్లాక్‌ చేయడంతో పాటు ట్రాక్‌ చేసుకోవచ్చని టెలికాం విభాగం (డాట్‌) వెల్లడించింది. మంగళవారం ఈ పోర్టల్‌ను డాట్‌ ప్రారంభించింది. వాడిన మొబైల్‌ ఫోన్‌ను కొనుగోలు చేయకముందే ఆ ఫోన్‌ వివరాలను ఈ పోర్టల్‌లో తనిఖీ చేసుకునే సదుపాయం ఉందని కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. ‘మొదటి విడత సంచార్‌ సాథీ పోర్టల్‌ను సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ (సీఈఐఆర్‌)గా రూపొందించాం. ఎవరైనా మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకుంటే ఈ పోర్టల్‌ను సందర్శించొచ్చు. కొంత ధ్రువీకరణ తనిఖీల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలు, టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లను సంప్రదించే సదుపాయం ఉంటుంది. అనంతరం మీ ఫోన్లను బ్లాక్‌ చేయొచ్చు’ అని వైష్ణవ్‌ తెలిపారు.

* వ్యక్తులు ఏ మొబైల్‌ నంబరుతో అయినా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడితే, ఆ సేవలను నిలిపివేయడానికి మెటాకు చెందిన వాట్సాప్‌ అంగీకరించినట్లు వైష్ణవ్‌ స్పష్టం చేశారు. వాట్సాప్‌ కాల్స్‌ ద్వారా మోసాలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నించగా ఈ సమాధానం ఇచ్చారు. అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సైతం ఇందుకు సహకరిస్తున్నాయన్నారు. మోసాలు చేసినందుకు ఇప్పటివరకు 36 లక్షల మొబైల్‌ కనెక్షన్‌లను నిలిపివేశామని, దీంతో వాటి వాట్సాప్‌ ఖాతాలు కూడా ఆగిపోయినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని