విప్రోలో మధ్యస్థాయి ఉద్యోగాల కోత.. ఆన్‌సైట్‌లో ఉన్నవారిపై ప్రభావం

ప్రముఖ ఐటీ సంస్థ విప్రో వందల కొద్దీ మధ్యస్థాయి ఉద్యోగులకు ‘లేఆఫ్‌’ ఇవ్వనుంది. ఇందువల్ల  ‘ఆన్‌సైట్‌’ ఉద్యోగులపైనే అధిక ప్రభావం ఉండనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారిని ఉటంకిస్తూ ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. లాభదాయకతను పెంచుకునేందుకే సంస్థ ఇలా చేస్తోందని సమాచారం.

Updated : 01 Feb 2024 10:20 IST

ప్రముఖ ఐటీ సంస్థ విప్రో వందల కొద్దీ మధ్యస్థాయి ఉద్యోగులకు ‘లేఆఫ్‌’ ఇవ్వనుంది. ఇందువల్ల  ‘ఆన్‌సైట్‌’ ఉద్యోగులపైనే అధిక ప్రభావం ఉండనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారిని ఉటంకిస్తూ ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. లాభదాయకతను పెంచుకునేందుకే సంస్థ ఇలా చేస్తోందని సమాచారం. డిసెంబరు త్రైమాసికంలో విప్రో మార్జిన్‌ 16 శాతంగా నమోదయ్యింది. అదే సమయంలో టీసీఎస్‌ 25%, ఇన్ఫోసిస్‌ 20.5%, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 19.8% మార్జిన్‌ను ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే ఆన్‌సైట్‌లో ఉన్న మధ్యస్థాయి ఉద్యోగులను తగ్గించేందుకు విప్రో ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

  • దేశీయంగా పనిచేస్తున్న సిబ్బందితో పోలిస్తే, విదేశాల్లోని ఖాతాదారుల వద్ద (ఆన్‌సైట్‌) పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు అధికంగా ఉంటాయి. అందువల్ల వారిని తగ్గిస్తే, వేతన బిల్లు భారం రూపేణ కొంత తగ్గుతుంది. జనవరి ప్రారంభంలోనే సంబంధిత ఉద్యోగులకు ఈ విషయంపై సంస్థ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
  • 2021లో కన్సల్టింగ్‌ సేవల సంస్థ క్యాప్కోను 145 కోట్ల డాలర్ల (సుమారు రూ.12,035 కోట్ల)కు విప్రో స్వాధీనం చేసుకుంది. కొవిడ్‌ పరిణామాల తర్వాత వేర్వేరు కారణాలతో, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు మందగమనంలోనే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కన్సల్టింగ్‌ సేవలకు అనుకూల వాతావరణం కనిపించడం లేదు. అదే సమయంలో క్యాప్కో సంస్థలో పనిచేస్తున్న ఆన్‌సైట్‌ ఉద్యోగులు విప్రోకు భారం అవుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సంస్థ లాభాల శాతాన్ని పెంచాలని చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌పై ఒత్తిడి ఉందని, ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నాయి.

హోదాల తగ్గింపు: మరోవైపు.. ఉన్నత స్థాయి ఉద్యోగుల హోదా కాస్త తగ్గించి, మధ్యస్థాయికి తీసుకురావడమనే వ్యూహాన్నీ పాటించేందుకు విప్రో సిద్ధం అవుతోంది. ‘లెవల్‌ 3లో ఉన్న ఉద్యోగి..లెవల్‌ 2లోనూ పనిచేయడం, అదే సమయంలో లెవల్‌ 1 ఉద్యోగితో లెవల్‌ 2 పనులను చేయించేందుకూ సంస్థ ప్రయత్నిస్తోంది. లెవల్‌ 1 ఉద్యోగాలను యాంత్రీకరణ చేసేందుకు ఉన్న అవకాశాలనూ కంపెనీ పరిశీలిస్తోంది. ఈ వ్యవహారంపై విప్రో ప్రతినిధి స్పందిస్తూ.. ‘మానవ వనరులు, నిపుణులపై పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మారుతున్న మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా, అన్ని రకాలుగా సంస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్న’ట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని