ట్విటర్‌ కొత్త సీఈఓగా భారతీయుడు

పరాగ్‌ అగర్వాల్‌కు పగ్గాలు

 జాక్‌ డోర్సే రాజీనామా

 బోర్డులో కొనసాగుతారు

న్యూయార్క్‌/శాన్‌ఫ్రాన్సిస్కో

సామాజిక మాధ్యమం ట్విటర్‌కు కొత్త సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారి)గా భారత సంతతికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌ (45) నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన కంపెనీకి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌(సీటీఓ)గా ఉన్నారు. కంపెనీ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే సోమవారం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ‘పదహారేళ్ల పాటు కంపెనీలో సహ వ్యవస్థాపకుడి నుంచి సీఈఓగా, సీఈఓ నుంచి ఛైర్మన్‌..ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా; ఆ తర్వాత తాత్కాలిక సీఈఓ, సీఈఓగా.. ఇలా యాత్ర సాగింది. చివరిసారిగా ఇపుడు బయటకెళ్లాలని నిర్ణయించుకున్నా..’ అని డోర్సే ట్విటర్‌లో రాసుకొచ్చారు. ‘వ్యవస్థాపక నాయకత్వంలోనే ఒక కంపెనీ ఉండడం చాలా ముఖ్యమంటూ చాలా చర్చలు నడుస్తున్నాయి. ఈ వాదన చాలా పరిమితమని.. వైఫల్యానికి అదీ ఒక కారణమవుతుందని నేను విశ్వసిస్తా. కంపెనీ పునాదులు, వ్యవస్థాపకుల నుంచి కంపెనీ బయటకు రావడానికి నేను చాలా కష్టపడ్డా’ అని కూడా అందులో పేర్కొన్నారు.

ఆ మూడు కారణాలు..

అగర్వాల్‌ విషయానికొస్తే.. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, స్టాన్‌ఫోర్డ్‌లో పీహెచ్‌డీ చదువుకున్నారు. తాజా నియామకంపై ఆయన స్పందిస్తూ ‘ఈ పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తా’నని పేర్కొన్నారు. డోర్సేకు కృతజ్ఞతలు చెబుతూ.. ‘మీ మార్గదర్శనం, స్నేహం కొనసాగుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు. పరాగ్‌ను ఈ స్థానంలో నిలబెట్టడానికి మూడు కారణాలున్నాయని డోర్సే అన్నారు. ‘బోర్డు చాలా తీవ్రంగా వెతికింది. ఏకగ్రీవంగా పరాగ్‌ను ఎంచుకుంది. కొంత కాలంగా నా ఎంపిక కూడా అతడే. ఎందుకంటే కంపెనీని, కంపెనీ అవసరాలను అతను లోతుగా అర్థం చేసుకున్నాడు. ప్రతి కీలక నిర్ణయం వెనక పరాగ్‌ ఉన్నారు. ఈ కంపెనీ ఇలా మారడానికి కారణమయ్యారు. అంతే కాదు.. ఆసక్తి, హేతుబద్ధత, సృజనాత్మకత, వినయం అన్నీ ఉన్నాయి. మనసు పెట్టి పనిచేస్తారు. మా సీఈఓగా నాకు అతనిపై అచంచల విశ్వాసం ఉంద’ని డోర్సే చెప్పారు.

పదేళ్ల కిందటే చేరిక

2011లో ట్విటర్‌లో అగర్వాల్‌ చేరారు. అపుడు 1000 మంది కంటే తక్కువ  ఉద్యోగులే సంస్థలో ఉండేవారు. 2017 నుంచీ సీటీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పరాగ్‌ మాట్లాడుతూ ‘పదేళ్లు గడిపోయినా.. నాకు నిన్నటిలాగే ఉంది. ఎత్తుపల్లాలు, సవాళ్లు, గెలుపులు, ఓటములు.. అన్నీ చూశాను. అయితే అప్పటికి.. ఇప్పటికీ ట్విటర్‌ ప్రభావం అద్భుతంగా మారింది. మా ప్రగతి కొనసాగిస్తాం. మా ముందు గొప్ప అవకాశాలెన్నో ఉన్నాయి. మా లక్ష్యాలను చేరడానికి ఇటీవలే వ్యూహాలను మెరుగుపరచుకున్నాం. మా కీలక సవాలు ఏమిటంటే.. మేం ఎలా పనిచేస్తాం. ఫలితాలను ఎలా సాధిస్తామనే. మా వినియోగదార్లకు, వాటాదార్లకు.. అందరికీ అత్యుత్తమ ఫలితాలను అందించడానికి సిద్ధంగా ఉంటామ’ని వివరించారు.

డోర్సే ఎందుకు వెళ్లారంటే..

డోర్సే స్థాపించిన ఆర్థిక చెల్లింపుల కంపెనీ స్వ్కేర్‌కు సైతం డోర్సే సీఈఓగానే ఉన్నారు. అయితే రెండు కంపెనీలను సమర్థంగా ఎలా నిర్వహించగలరని ఆ కంపెనీలోని కొంత మంది పెద్ద పెట్టుబడుదార్లు గతంలో బహిరంగంగానే ప్రశ్నించారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌ను ట్విటర్‌ నిషేధించిన సమయంలోనూ విమర్శలు వచ్చాయి. 2022లో పదవీ కాలం ముగిసేంత వరకు ట్విటర్‌ బోర్డులో డోర్సే కొనసాగనున్నారు. డోర్సే రాజీనామాతో ట్విటర్‌ షేర్లు సోమవారం ప్రారంభ గంటలో 10 శాతం పైగా లాభాలు పొందడం గమనార్హం.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని