డిజిటల్‌ కరెన్సీ వచ్చే ఏడాదే!

‘మేము తీసుకున్న పరపతి విధాన నిర్ణయాలు వృద్ధికి ఊతమిస్తున్నాయి. కీలక రేట్లను యథాతథంగా ఉంచడం సహా సర్దుబాటు వైఖరిని కొనసాగించేందుకు ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లోఅయిదుగురు ఆమోదం తెలిపారు.

Published : 09 Dec 2021 01:54 IST

తొమ్మిదోసారీ కీలక రేట్లు యథాతథం

జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతం

ద్రవ్యోల్బణ అంచనా 5.3 శాతం

ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష

‘మేము తీసుకున్న పరపతి విధాన నిర్ణయాలు వృద్ధికి ఊతమిస్తున్నాయి. కీలక రేట్లను యథాతథంగా ఉంచడం సహా సర్దుబాటు వైఖరిని కొనసాగించేందుకు ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లోఅయిదుగురు ఆమోదం తెలిపారు. వాస్తవ వృద్ధి రేటు అంచనాలను మార్పులేకుండా 9.5 శాతం వద్దే కొనసాగిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గించడంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కాస్త దిగివచ్చి,  ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌తో దేశంలో మూడో దశ ఉద్ధృతి వచ్చినా, ప్రస్తుత పరపతి విధాన వైఖరితో ఆర్థిక రికవరీ సులభమవుతుంది. ఇప్పటికీ కొన్ని రంగాలు కొవిడ్‌ ముందు స్థాయికి  చేరలేదు. వినియోగదారు గిరాకీ, ప్రైవేటు పెట్టుబడులు ఇంకా తక్కువగానే ఉన్నాయి. డిజిటల్‌ కరెన్సీ ఆవిష్కరణ పనులు కొనసాగుతున్నాయి.’

- శక్తికాంత దాస్‌, ఆర్‌బీఐ గవర్నరు

ముంబయి: ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సహకరించేంద]ుకు, రుణ రేట్లు అతి తక్కువగా ఉండేలా చూసేందుకే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రాధాన్యమిచ్చింది. ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బుధవారం వెల్లడించారు. రెపో రేటును స్థిరంగా 4 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రివర్స్‌ రెపో రేటును కూడా 3.35 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు సర్దుబాటు విధాన వైఖరి కొనసాగించాలని నిర్ణయించింది. 2020 మే 22న కీలక రేట్లలో కోత విధించాక, వరుసగా 9వ సమావేశంలోనూ అవే కొనసాగించింది. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఆందోళనలు ప్రబలుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్ల మార్పు జోలికి ఆర్‌బీఐ వెళ్లకపోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. అందుకు అనుగుణంగానే వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. 2021-22 వృద్ధి అంచనాను మార్పులేకుండా 9.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. తమ విదేశీ శాఖలకు మూలధనం అందించేందుకు బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వివరించింది.

ఐపీఓలకు రూ.5 లక్షల వరకు యూపీఐ చెల్లింపులు

డిజిటల్‌ లావాదేవీలను మరింతగా పెంచేందుకు, ఈ లావాదేవీలకు వసూలు చేస్తున్న ఛార్జీలపై త్వరలోనే ఒక చర్చా పత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌, ఐపీఓ దరఖాస్తులకు యూపీఐ లావాదేవీ పరిమితిని రూ.2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది.

ఫీచర్‌ ఫోన్లతోనూ యూపీఐ చెల్లింపులు!: ఇప్పటివరకు స్మార్ట్‌ ఫోన్లతోనే యూపీఐ చెల్లింపులు చేయగలుగుతున్నాం. ఇకపై ఫీచర్‌ ఫోన్లతోనూ డిజిటల్‌ చెల్లింపులు జరిపేలా యూపీఐ ఆధారిత చెల్లింపు ఉత్పత్తులను ఆవిష్కరించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. దేశంలో దాదాపు 50 కోట్ల ఫీచర్‌ ఫోన్లు ఇంకా వాడుకలో ఉన్నాయి. ‘రిటైల్‌ పేమెంట్స్‌’ థీమ్‌ కింద ఇప్పటికే ఆవిష్కరించిన సొల్యూషన్లను ఫీచర్‌ఫోన్‌ చెల్లింపులకు వినియోగించుకోవవాలని ఆర్‌బీఐ భావిస్తోంది.  

(తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్ష 2022 ఫిబ్రవరి 7-9 తేదీల్లో)

సైబర్‌ భద్రతే కీలకం

సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీని (సీబీడీసీ) ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న ఆర్‌బీఐ, నూతన వ్యవస్థలో సైబర్‌ భద్రత అధికంగా ఉండేలా, డిజిటల్‌ మోసాలకు తావులేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గవర్నర్‌ వివరించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రయోగాత్మకంగా అధికారిక డిజిటల్‌ కరెన్సీని ఆవిష్కరించేందుకు ఆర్‌బీఐ కసరత్తు చేస్తోంది.

పటిష్ఠ చట్టం రూపొందించాకే: డేటా భద్రత చట్టాన్ని తీసుకువచ్చాకే సీబీడీసీని ఆవిష్క రించాలని ఆర్‌బీఐ పూర్వ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు.  డిజిటల్‌ కరెన్సీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో తెలుసుకునేందుకు వీలవుతుందని వివరించారు.

2022-23లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5 శాతం!

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5 శాతం సమీపంలో ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. సరఫరాలు పెంచేందుకు ప్రభుత్వ చర్యలు, ఇంధనంపై సుంకాల తగ్గింపు వల్ల రవాణా వ్యయాలు తగ్గడం కలిసొస్తుందని పేర్కొంది. పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని అంచనా వేసింది. 2022 మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబరు-డిసెంబరు) 5.1 శాతం, నాలుగో త్రైమాసికంలో (జనవరి-మార్చి) 5.7 శాతంగా ద్రవ్యోల్బణం నమోదు కావొచ్చని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు