ద్విచక్ర వాహనాలపై జీఎస్‌టీని తగ్గించండి

ద్విచక్ర వాహనాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రేటును 18 శాతానికి తగ్గించి, గిరాకీ పెరిగేలా చూడాలని ప్రభుత్వానికి ఆటోమొబైల్‌ డీలర్ల సంఘం ఫాడా విజ్ఞప్తి చేసింది. బడ్జెట్‌ 2022-23ను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్న

Published : 18 Jan 2022 02:18 IST

బడ్జెట్‌-2022

దిల్లీ: ద్విచక్ర వాహనాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రేటును 18 శాతానికి తగ్గించి, గిరాకీ పెరిగేలా చూడాలని ప్రభుత్వానికి ఆటోమొబైల్‌ డీలర్ల సంఘం ఫాడా విజ్ఞప్తి చేసింది. బడ్జెట్‌ 2022-23ను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్న తరుణంలో ఆర్థిక శాఖకు ఫాడా తన ప్రతిపాదనలు తెలిపింది. ‘విలాసవంత ఉత్పత్తులకు వర్తించే 28 శాతం జీఎస్‌టీ + 2 శాతం సెస్సును ద్విచక్ర వాహనాలపై విధించడం సరికాదు. గ్రామీణ ప్రజలు తమ రోజువారీ పనులకు వీటిపైనే ఆధారపడుతున్నారు. ముడి పదార్థాల ధరల వల్ల, 3-4 నెలలకు ఒకసారి వాహన ధరలను కంపెనీలు పెంచుతున్నాయి. జీఎస్‌టీ భారం వల్ల కొనలేకపోతున్నారు. అందువల్ల జీఎస్‌టీ రేటు తగ్గిస్తే, గిరాకీ పెంచడానికి ఉపయోగపడుతుంద’ని ఫాడా వివరించింది.

* వినియోగించిన (సెకండ్‌ హ్యాండ్‌) వాహనాలకు ఏకరీతిన 5% జీఎస్‌టీ విధిస్తే ప్రభుత్వానికి, డీలర్లకు, వాహన యజమానులకు కూడా మంచి జరుగుతుంది. ప్రస్తుతం వినియోగించిన కార్లపై 12% (4 మీటర్లలోపు); 18 %(4 మీటర్లపైన ఉంటే) జీఎస్‌టీ వసూలు చేస్తున్నారు.

* ప్రభుత్వం రూ.400 కోట్ల వరకు టర్నోవరు ఉండే ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలకు కార్పొరేట్‌ పన్నును 25 శాతానికి తగ్గించింది. అన్ని ఎల్‌ఎల్‌పీ, ప్రొప్రైటరీ, పార్టనర్‌షిప్‌ కంపెనీలకు కూడా ఈ ప్రయోజనాలను అందించాలి. దీని వల్ల 50 లక్షల మందికి ఉపాధినిస్తున్న ఈ విభాగంలోని వ్యాపారుల సెంటిమెంటు మెరుగుపడుతుంది.


పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వ్యవధి తగ్గించాలి: ఐబీఏ

దాయపు పన్ను మినహాయింపు కోసం ఉపయోగపడే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కాల వ్యవధిని తగ్గించాలని బ్యాంకులు కోరుతున్నాయి. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల (ఈఎల్‌ఎస్‌ఎస్‌)కు వర్తించే వ్యవధినే వీటికీ ఇవ్వాలని అంటున్నాయి. ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్‌ 80సీ ప్రకారం బ్యాంకులో చేసే ‘పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట’్లకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇది ఆ సెక్షన్‌ పరిమితి రూ.1.50లక్షలకు లోబడి ఉంటుంది. ఈ డిపాజిట్లను అయిదేళ్లపాటు కొనసాగించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ల వ్యవధి మూడేళ్లే. తక్కువ వ్యవధి ఉండటంతో చాలామంది పన్ను చెల్లింపుదారులు వీటి వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఫలితంగా ‘పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల’కు అంతగా ఆదరణ ఉండటం లేదని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) పేర్కొంది.  ‘ఐటీ ఖర్చులు, సులభతర వ్యాపార నిర్వహణ, డిజిటల్‌ బ్యాంకింగ్‌.. తదితరాలకు అయ్యే వాస్తవ వ్యయాలకు ప్రత్యేక ట్యాక్స్‌ రిబేటు, మినహాయింపు, తరుగుదల (125 శాతం) ఇవ్వాలి’ అని కోరుతూ ఐబీఏ తన బడ్జెట్‌ ప్రతిపాదనలను అందించింది. పన్ను వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వివాద పరిష్కార వేదిక ఏర్పాటు చేయాలనీ కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని